చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా..!

అమ్మను మించి దైవమున్నదా..
ఆత్మను మించి అర్థమున్నదా..!

అమ్మ ఇచ్చిన దేహంలో
అన్నిటినీ మించిన అవయవం గుండె..
దాని కదలికే మన ఊపిరి..
అది ఉన్నంతవరకే
మన శ్వాస..
అది ఆడమన్నట్టు
నువ్వు ఆడకపోయినా…
అది ఆడుతున్నంత సేపే
నువ్వు ఆడేది..!

నీ రక్త ప్రసరణ..
ఉచ్వాశనిశ్వాసాలు..
నీ భయం..నీ అభయం..
నీ ఆరోగ్యం..
నీ మహాభాగ్యం..
నీ భావం..నీ శైవం..
అదే ఆగిపోయిన నాడు
నువ్వు శవం..!

చూసుకో పదిలంగా..
హృదయాన్ని అద్దంలా..
కదిలేది కాలం ఏదైనా..
రగిలేది నీలో వేదన..!

కవి చెప్పినా..రవి చెప్పినా
ఆ గుండెను కాపాడుకొమ్మనే..
అనవసర ఆలోచనలు..
కలుషిత శ్వాసలు..
వృధా ప్రయాసలు..
ఆపై ఆయాసాలు…
వీటికి దూరంగా
నీ గుండె ఉంటే
నువ్వు బండ..
అప్పుడు నువ్వు కావెవరికీ
ఓ గుదిబండ..!

నీకు అవసరమేమో
కుట్రలు..కుతంత్రాలు..
పనికిరాని విషయాలపై అటెన్షన్లు..
నిజానికి అవన్నీ
నీ గుండె
తట్టుకోలేని టెన్షన్లు..!
ఇవన్నీ వద్దు వద్దురాని
నీ గుండె ఎప్పుడూ
ఇస్తుంది కాషన్లు..
పట్టించుకోని నీకు
లేనిపోని పరేషాన్లు..
ఆపై ఆపరేషన్లు..!

స్టెంటు..బైపాస్..
ఓపెన్ హార్ట్..
పరాకాష్టగా గుండె మార్పిడి..
వీటన్నిటికీ కారణం..
నీలోని రాపిడి..
అతిగా ఆశపడి
సంపాదించే ధనం..
అందుకోసం అంతర్మధనం..
నీ యాతన..నీ వేదన..
అదంతా నీ గుండెకు కోత..
నీ వెత..నీ కలత..
అంతిమంగా
నీ గుండెకు నలత..!

గుండె మంట..
గుండె కోత..
గుండె కరిగి..
గుండెల్లో గుడి..
ఇలా గుండెకు
ఎన్నో భాషలు..
అవే నీ జీవితకాలపు ఘోషలు..
అలా గుండె రాయి
చేసుకుని నువ్వుంటే
నువ్వో బండరాయి..
సాటి మనిషి కష్టానికి
నువ్వు కరిగితే
నువ్వు మానవతకే
కలికితురాయి..
నీ గుండెలో
శాంతి దూత పావురాయి..
ఉన్నంత కాలం నీ జీవితం
హాయి హాయి..!

గుండె మంటలారిపే
సన్నీళ్లు కన్నీళ్లు..
ఉండమన్న ఉండవమ్మ
సాన్నాళ్ళు..
నీ గుండె..నీ ఆస్తి..
అది చెదిరితే..చెడితే..
ఇక నీ బ్రతుక్కే స్వస్తి..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply