Home » భారతీరెడ్డి చేతికి వైసీపీ పగ్గాలు?

భారతీరెడ్డి చేతికి వైసీపీ పగ్గాలు?

– లోక్‌సభకు జగన్?
– అసెంబ్లీకి జగన్ డుమ్మా?
– అవినాష్‌తో రాజీనామా ?
– పులివెందుల బరిలో భారతీరెడ్డి?
– వైసీపీలో కొత్త చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకున్న వైసీపీకి కొత్త అధ్యక్షురాలు రానున్నారా? పార్టీ అధినేత జగన్ లోక్‌సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? ఆయన భార్య భారతరెడ్డికి పార్టీ పగ్గాలందించే యోచన చేస్తున్నారా?.. ఇదీ ఇప్పడు వైసీపీ వర్గాల్లో జరుగుతున్న సరికొత్త చర్చ.

వైనాట్ 175? వైనాట్ కుప్పం? అని అతిగా మాట్లాడి కుప్పకూలిన వైసీపీకి కొత్త నాయకురాలు రాబోతోందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో మొదలయింది. నిన్నటి నుంచి ఇది సీనియర్ల మధ్య జోరుగా జరుగుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. వైసీపీ అధ్యక్షురాలిగా జగన్ భార్య భారతీరెడ్డిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరాజయ నేపథ్యంలో మహిళ నాయకురాలిగా ఉండటమే మంచిదన్న చర్చ జరుగుతోంది.

పైగా 151 సీట్లతో ముఖ్యమంత్రిగా ఎదురులేకుండా పాలించిన జగన్, ఇప్పుడు కనీసం ప్రతిపక్షనేత హోదా కూడా లేకుండా, అసెంబ్లీలోకి అడుగుపెట్టడంపైనా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వాన్ని ఎండకట్టేందుకు సరిపడా ఎమ్మెల్యేల సంఖ్య లేకుండా.. అతి త క్కువ సమయం మాత్రమే లభించే ప్రతిపక్ష నేత పాత్రలో, జగన్ ఇమడలేరని పలువురు సీనియర్లు బహిరంగంగానే చెబుతున్నారు. పైగా సభలో ఒక చిన్న గదిలో కూర్చునేందుకు ఆయన అహం ఒప్పుకోదంటున్నారు. 40శాతం ఓట్లు వచ్చినప్పటికీ, శాసనసభలో 11 సీట్లు మాత్రమే ఉన్నందున.. బయట ఎంత స్వేచ్ఛగా మాట్లాడినప్పటికీ, సభలో మాత్రం పార్టీ వాణి వినిపించటం సాధ్యం కాదంటున్నారు. పైగా జగన్‌కు టీడీపీ ప్రభుత్వం నిబంధనల మేరకే అవకాశం ఇస్తుంది కాబట్టి.. అసలు జగన్ అసెంబ్లీకి అడుగుపెట్టాలా? వద్దా? అన్న చర్చ కూడా జరుగుతోందట.

దీనిపై పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిమంది సీనియర్లు మాత్రం.. తక్కువ సంఖ్యాబలం ఉన్నప్పటికీ, ప్రజాతీర్పుమేరకు, సభకు వెళ్లి పోరాడటమే మంచిదని సూచించారట. కానీ ఎక్కువమంది మాత్రం, అంత స్వల్ప సంఖ్యతో జగన్ సభలో అడుగుపెట్టడం వలన అవమానాలు ఎదురయ్యే అవకాశాలే ఎక్కువ అని సూచిస్తున్నారు.

జగన్ వల్ల అవమానాలు ఎదుర్కొన్న చాలామంది ఇప్పుడు సభలో ఉన్నందున, వారంతా జగన్‌ను ర్యాగింగ్ చేస్తారని కూడా హెచ్చరించినట్లు సమాచారం. పార్టీ వర్గాలు మాత్రం ప్రమాణ స్వీకారం తర్వాత, జగన్ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవని చెబుతున్నారు.

జాతీయ రాజకీయాల్లో పరిణామాలు మారే అవకాశం ఉన్నందున, జగన్ లోక్‌సభకు వెళ్లటం ద్వారా, రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవచ్చన్న ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీకి లోక్‌సభలో నాలుగు స్థానాలే ఉన్నప్పటికీ, రాజ్యసభలో మాత్రం 9 మంది ఎంపీలు ఉన్నారు.అంటే మొత్తం పార్లమెంటులో 13 మంది సంఖ్యాబలం ఉంటుంది. రాజ్యసభలో బీజేపీబలం అంతంత మాత్రమే కావడంతో, నెంబర్‌గేమ్‌తో ఉనికి కాపాడుకోవచ్చన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం ద్వారా. రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవచ్చన్న వ్యూహం కూడా లేకపోలేదంటున్నారు.

ఇదిలాఉండగా పార్టీ పగ్గాలు భారతీరెడ్డికి ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ, తెరవెనుక పులివెందుల రెడ్ల సహాయంతో పాలించింది ఆమేనన్న ప్రచారం లేకపోలేదు. ‘‘నిజం చెప్పాలంటే పార్టీని నడిపించింది జగన్ గారు కాదు. భారతీరెడ్డి. కడప జిల్లాకు చెందిన సజ్జల, ధనుంజయరెడ్డి, అవినాష్‌రెడ్డి అని అందరికీ తెలుసు. అందుకే జగన్‌గారు సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయారన్న సంగతి బయటవాళ్లకు ఎంతమందికి తెలుసు’’ అని ఒక తూర్పుగోదావరిజిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

సభలో భారతీరెడ్డి ఉంటే ఆ పరిణామాలు వేరేలా ఉంటాయన్న అంచనా, పార్టీ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె పార్టీ అధ్యక్షురాలిగా బయటకొస్తే.. క్యాడర్‌లో కొంత ఉత్సాహం వచ్చే అవకాశం ఉందన్నది వారి అంచనాలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఆయన స్థానంలో భారతీరెడ్డిని పోటీ చేయించవచ్చని పులివెందుల వర్గాలు సైతం సూచనప్రాయంగా చెబుతున్నాయి. ఆ ప్రకారంగా.. కడప ఎంపీగా అవినాష్‌రెడ్డితో రాజీనామా చేయించి, ఆ స్థానం నుంచి జగన్ ఉప ఎన్నికలో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అవినాష్‌రెడ్డి అందుకు అంగీకరిస్తారో లేదో చూడాలి.

Leave a Reply