Suryaa.co.in

Entertainment

మాయ చేసి మాయమైన స్మిత..!

ఆమె వ్యాంపు..
చిత్రపరిశ్రమను ఏలింది
ఆమె ఒంపుసొంపు..
బావలు సయ్యా..
మరదలు సయ్యా..
ఇలా మాసుని..
జాణవులే.. నెరజాణవులే
అలా క్లాసును
తన అందంతో ఓలలాడించిన స్మిత..
ఆమె కుల్కు..
జనం మెచ్చిన సిల్కు..!

మాటాడే కళ్ళు…
అవి కొంటె భాషలకు..
చిలిపి బాసలకు ఆనవాళ్ళు..
కాని..
అవి ప్రపంచం చూడని
బాధల లోగిళ్ళు..
మేను నర్తించినా..
ఆ హొయలనే
జనం గుర్తించినా..
కనబడని కష్టాల లోయలు…
శృతి గతీ తప్పిన లయలు..
సిల్క్ జీవితం నిండా
విషాదఛాయలు..!

ఆ మందహాసాల వెనక
చవిచూసిన మోసాల
కథాంశాలు..
అందమైన ఆ కళ్ళు
లోకం చూడని
కన్నీటి కలశాలు..
తాను ఆడుతూ కవ్వించిందేమో..
పంటి బిగువున
బాధను బంధిస్తూ..
తానంతమైపోయింది
ఎవరినీ నమ్మొద్దనే
నీతిని బోధిస్తూ…!

పశ్చిమంలో విజయలక్ష్మి పేర
ఎగసిన శృంగారతరంగం..
చెన్నై చేరి స్మితగా మారి
వండి చక్రం లో
సిల్కుగా మెరిసి..
పాత్ర పేరును తన పేరు ముందు చేర్చి అయింది
సిల్క్ స్మిత..
అలా మొదలైంది
ఉర్రూతల కత..
బావలు సయ్యా కూత
మోగిపోయింది మోత..!

సీతాకోకచిలకలో మూగభాష..
చాలెంజిలో చెప్పుకోలేని గుండె ఘోష..
వసంతకోకిలలో
కమల్ మాస్టారికి…
ముసలి మొగుడి
పడుచు పెళ్ళాం సంకేతాలు..
కులుకులే కాదు తళుకులూ
నా సొత్తేనంటూ
రాయల కొలువులో
నందిని హొయలు..
ఎన్ని కళలున్నా..
ఇంకెన్ని కలలున్నా
స్మిత జీవితంలో
గతి తప్పిన శృతిలయలు..
కనిపించని గాయాలు..
చెప్పుకోలేని బాధలు
తన సొంతమై..
ఊహించని విషాదాంతమై..!

సురేష్ కుమార్..ఇ
9948546286

LEAVE A RESPONSE