Suryaa.co.in

Entertainment

పోతన..వేమన..త్యాగయ్య..నీకే చెల్లిందయ్యా..!

ఆయన సినిమా వాల్మీకి..
టాలీవుడ్ తండ్రి..
గొంతు విప్పితే మహా గాయకుడు
అంతటి ఘంటసాలే
సందేహింపకు మమ్మా
పాడడానికి భయపడ్డాడమ్మా..
వెండితెర వేమన..
నడవడిలో ఏ తిరకాసు లేని
భక్త రామదాసు..
బాలయోగిని సమాధి వైపు నడిపిన పోతన..
తెలుగు చిత్రసీమకు పెద్దబాసు
ఈ అభినవ తిమ్మరుసు…
ఎన్ని కళాఖండాలు
కలకండలు…
కరిగిపోయిన మేడలు
బళ్లుగా మారిన ఓడలు..
జీవితపు చరమాంకంలో
బీదలపాట్లు..

చిత్తూరు వి నాగయ్య
అవతారమెత్తిన త్యాగయ్య..
అగ్రనటులకే పెద్దయ్య
ఒక తరానికి తాతయ్య…
నటనకు ఆయన
విశ్వవిద్యాలయం
నటులకు గ్రంధాలయం
హృదయం ప్రేమాలయం..

నటుడిగా ఉన్నత శిఖరాలు
నిర్మాతగా లంఖణాలు..
కష్టాలకు వెరవని గుండె
పేద కళాకారులకు అండదండ
మూర్తిగా ఆజానుబాహువు
దానగుణంలో సహస్ర బాహువు
పరుసవేది నేర్చిన
వేమన పాత్ర
చివరకు మిగిలింది
విషాదయాత్ర..
గొప్ప సినిమా అనుకుంటే
రామదాసు చేదు మాత్ర..
మొత్తానికి ఆయన నటన..
జీవితమూ రెండూ పాఠాలే..
ఆయన పాడినవి మాత్రం
ఎప్పటికీ మరచిపోలేని
గొప్ప పాటలే..

మహానటుడు
చిత్తూరు వి నాగయ్య
జయంతి సందర్భంగా
నివాళి అర్పిస్తూ..

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE