Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ రిఫైనరీ ఆధునికీకరణ వ్యయం 26 వేల కోట్లు

-రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) ఆధ్వర్యంలోని విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ వ్యయం 20,928 కోట్ల నుంచి 26,264 కోట్ల రూపాయలకు సవరించినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి సోమవారం రాజ్యసభకు తెలిపారు.

వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 20,928 కోట్ల రూపాయలతో చేపట్టే విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్ట్‌కు జూలై 2016లో హెచ్‌పీసీఎస్‌ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ పనులు 2020 జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 2022 నాటికి ప్రాజెక్ట్‌ పనులు 85 శాతం పూర్తయ్యాయి. సవరించిన లక్ష్యం ప్రకారం ప్రాజెక్ట్‌ పనులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

26,785 ఎంఎంఎస్‌సీఎంల ఎల్‌ఎన్‌జీ దిగుమతులు
ఏప్రిల్‌ 2021 నుంచి జనవరి 2022 వరకు 26,785 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎం) ద్రవరూప సహజ వాయువును దిగుమతి చేసుకున్నట్లు సవరించినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 31,137 ఎంఎంఎస్‌సీఎంల ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి జరిగిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో (ఆన్‌షోర్‌లో) 2016-17 నుంచి 2020-21 వరకు 4,647 ఎంఎంఎస్‌సీఎంల ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి జరిగినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 2017-18లో 32 వేల మెట్రిక్‌ టన్నుల సీఎన్జీ అమ్మకాలు జరగ్గా 2020-21లో అది 13 వేల మెట్రిక్‌ టన్నులకు తగ్గాయని చెప్పారు. కోవిడ్‌ కారణంగా సీఎన్జీ అమ్మకాలు తగ్గినట్లు తెలిపారు. 2021-22లో సీఎన్జీ అమ్మకాలు పుంజుకుని 14 వేల మెట్రిక్‌ టన్నులకు చేరినట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు, విజయవాడ, అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాలు, నెల్లూరు, చిత్తూరు, కోలార్‌, వెల్లూరు జిల్లాల్లో కలిపి మొత్తం 111 సీఎన్జీ స్టేషన్లు ఉన్నట్లు మంత్రి వివరించారు.

LEAVE A RESPONSE