Suryaa.co.in

Entertainment

మేలిమి కాంచనం..!

రంభా ఊర్వశి తలదన్నే
రమణీలలామ ఎవరీమె
నన్నే వెదకుచు
భూమికి దిగిన
కన్నిక రతియే కాబోలు..
అదే అందంతో అలాగే
భూమికి దిగింది కాంచన..
నింగిలో ఎగిరే విమానం నుంచి
ఎయిర్ హోస్టెస్ రూపంలో
వీరాభిమన్యుతో కలిసి
ప్రేమించి చూడు అంటూ
కళ్యాణమండపానికి..!

అందమైన పొగరు..
సొగసరి..ఆపై గడసరి..
ఒకనాటి సినిమాల నీలాంబరి..
పూజకు వేళాయెరా..
రంగ పూజకు వేళాయెరా
అందాల ఆరబోతతో తుకారాముని దీక్షను భగ్నం చేసే యత్నంలో..
ఆతడు పారవశ్యంతో.. హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున
జన్మించు భాగ్యమే
లేదాయె తల్లీ..
అనగా నడుము వంగగా
ఒడలు కుంగగా..
సుందర దేహం సినిమాలో
అస్తిపంజరమ్ము అయినా..
ఎనభై మూడేళ్ల వయసులో
ఇప్పటికీ కళ తగ్గని మొముతో..
స్త్రీ రూప కాంచనమ్మై
విరాజిల్లె..మనసే అందాల
బృందావనమై..!

నాటి అగ్రనాయకులు నల్గురికీ
ఇష్ట సఖిగా వెలిగిన
ఈ కౌముది
ఎందుకో వేయలేదు సప్తపది..
అవేకళ్లు అలాగే మెరుస్తూ
దానగుణంలో నేనంటే నేనే
అంటూ మురిసి..
దైవసేవలోనే గడుపుతున్న
శ్రీకృష్ణావతారం సత్యభామ
మరల మరల ప్రతి ఏడూ
ఇలాగే మధుర మధుర గీతం
పాడుకుంటూ జన్మదిన వినోదం
నూరేళ్ళ పొద్దూ జరుపుకోవాలి
ఒకనాటి సుందర వసుంధర..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE