పేరులో నేముంది.. ఈ వివాదం వెనక ఏముంది..!?

– ఆరోగ్య వర్సిటీకి రాజకీయ వైరస్!

ఇంతకీ ఇవి కోరి తెచ్చుకుంటున్న వివాదాలేనా..!
ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చి..
ఎన్టీఆర్ బదులుగా
వైఎస్సార్ పేరును
చేర్చాలన్న ప్రతిపాదన వైసిపి ప్రభుత్వం హయాంలో చెలరేగిన అత్యంత వివాదాస్పద నిర్ణయంగా పరిణమించింది.
ఈ నిర్ణయం వెనక జగన్ ఏం ప్రయోజనాన్ని ఆశించారో గాని ఇది చుట్టూ తిరిగి ఆయన ప్రభుత్వానికి.. పార్టీకి..వ్యక్తిగతంగా ఆయనకు చెడ్డపేరు తెచ్చే రీతిలోనే పరిణామాలు సాగుతున్నాయి.

నిజానికి ఎన్టీఆర్ పేరును తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలన్న ఆలోచనకు వైసిపి మొన్న జిల్లాల పునర్విభజన సమయంలో బీజాలు వేసింది..ఎన్టీఆర్ సొంత జిల్లాకు ఆయన పేరు పెట్టడం ద్వారా ఆయన సొంత పార్టీ అయిన తెలుగుదేశం కన్నా.. ఆయన అల్లుడు.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటే..ఆయన బిడ్డలను మించి తానే నందమూరి తారక రామారావు పట్ల ఎక్కువ అభిమానాన్ని కలిగి ఉన్నాననే విషయాన్ని చాటింపు వేసుకునేందుకు జగన్మోహన రెడ్డి ప్రయత్నం చేశారు.

ఎన్టీఆర్ సొంత జిల్లాకు ఆయన పేరు పెట్టడం మంచి నిర్ణయమే కాని దీని వల్ల ఆ తెలుగు తేజం కీర్తి ప్రతిష్టలు కొత్తగా పెరిగిపోయింది ఏమీ లేదు.
ఎన్టీఆర్ మేరునగం..
రాజకీయాల్లోకి రాకమునుపే ఆయన విశ్వవిఖ్యాతుడు..
తెలుగుదేశం పార్టీని స్థాపించడం..అతి తక్కువ వ్యవధిలో అధికారంలోకి వచ్చి తదనంతరం జాతీయ రాజకీయాలలో కూడా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఒక వెలుగు వెలగడం..
ఇవన్నీ ఆయన అసమాన ఖ్యాతికి అద్దం పట్టే చారిత్రక అంశాలు.అలాంటి వ్యక్తి పేరును ఆయన సొంత జిల్లాకు పెట్టడం మంచిదే కాని అదేదో ఎన్టీఆర్ కి మహోపకారం చేసినట్టు బిల్డప్ ఇవ్వడం
కొంత ఓవర్ యాక్షన్..!

సరే..చేసిందేదో చేసిన జగన్ అక్కడితో ఆగిపోతే బాగుండేది..ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించి తన తండ్రి పేరును పెట్టాలన్న నిర్ణయంతో మరో నిప్పు రాజేసారు..ఈ నిర్ణయంతో జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా ఏదైతే ప్లస్ జరిగిందని భావించారో అది ఒక్కసారిగా కొట్టుకుపోయినంత పనైంది.
నిజానికి ఈ నిర్ణయం సహేతుకం కాదని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.జిల్లాకు పేరు పెట్టడం..విశ్వవిద్యాలయం పేరు మార్చడం..అదేదో సినిమాలో ఎవరో అన్నట్టు ఒక ప్రాణం తీశాను..ఇంకో ప్రాణం పోసాను..లెక్క సరిపోయిందన్నంత తేలికైన విషయం కాదు..
ఇది చాలా సీరియస్ మ్యాటర్..
ఈ ఉదంతం విదేశాల్లో ఉన్న తెలుగు వారికి కూడా తీవ్ర మనస్తాపం కలిగించింది..జిల్లాకు పేరు పెట్టినప్పుడు పెద్దగా మాటాడుకోని రాజకీయేతర జనం కూడా విశ్వవిద్యాలయం పేరు మార్పు విషయంలో ప్రభుత్వ వైఖరిని..ముఖ్యంగా ముఖ్యమంత్రి వ్యవహార శైలిని పెద్దగానే తప్పు పడుతున్నారు.అందునా ఎన్టీఆర్ పేరు తొలగించి తన తండ్రి వైఎస్సార్ పేరు పెట్టడం
మరింత వివాదాస్పదం అయింది.ఆరోగ్య విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్…అలాంటిది ఆయన పేరు తొలగించి రాజశేఖర రెడ్డి పేరు పెట్టడాన్ని సామాన్య ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

సరే..ఇదంతా ఒక ఎత్తయితే ఈ ఉదంతంలో లక్ష్మీపార్వతి ప్రమేయం కూడా ఉందన్న వార్తలు ఇప్పుడు మరీ విస్తృతంగా చర్చకు వస్తున్నాయి..
జిల్లాకి పేరు పెట్టడం.. యూనివర్సిటీలో పేరు తొలగించడం..ఏది మీకు ఓకే..అని లక్ష్మీపార్వతిని జగన్ అడిగినట్టు..ఆమె జిల్లా పేరు వైపే మొగ్గు చూపినట్లు వచ్చిన వార్తలు మరిన్ని చర్చలకు..వివాదాలకు తావిస్తున్నాయి..సొంత పార్టీలోనే ఎవరికీ.. మంత్రులకు సైతం చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటారని ముద్ర పడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు విషయంలో లక్ష్మీపార్వతిని సంప్రదించారా..ఈ విషయం వైఎస్సార్ పార్టీ జనాలకే విస్మయం కలిగిస్తోంది.. ఇది అక్కడితో అయిపోలేదు.

ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు ఆలోచన జగన్ బుర్రలో అప్పటికప్పుడు పుట్టింది కాదని..కొత్త జిల్లాల ఆవిర్భావం సమయంలోనే అందుకు అంకురార్పణ జరిగిందనేది లక్ష్మీపార్వతి ప్రమేయం వ్యవహారం ద్వారా తేటతెల్లం అవుతోంది..
మరి ఈ విషయం కనీసం బయటికి పొక్కలేదంటే జగన్పా ర్టీలో..ప్రభుత్వంలో ఎవరితోనూ తన ఆలోచన పంచుకోనట్టేగా..అలాంటి జగన్ లక్ష్మీపార్వతిని అడిగారంటే ఏమనుకోవాలి!?
ఇప్పుడు జగన్ ఏ కొత్త వివాదాన్నయితే తలకెత్తుకుని ఒక్కసారిగా దాన్ని దావానలంలా జనంలోకి తీసుకుపోయారో అదంతా జనం దృష్టిని మరల్చడానికేనన్న అపప్రద ఒకటి..
అమరావతి వ్యవహారం జోరందుకోవడం..ఇతరత్రా ప్రభుత్వం చవిచూస్తున్న వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఒక వ్యూహం ప్రకారం ఆరోగ్య వర్సిటీ పేరు వివాదాన్ని జగన్ తెరపైకి తెచ్చారని ఒక చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తోంది…అమరావతి ఉద్యమం ఊపందుకునేట్టు
చెయ్యడంలో తలమునకలై ఉన్న తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఈ కొత్త వివాదంపై దృష్టి పెట్టక తప్పని పరిస్థితి..!

ఆరోగ్య వర్సిటీలో ఎన్టీఆర్ పేరును తొలగించినా తెలుగుదేశం పట్టించుకోక అమరావతి ఉద్యమం వ్యవహారంలో మాత్రమే తలమునకలై ఉంటే “చూసారా..ఎన్టీఆర్ అంటే సొంత పార్టీకే లెక్క లేకుండా పోయింద” ని ప్రచారం చేసుకోడానికి వైసిపికి అదో బ్రహ్మాస్త్రం అవుతుంది..!
మొత్తానికి ఎన్నికలకు ముందు ఇలాంటి చమక్కులు..షాకులు ఇంకెన్ని ఉంటాయో… చూడాలి మరి..!

ఇ.సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286