Suryaa.co.in

Editorial

సిట్టింగ్..ఫిట్టింగ్

– కేసీఆర్ ప్రకటనతో నేతలలో ప్రకంపనలు
– వచ్చే ఎన్నికల్లో సీట్లపై ఆశ పెట్టుకున్న సీనియర్లు
– సిట్టింగులకే సీట్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనలతో పూర్తి నిరాశ
– ఇప్పటికే సుమారు 40 స్థానాల్లో సీట్ల కోసం పోటీ, అసమ్మతి
– టికెట్లు దక్కవనుకున్న నేతల పక్కచూపులు తప్పవా?
-కాంగ్రెస్-బీజేపీకి ఆయుధాలు అందించారంటన్న టీఆర్‌ఎస్ సీనియర్లు
– తెరాస అధినేత తొందరపడ్డారని ఆవేదన
– బీజేపీ-కాంగ్రెస్ బలపడుతున్న వేళ ఆ ప్రకటన ఆ పార్టీలకే లాభమని విశ్లేషణ
– ‘కారు’లో అసంతృప్తి మంటలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

అసలే అనేక చోట్ల అసమ్మతి.. ఎమ్మెల్యే టికెట్ల కోసం ఇప్పటినుంచి ఉరుకులు..స్టేషన్ ఘనపూర్ లాంటి చోటయితే అగ్రనేతల బహిరంగ మాటల యుద్ధం.. మరోవైపు.. రాజకీయ మైదానంలోకి హటాత్తుగా శరవేగంతో వచ్చి జొరపడ్డ బీజేపీ దూకుడు.. రాష్ట్రానికి వ చ్చే కేంద్రమంత్రులు సర్కారుపై చేస్తున్న వరస మాటల దాడులు.. ఇంకోవైపు క్షేత్రస్థాయిలో ఇల్లు చక్కదిద్దుకుని, మైదానంలోకి దూకుతున్న కాంగ్రెస్ జోరు..అటు వైపు తెరాసకు చెందిన నేతల కంపెనీలు, ఆస్తులపై ఐటీ, ఈడీ దాడులు. ఇవి సరిపోవన్నట్లు కొత్తగా బీజేపీ తెరపైకి తెచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కాం. కాంగ్రెస్-బీజేపీది వేర్వేరుగా ఒకటే లక్ష్యం. అది అధికార పార్టీలోని అసమ్మతి-అసంతృప్తి నేతలపై గాలం వేయటం!

ఈ సమయంలో.. ‘వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే సీట్లు’ అంటూ గులాబీదళపతి కేసీఆర్ చేసిన ప్రకటన.. అధికార పార్టీ లోని ఆశావహులపై ఆశలు నీళ్లు చల్లగా.. అలాంటి అదను కోసమే చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్న, కాంగ్రెస్-బీజేపీల ప్రయత్నాలకు ఆక్సిజన్ ఇచ్చినట్టయింది. ఒకవైపు బీజేపీ చతురంగ బలగాలను మోహరిస్తున్న వేళ… రాహుల్‌గాంధీ జోడో యాత్రతో తెలంగాణలో కాలుపెడుతున్న వేళ.. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన పార్టీకి సంస్థాగతంగా నష్టమేనన్నది సీనియర్ల ఆందోళన. ఉన్నవారికి తోడు, ఇతర పార్టీల నుంచి చేరిన వారితో.. కాలుకూడా కదపలేనంతగా ఫుల్లయిపోయి, స్టీరింగు తిప్పే జాగా కూడా లేని ‘కారు’లో ‘అసంతృప్తి మంటలు’ మొదలయ్యాయా?

‘సిట్టింగులకే మళ్లీ సీట్లు’ అంటూ ప్రకటించి టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ వ్యూహాత్మక తప్పిదం చేశారా? తెలంగాణ గద్దెను ఆశిస్తున్న కాంగ్రెస్-బీజేపీలకు ఆయనే స్వయంగా ఆయుధాలు అందించారా? తెరాసలోని అసమ్మతి-అసంతృప్తి నేతలను తన ప్రకటన తో, అటు వైపు అడుగులేసేందుకు అవకాశం ఇచ్చారా? కేసీఆర్ ప్రకటన.. టికెట్లు దక్కవనుకున్న తెరాస నేతలను పక్కచూపులు చూసేందుకు చాన్సిచ్చినట్లయిందా? ఇప్పుడు.. టీఆర్‌ఎస్‌లో ఎక్కడ విన్నా ఇదే హాట్‌టాపిక్.

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలున్న నియోజకవర్గాల సంఖ్య, సమారు 40 వరకూ ఉన్నాయి. వీరిలో పలువురు మంత్రుల నియోజకవర్గాలు కూడా ఉండటం విశేషం. ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతితోపాటు.. అక్కడ వారి స్థానంలో సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఆ క్రమంలో.. సిట్టింగులకు వ్యతిరేకంగా ఇప్పటినుంచే ముఠాలు కట్టి, రోడ్డెక్కుతున్న ఘటనలు పార్టీ పరువు తీస్తున్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో అయితే.. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మాజీ మంత్రి కడియం శ్రీహరి మధ్య కోల్డ్‌వార్ ముదురు పాకాన పడింది. ఇద్దరూ ప్రెస్‌మీట్లు పెట్టి ఒకరి అవినీతినిkadiya-rajaiahమరొకరు బయటపెట్టుకునేంత వరకూ వెళ్లింది. తాజాగా మాజీ ఎంపీ డాక్టర్ నర్సయ్యగౌడ్ మంత్రి జగదీష్‌రెడ్డి తనను, కర్నె ప్రభాకర్‌ను తొక్కేయాలని చూస్తున్నారంటూ సంచలన విమర్శలు చేశారు. నిజానికి ఈవిధంగా రోడ్డెక్కింది వీరే అయినప్పటికీ, దాదాపు 30-35 నియోజకవర్గాల్లో ఇంకా రోడ్డెక్కకుండా, రగిలిపోతున్న వారు చాలామంది ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి-మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తాండూర్‌లో మహేందర్‌రెడ్డి-రోహిత్‌రెడ్డి, వికారాబాద్‌లో మెతుకు ఆనంద్-సంజీవరావు, నకిరేకల్‌లో లింగయ్య-వీరేశం, ఆలేరులోtrs సునీతా మహేందర్‌రెడ్డి-సందీప్‌రెడ్డి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఇక వరంగల్ తూర్పులో నన్నపనేని నరేందర్‌కు వ్యతిరేక వర్గం చురుకుగా ఉంటోంది.

పాలేరు, కొత్తగూడెం, సత్తుపల్లి, డోర్నకల్, రామగుండం, మంథని, చొప్పదండి, వేములవాడ, జగిత్యాల, ముథోల్, బోధ్, నారాయణఖేడ్, కొడంగల్, నాగర్ కర్నూల్, దేవరకద్ర ఎమ్మెల్యేలపై సొంత పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక పటన్‌చెరు, ఉప్పల్, ఎల్బీనగర్, హుస్సాబాద్, ఉప్పల్, జహీరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో సీట్ల కోసం సీనియర్లు సిట్టింగులకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ, ఆయా నియోజకవర్గాల్లో సొంత సైన్యం తయారుచేసుకునే పనిలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో తప్ప, మిగిలిన జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి. ఇక ఈటల రాజేందర్ గెలిచిన హుజూరాబాద్‌లో అయితే అరడజను మంది నేతలు సీట్లు ఆశిస్తున్నారు.

ఈ క్రమంలో.. సిట్టింగులకే మళ్లీ సీట్లు’ అంటూ కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో.. ఎమ్మెల్యే సీటుకు పోటీ పడే సత్తా ఉన్న సీనియర్లలో.. పూర్తి నిరాశ,నిస్పృహ ఆవహించినట్లు, వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో అయితే, ఇప్పటికే సిట్టింగులకు పోటీగా, నియోజకవర్గానికి ముగ్గురు-నలుగురు నేతలు సిద్ధమయ్యారు.

నిజానికి జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు చాలామంది.. వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసం ఆశలు పెట్టుకున్నారు. కొందరు సిట్టింగులకు అనారోగ్యం, అవినీతి ఆరోపణలు ఉన్నందున కచ్చితంగా వారిని మారుస్తారన్న ధీమా, సీనియర్లలో మొన్నటివరకూ ఉండేది. కానీ సిట్టింగులకు సీట్లు ఇవ్వడం పార్టీ విధానమని కేసీఆర్ స్పష్టం చేసిన తర్వాత.. ఆశావహులలో కొత్త ఆలోచన తీవ్రతరమయి, అది పక్కచూపులు చూసేందుకు కారణమవుతోంది. అయితే ‘చేతులారా చేసుకుంటే వారిని ఎవరూ కాపాడలేరని’ కేసీఆర్ చేసిన హెచ్చరికను మాత్రం, ఎవరూ పరిగణనలోకి తీసుకోవడ లేదు. సిట్టింగులకే సీట్లు ఇస్తామన్న ప్రకటనపైనే ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది.
ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కాంగ్రెస్-బీజేపీలకు, కేసీఆర్ ప్రకటన కొత్త ఆశలకు పురుడు పోసినట్లయింది. ఉత్తర తెలంగాణతోపాటు, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో అంత పెద్ద బలం లేని బీజేపీ, సరైన అభ్యర్ధుల కోసం జల్లెడ పడుతోంది. ఈ సమయంలో కేసీఆర్ చేసిన ప్రకటనతో, నిరాశతో ఉన్న ఆయా జిల్లాల తెరాస నేతలపై వల వేసేందుకు బీజేపీ వ్యూహబృందం సిద్ధమవుతోంది.

బీజేపీ జాయినింగ్స్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌కు.. తెరాసలోని అసంతృప్తితో ఉన్న నేతలెవరో స్పష్టంగా తెలుసు కాబట్టి.. కేసీఆర్ ప్రకటన ఎక్కువగా బీజేపీకే లాభించవచ్చన్నది, రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మరోవైపు కేసీఆర్ ప్రకటన.. నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్‌కు లాభించవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

తెలంగాణలో నెలకొన్న గందరగోళ రాజకీయాల నేపథ్యంలో.. కేసీఆర్ వంటి వ్యూహకర్త సీట్లకు సంబంధించి, ఇలాంటి ప్రకటన చేయడంపై తెరాస వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. బీజేపీ తెలంగాణలో జండా ఎగురవేసేందుకు సీరియస్‌గా అడుగులు వేస్తు, టీఆర్‌ఎస్‌ని తన వద్ద అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలతో ఇప్పటికే బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టీఆర్‌ఎస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లపై ఐటీ, ఈడీ దాడులు నిర్వహిస్తోంది. చివరకు ఆయన కుటుంబాన్ని కూడా లక్ష్యం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా దూకుడు పెంచుతూ, కాంగ్రెస్‌ను విస్తరించే పనిలో ఉన్నారు.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలో.. సిట్టింగులకే మళ్లీ సీట్లు ఇస్తామని ప్రకటించడం వల్ల, సీట్లపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు జారిపోతారన్న విషయాన్ని కేసీఆర్ ఎలా విస్మరించారో అర్ధం కావడం లేదంటున్నారు. ‘టీడీపీ-కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన వారికీ-ఉద్యమ కాలం నుంచీ పార్టీలో పనిచేస్తున్న వారి మధ్య విభజన రేఖ ఇంకా చెరిగిపోలేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారి నియోజకవర్గాల్లో అయితే పాత-కొత్త వారి మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. ఖమ్మం-వరంగల్ లాంటి జిల్లాల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తున్నారు. మహేశ్వరంలో కూడా ఇదే పరిస్థితి. ముందు అక్కడ నేతల మధ్య సఖ్యతకు కృషి చేయకుండా, సిట్టింగులకే సీట్లు ఇస్తామంటే, ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న వారు పార్టీలో ఎందుకు ఉంటారు? ఎవరైనా ఎమ్మెల్యే టికెట్లు ఆశించే కదా పార్టీలో ఉండేది? అది రాదని తేలిపోయిన తర్వాత, ఎవరి భవిష్యత్తు వారు చూసుకుంటారు. ఇది ఎక్కడైనా జరిగేదే. వ్యూహకర్తగా పేరున్న సారు, ఇలా ఎందుకు ప్రకటించారో మాకూ అర్ధం కావడం లేద’ని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE