Suryaa.co.in

Editorial

కల్వకుంట్ల సిద్ధాంతి ఎన్నికల పంచాంగం!

( మార్తి సుబ్రహ్మణ్యం)

మా ఆయనే ఉంటే మంగలి ఎందుకన్నది పాతకాలపు సామెత. అప్పట్లో భర్త మృతి చెందితే మహిళకు శిరోముండనం చేయించే సంప్రదాయం ఉండేది. ఆ సందర్భంలో పుట్టిన సామెత ఇది. తెలంగాణ జాతిపిత.. జ్యోతిష శాస్త్ర పితామహుడు, డాక్టర్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్ధాంతి తాజాగా ఏపీ ఎన్నికలపై చెప్పిన జోస్యం ఇప్పుడు హాట్ టాపిక్.

‘తాను దూర సందులేదుగానీ మెడకో డోలు’ అన్నట్లుంది చంద్రశేఖర సిద్ధాంతి జోస్యం! తెలంగాణలో తన పార్టీకే ఠికాణా లేని కేసీఆర్, పక్క రాష్ట్రంలో ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పడమే వింత. సహజంగా ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసి, ఆ ఏడాది జరగబోయే వాటి గురించి జ్యోతిష పండితులు భవిష్యవాణి వినిపిస్తుంటారు. అయితే ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర సిద్ధాంతి ఏపీలో ఎన్నికల పంచాంగం వినిపించి, జగన్‌కు జైకొట్టారు.

ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని 11 జాతీయ మీడియా చానెళ్లు, సర్వే సంస్థలూ స్పష్టం చే శాయి. అధికార వైసీపీలో టికెట్లు దక్కిన ఎంపి, ఎమ్మెల్యేలు కూడా గోడదూకుతున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులకు వరసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఎన్డీయే అభ్యర్దుల నామినేషన్ల పర్వం జనసంద్రంతో కిటకిటలాడుతుంటే, వైసీపీ అభ్యర్ధుల నామినేషన్ల పర్వం వెలవెలపోతోంది. ఇదీ ఏపీ ఎన్నికల ముఖచిత్రం.అలాంటిది ఏపీలో మళ్లీ జగన్ సీఎం అవుతారంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన జోస్యం ఆయనను నవ్వులపాలు చేస్తోంది.

ఎందుకంటే ఆయన ఏలుబడిలోని బీఆర్‌ఎస్ కారు కష్టాల దారిలో నడుస్తోంది. గెలిచిన 39 మంది మంది ఎమ్మెల్యేలలో 29 మంది మాత్రమే మిగిలారు. ఆ మిగిలిన వారిలో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎంతమంది ఉంటారు? ఎంతమంది జంపవుతారన్నది కేసీఆర్‌కే తెలియని గందరగోళం. టికెట్ ఖరారు చేసిన తర్వాత కూడా ఇతర పార్టీల్లోకి వెళుతున్న విషాదం.

పైగా ‘ఇప్పుడు జరిగేవి దేశ ఎన్నికలన్న’ది తెలంగాణ ప్రజల్లో నాటుకుపోయిన భావన. అందుకే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ.. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే చేసేదేమీలేదు. అయినా ఆ పార్టీలో గెలిచిన వాళ్లు ఆ తర్వాత ఏ పార్టీలో ఉంటారో తెలియద’ంటూ మైండ్‌గేమ్ ప్రారంభించారు. ఫలితంగా బీఆర్‌ఎర్‌కు ఒకటి రెండు సీట్లు రావచ్చని, లేకపోతే అది కూడా కష్టమేనన్న అంచనా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది.

ఇలాంటి గందరగోళ పరిస్థితిలో, ఇల్లు చక్కదిద్దుకోవడంపై దృష్టి సారించకుండా.. ఏపీలో జగన్ మళ్లీ సీఎం అవుతారని చెప్పిన జోస్యం, అభాసుపాలవుతోంది. ఇది ఒకరకంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆంధ్రా సెటిలర్ల ఓట్లను, బీఆర్‌ఎస్‌కు దూరం చేసేవేనన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం బీఆర్‌ఎస్ తుడిచిపెట్టుకుపోయినా, గ్రేటర్ పరిథిలోని నియోజకవర్గాలే కారును కాపాడాయి చంద్రబాబును జైల్లో పెట్టించారన్న ఆగ్రహంతో, సెటిలర్లు కారెక్కారన్నది నిష్ఠురనిజం. సనన్‌నగర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాల్లోని సెటిలర్లు, బీఆర్‌ఎస్‌కే జైకొట్టడాన్ని విస్మరించకూడదు.

తాజాగా కేసీఆర్ వైసీపీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలతో, సెటిలర్ల ఓట్లు కూడా కొండెక్కినట్లే. ఇప్పటికే సెటిలర్లు జగన్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్ పాలనా వైఫల్యం కారణాలతోనే, లక్షలాదిమంది ఏపీ నుంచి మళ్లీ హైదరాబాద్‌కు వలస వచ్చేశారన్నది, అన్ని వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు తెలియకపోవడమే వింత. పైగా చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత, ఏపీలో జరుగుతున్న తొలి ఎన్నికలివి. హైదరాబాద్‌లోని సెటిలర్లతో టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధులు, జిల్లాలు-నియోజకవర్గాల వారీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.

తెలంగాణ జాతిపిత తాజా వ్యాఖ్యలతో మల్కాజిగిరి, మేడ్చెల్, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ల, భువనగిరి, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గాలపై పడటం ఖాయమన్నది విశ్లేషకుల వ్యాఖ్య. పైగా ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్, తెలంగాణలోని సెటిలర్లంతా కాంగ్రెస్‌కు చేయెత్తి జైకొట్టడం ఖాయం. జగన్-కేసీఆర్‌పై జమిలిగా ఆగ్రహం ఉన్న సెటిలర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు ఓటేస్తే, ఇక ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌లో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారన్నదే ప్రశ్న.

తెలంగాణ జాతిపిత కాళేశ్వరరావు గారు తాను ఎంపిక చేసుకుని- తనను ఎంపిక చేసుకున్న టీవీలో నిర్నిరోధంగా చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన వివరణ చూడముచ్చట. సహజంగా కేసీఆర్ మాటల మాంత్రికుడే కాబట్టి, కిందపడ్డా తనదే పైచేయి అని వాదించగల దిట్ట. అందులో ఆయన విజ్ఞానంమీద ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. కాళే శ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులపై ఆయన ఇచ్చిన అనర్గళ ప్రసంగమేదో… మొన్నా మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరయి ఇచ్చి ఉంటే, బీఆర్‌ఎస్‌కు పరువైనా దక్కి ఉండేది కదా? రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అసెంబ్లీకి వెళ్లకుండా, వందకిలోమీటర్ల దూరం ఉన్న నల్లగొండ జిల్లా పార్టీ మీటింగుకు వెళ్లడం ఎందుకు?

కాళేశ్వరం ప్రాజెక్టును స్వయంగా తానే డిజైన్ చేశానని సగర్వంగా ప్రకటించుకున్న కేసీఆర్, ఇప్పుడు మాట మార్చి… తాను డిజైనర్ కాదని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు, దళితుడిని సీం చేస్తానని సెలవిచ్చిన మహానేత ఆయన. తీరా అధికారంలోకి వచ్చాక తూచ్.. తాను ఆమాట అనలేదన్న కేసీఆర్ నిబద్ధత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పుడు కొత్తగా గొర్రెల పంపిణీపై మంత్రి సంతకం చేసిన తర్వాత వచ్చే గైడ్‌లైన్స్ కూడా, ఐఏఎస్‌లకు అర్ధం కావని సెలవచ్చారు. క్లారిఫిరేకన్స్ రాయడం, గవర్నరమెంటు బద్నాం అయ్యేదట. కానీ తాను క్యాబినెట్, కలెక్టర్లను పిలిచి గైడ్‌లైన్స్ తయారుచేయించానని సెలవిచ్చారు. అంటే తెలంగాణలో పనిచేసే కలెక్టర్లకు మెదడు లేకపోతే, తాను దగ్గరుండి మరీ వారి మెదళ్లు పనిచేయించేలా చేశానని చెప్పడమే కేసీఆర్ కవి హృదయమన్నమాట.

సరే ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు 8 నుంచి 10 సీట్లు వస్తాయన్నది కేసీఆర్ జోస్యం. నిజంగా అన్ని సీట్లు వచ్చే వాతావరణమే ఉంటే.. సీట్లు కూడా దక్కించుకున్న వాళ్లు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి ఎందుకు వెళతారు? సీటు ఇస్తామన్నా ఎందుకు పారిపోయారన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

LEAVE A RESPONSE