హిందీ సినిమాలో మహేంద్ర జాలం..!

నిలి గగన్ కె తలే..
రసికొ ప్యార్ ఛలో..

నిన్ను అందమైన ప్రపంచంలోకి
తీసుకువెళ్ళే ఆ గొంతు..
అచ్చం రఫీలా..
ఎంతో సాఫీగా..
పొద్దున్నే తాగే కాఫీలా..!

అమృతం ఒలికే గళంతో
అమృత్ సర్లో పుట్టిన
మహేంద్రకపూర్..
మొహమ్మద్ రఫీ పాటలు
వినీవినీ ఆయనలా పాడాలని తలచి…
ఆయన గొంతునే వలచి
ఎక్కేసాడు బొంబాయి రైలు..
వెదజల్లేసాడు కొన్ని వేల
పాటల పూలు..!

చలో ఏక్ బార్ ఫిర్ సే
అజ్నభీ బన్ జాయే
హమ్ దోనో..
ఎలాంటి పాటనైనా
అందంగా పలికే స్వరం..
ఇలాంటి సాహిత్యం తోడైతే
తెరిపించదా స్వర్గద్వారం..!

మనోజ్ కుమార్..
సినిమాల్లో ఉప్పొంగే దశభక్తి..
ఆ సినిమా భరత్ కు
మహేంద్ర గొంతంటే
చెప్పలేని అనురక్తి..
మేరే దేశ్ కీ ధర్తీ..
ఉట్టిపడే స్ఫూర్తి..!
రఫీతో తలత్
పాడినా ఒప్పని
మనోజ్ కుమార్…
కైసీ హసీన్ ఆజ్ భరోంకీ రాత్
తన ఆరాధ్యుడు రఫీతో
కలిసిన గళం..
ఇద్దరు పాడేరా..
ఒక్కరే గొంతు మార్చేరా
అన్నట్టు సాగిన గీతం..
మహేంద్రకు ఈడేరిన మనోగతం..!

బంధన్..శక్తి..డోలీ..
ఏక్ నజర్..ఆద్మీ ఔర్ ఇన్సాన్
ఒక పరంపర..
మహేంద్ర గళం నుంచి జాలువారిన అమృతధార..!

తుమ్ అగర్ సాధ్ దేనే కా వాదా కరో..
జిస్కే సప్నే హమే రోజ్ ఆతే రే
తెరే ప్యార్ కే ఆస్రా..
బదల్ జాయే అగర్ మాలీ
కిసీ పత్తర్ కి మూరత్ సే

ఇలా రాస్తూ పోతే
ఈ స్వర మాల..
అదే అందమైన
బినాకా గీత్ మాలా..!

అందరికీ నచ్చే మహాభారత్
టైటిల్ సాంగ్..
నిష్టగా..అందరికీ ఇష్టంగా..
పాడిన సంగీత స్రష్ట..
మహేంద్ర పాటల ప్రయాణానికి పరాకాష్ట..!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply