Suryaa.co.in

Entertainment Political News

అతడే ఒక చరిత్ర!

ఒకే వ్యక్తి తానే
రాముడూ రావణుడైతే..
అదే వ్యక్తి భీముడు..దుర్యోధనుడు..
కీచకుడు..కిరీటిగా మారితే..
తానే కృష్ణుడు..కర్ణుడు…
బృహన్నల..
ఇలా బహురూపాలు ధరిస్తే..
నవ మన్మధుడైన జగదేకవీరుడు..
పండు ముదుసలి భీష్ముడైతే..
వాల్మీకిగా మారి
రామాయణం విరచిస్తే..
బ్రహ్మం గారిగా
కాలజ్ఞానం చెబితే..
రాయల్ గా కృష్ణదేవరాయలైతే
గోపాలుడు..భూపాలుడైతే..
అగ్గి పిడుగుగా అవతరిస్తే..
బందిపోటుగా మారి అభిమానుల హృదయాలు కొల్లగొడితే..
అతడే తిరుగులేని కథానాయకుడై..
ఒకనాటికి ఎదురులేని
మహానాయకుడైతే..
అతడు నందమూరి
తారక రామారావు కాక ఇంకెవరవుతారు?
మూడక్షరాల సంచలనం
ఆరు దశాబ్దాల చరిత్ర!

ఇలాంటి ఓ స్టార్
క్రికెట్లో ఉంటే
ఆల్ రౌండర్..
సినిమాల్లో గనక
ఆయనో వండర్..
ఆ అభినయం అనితరసాధ్యం
ఆ ఆహార్యం
వేరొకరికి అసాధ్యం..
ఆ ఉచ్ఛారణ ఓ ప్రేరణ..
సినిమాని ఒంటి చేత్తో
నడిపిన నాయకుడు..
రాజకీయాలను సింగిల్ హేండుతో శాసించిన తెలుగుదేశాధీశుడు
అతడే ఒక సైన్యం
అన్నే ప్రభంజనం..!

అరవై నిండినా
అలుపెరుగని వయసు
ప్రజాసేవ వైపు
మళ్ళింది మనసు..
ఒక ఆలోచన..
శేషజీవితం
ప్రజలకే అర్పణం..
తెలుగుదేశం పార్టీకి అంకురార్పణం..
కాంగిరేసు వైభోగానికి తర్పణం..
ఎన్నో ఏళ్ల ఢిల్లీ పెద్దల
అచ్చున్న అప్పనం..
ఒక్క దెబ్బతో
ఈ అభినవ కృష్ణార్పణం!

తమిళ రాజకీయాల్లో
ఎంజీఆర్ ఒక శక్తి..
ఆయన రాజకీయ ప్రస్థానం
ఒక పరంపరా సన్నివేశం..
కాని నందమూరి
ఒక ఆవేశం..
అనూహ్య రీతిలో
పరకాయ ప్రవేశం..
అడుగు పెట్టింది
మొదలు సంచలనాలే..
తొలి ప్రయత్నంలోనే ఊహించని విజయం..
నాదెండ్ల ఉదంతంతో పడిలేచిన కెరటం..
జాతీయ రాజకీయాల్లో
ఉత్తుంగ తరంగం
కాంగ్రెస్ పతనానికి అతగాడి ప్రస్థానమే శ్రీకారం..
విపక్షాల ఐక్యతకు
ఎన్టీఆర్ ప్రవేశమే ఓంకారం..
ఆయన ఆవేశమే
హస్తం పార్టీకి తిరస్కారం..
అందుకు ఆయనకు
ఓ పెద్ద నమస్కారం..!

యాక్టరే కదాని
ఇందిరమ్మ అనుకుంటే
అణు రియాక్టరే కాలేదా..
రాజకీయాల్లోకి అడుగుపెట్టాక
తెలుగుజాతికి ఆయనే అయ్యాడు సమస్తం..
కాంగ్రెస్సుకు భస్మాసురహస్తం..
దేశమంతా
ఎన్టీఆర్ ప్రశస్తం..
ఆయన కీర్తి విశ్వవ్యాప్తం!

నటుడిగా ఎంతో..
రాజకీయ నాయకుడిగానూ అంతే..ఆయన ప్రస్థానం
మొత్తం ఓ వింతే..
రణం ఆయన గుణం..
నటన ప్రాణం..
జనం ఆయన గణం..
కారణజన్మ..
ఇందుకు ఆయన జీవితమే తిరుగులేని తార్కాణం..!

మొత్తానికి నందమూరి
వచ్చే వరకు కాంగ్రెస్
అహం బ్రహ్మస్మి
ఆ జగదేకవీరుడు పఠిస్తే
ఏకో అనేకో హమస్మి..
హస్తం హతోస్మి..
తెలుగుజాతి
ఆత్మగౌరవం ధన్యోస్మి..!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
నందమూరి తారకరామారావు
జయంతి సందర్భంగా
నివాళి అర్పిస్తూ…

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE