Home » జై భీమ్ చూస్తుంటే ఆ ఘటన గుర్తొచ్చింది…

జై భీమ్ చూస్తుంటే ఆ ఘటన గుర్తొచ్చింది…

జై భీమ్ సినిమా చూశాను…నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కండ్లకు కట్టినట్టు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.
సినిమా చూసినట్టు నాకు కనబడలేదు.
అశ్లీలత, ఫైటింగ్లు లేవు.
ఉన్నతమైన నేటి సమాజం, ప్రత్యేకంగా యువ న్యాయవాది సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యతను, సందేశాత్మక సంకేతాలనే జై భీమ్ సినిమా సమాజానికి పంపింది.
ప్రజా ఉద్యమాల్లోనే ఉంటున్న నాకు, ఈ సినిమాలోని ఒక ఘట్టానికి అవినాభావ సంబంధం ఉంది. 37 ఏళ్ల కిందటి ఘటన కళ్ళముందు కదలాడింది.సినిమాలో సినతల్లి పెట్టిన కేసును ఎలాగైనా ఉపసంహరింప చేయాలని పోలీసు బాస్…..నీ భర్త ఎటు రాడు… కనీసం పరిహారం అందుకొని, కోర్టు కేసు ఉపసంహాయించుకో అన్న సందర్భంలో.. సినతల్లి ఇచ్చిన సమాధానం వ్యవస్థలకు దిమ్మ తిరిగేలా ఉంటుంది.
ఈ సందర్బంగా నేను చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా వుండగా, తిరుపతిలో జరిగిన ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వచ్చింది.
నగరంలో కోతిని ఆడించుకొంటూ పొట్టపోసుకునే లక్ష్మి అనే మహిళ, గూడు లేక రాత్రి సమయాల్లో ఏదో ఒక ప్లాట్ ఫారం పై పడుకునే అభాగ్యురాలు…
ఒక రోజు రాత్రి బీట్ కానిస్టేబుల్స్ యదావిధిగా తమ లాటీలతో దబాయించుకుంటూ వస్తున్నారు. బిక్షగాళ్ళంతా భయపడి పరుగెత్తారు. కోతిని ఆడించుకునే లక్ష్మి పరుగెత్తడానికి ప్రయత్నించే క్రమం లో.. పోలీసులు ఆమెను కాలితో తన్నడంతో, ఆమె తల పక్కనే ఉన్న రాయికి బలంగా తాకడంతో, అక్కడికక్కడే మృతి చెందింది. ఆ మృతదేహం పక్కన, ఆమెకు జీవితం అయిన కోతి మాత్రమే ఉండిపోయింది.
అదే సమయానికి సినిమాకు వెళ్ళిన పార్టీ యువజన సంఘం నాయకులు, టీ కోసమని బస్ స్టాండుకు వచ్చిన క్రమంలో.. జరిగిన దారుణం వారి కంట పడింది. విషయం తెలియగానే యువజన నాయకులతో పాటు, మేము కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాం.
తెల్లవారుజామున మృతదేహాన్ని తోపుడుబండిపై పడుకోబెట్టి , నిరసన ప్రదర్శన ప్రారంబించా ం . నిరసన కేవలం 25 మంది తినే ప్రారంభమైంది. విషయం తెలియడంతో క్రమంగా వందల మంది జత కలిశారు. లక్ష్మి కి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ, మరుసటి రోజు బందుకు పిలుపునిచాము. లక్ష్మి అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు, ఆమె చేతిలో పెరిగిన కోతి ఆ మృత దేహాన్ని అంటి పెట్టుకొని ఉండడం హృదయాన్ని బరువెక్కించింది.
మేము బంద్ కు పిలుపు ఇచ్చిన రోజునే, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు తిరుమల పర్యటన ఉంది. ఈ క్రమంలో రాత్రి 11-12 గంటల సమయంలో కొందరు పోలీసులు వచ్చి, నన్ను తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయనికి తీసుకెళ్ళారు.
అక్కడ ఆనాటి కలెక్టర్ సుబ్బారావ్ గారు, ఎస్పీ ఆల్ఫ్రెడ్ ఉన్నారు. వారు నాతో మీరు తలపెట్టిన రేపటిబంద్ పిలుపును ఉపసంహరించుకోండి. నగరంలో ముఖ్యమంత్రి పర్యటన ఉంది అన్నారు.వారి ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించాను.
ఆ సమయంలో అధికారులు ఇద్దరూ నాతో…. చనిపోయిన లక్ష్మిది ఈ ప్రాంతం కాదు, ఆస్తిపరూరాలు కాదు, కుల బలం లేదు. ఆలాంటి వ్యక్తి కోసం మీరు పోరాటం చేస్తే మీకు గాని , మీపార్టికిగాని వచ్చే లాభం ఏమిటి అని అడగంతో పాటు, పైపెచ్హు మీపై కేసులు పడటంతప్పు అని వ్యాఖ్యానించారు. వారికి ఒకే సమాదానంగా… “మా ఉద్యమం వలన సామాజిక చైతన్యం కలిగి సామాన్య ప్రజలు కూడా ధైర్యంగా నివసించగలరు. అదే సమయంలో అధికారులు కూడా బాద్యతగా ప్రవర్తించేందుకు ఈ ఉద్యమం అవసరం అనేసాను..
ఏమిటో ఈయన మార్క్సిిజాన్ని తిరగేసి చదువుతున్నారు” అని కామెంట్ కూడా చేశారు.
మరుసటి రోజు బంద్ విజయవంతంగా జరిగింది.పోలీసులు ముందుగానే అన్నట్టు మాపై కేసులు కూడా పడ్డాయి.
చిత్తూరు సబ్ జైలులో వారం పాటు నిర్బందించబడ్డాము..
మా ఉద్యమ సందేశం ఆనాడు నగరంలో హాకర్స్ , రిక్షా తదితర అసంఘటిత కార్మిక సంఘాలు బలపడడానికి ఊతం ఇచ్చింది. జై భీమ్ సినిమా చుస్తుంటే.. 37 ఏడు ఏళ్ల క్రితం పోలీసుల అకృత్యాలకు బలైన లక్ష్మి, నాటి పోరాటం సినిమా రీళ్ళు లాగా నాకండ్ల ముందు కదులుతున్నాయి.

డాక్టర్ కే నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి

Leave a Reply