Suryaa.co.in

Entertainment

సినారె పాటలే వాగ్దేవికి అభిషేకం!

ఆయన పాట రాస్తే..
వాగ్దేవి చరణకింకిణులు
ఘల్లుఘల్లుమన
కరకంకణములు
గలగలలాడగా నర్తించదా..
సరస్వతి వన్నెల
దొరసానిగా ముస్తాబై..
తెలుగువారింట జాజిమల్లిగా
అక్షర జలకాలాడదా..
సినారె..ఏమి రాస్తిరే
అంటూ అంతటి నందమూరి
చిలకలేదా
ఆ పాటల సిరి!

గజల్స్ రాస్తే విజిల్స్..
విశ్వంభరతో భళారే అనిపించుకుని
ఆ మహాజ్ఞాని
అధిరోహించినాడు జ్ఞానపీఠం
అసలు ఆయన ప్రతిపాట
ఎదిగే కవులకు ఓ పాఠం!

సినారె..
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి
అక్షర తరంగాలు..

నీ పాటలతో మా మదిలో
ఒక దీపం వెలిగింది..
నీ రూపమే వెలిసింది..

ఆలరించే వేల గీతాలను
రాసిన కవిరాజుకు
ఏ పారిజాతమ్ము
లీయగలము
గిరిమల్లికలు తప్ప..
గరికపూవులు తప్ప..!

జగతిపై నడయాడు
చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు
శరదిందు చంద్రికా..
ఏకవీరలో ప్రియురాలిని ఇంత అద్భుతంగా ఆవిష్కరించిన అదే సినారె
బందిపోటుగా మారి
వలచిన చెలిని
వగల రాణివి నీవె..అన్నాడు

విద్యాధికుల్లో వచ్చే మార్పులను ఆనాడే ఊహించి మనిషి మదిలోన
మమత లేని చదువులెందుకని
ప్రశ్నించిన కవి..
సినీగీతవినీలాకాశంలో
చిరకాలం ప్రకాశించే రవి..!

చిత్రం భళారే విచిత్రం..
ఆయన గాత్రం..
పరమశివుని మెడలోన
పాము అడిగెను
గరుడా క్షేమమా…
శివుని మెడలో ఉన్నంతవరకు క్షేమమే అన్నాడు గరుడుడు..
నవ్వుకున్నాడు శివుడు..
ఈ పాటలో అద్భుత రచనం
చక్కని అభినయం..
ఎంచక్కని తత్వం..
సినారె మూర్తిమత్వం..!

ఆయన విరచిత ప్రతి అక్షరం లక్షకు సమానం..
సదా రుణపడి ఉండడమే
ఆ మహాకవికి తెలుగుజాతి
ఇవ్వగలిగే సిసలైన బహుమానం..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE