Home » ప్రజల భాగస్వామ్యంతోనే పర్యాటక అభివృద్ధి

ప్రజల భాగస్వామ్యంతోనే పర్యాటక అభివృద్ధి

అంతర్జాతీయ శాంతి మరియు సోదర సంబంధాలను కొనసాగించడానికి పర్యాటకం ఉత్తమ మార్గం. ప్రపంచ స్థాయిలో ఒకరి సంస్కృతిని ప్రతిబింబించడంలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 1980 నుండి సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంది. పర్యాటక ప్రాముఖ్యత మరియు ఆదరణ దృష్ట్యా ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రారంభించబడిందని మరియు ఈ రోజును జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం పర్యాటకం గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కలిగించడమే. ప్రజలను చైతన్యపరచటానికి, ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవం యొక్క థీమ్ ను విభిన్నంగా ఉంచుతుంది.

కోట్లాది మంది ప్రజల జీవనోపాధి టూరిజంపై ఆధారపడి ఉంది. దేశంలో కులాల మధ్య మతాల మధ్య సామరస్యత పెంపొందించేందుకు మనుషులందరూ ఒక్కటే అనే భావన కలిగించేందుకు టూరిజం డే ఉపయోగపడుతుంది. సోదర సంబంధాన్ని కొనసాగించడానికి, దేశ సమగ్రత తెలియజేయడానికి, స్థానిక జీవన విధానాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పాటిస్తాము.ఇది దేశంలోని ప్రతి ప్రాంతంలో విధిగా నిర్వహించబడే ఒక రోజు కార్యక్రమం.ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం పర్యాటక రంగంపై అవగాహన పెంచడం. ఇది ప్రపంచవ్యాప్తంగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు రాజకీయ విలువలను ఎలా ప్రభావితం చేస్తుందో ప్రజలకు బోధిస్తుంది.

టూరిజం ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే రోజు. పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టి చారిత్రక కోటలు, కట్టడాలు, అద్భుత శిలా ఖండాలు, ప్రదేశాల ప్రాముఖ్యత బహుళ ప్రాచుర్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాణ రంగంలో భారీ మార్పులు వచ్చినా, శత్రు దుర్భేద్యమైన కట్టడాలు,చారిత్రక కట్టడాలు ఈ తరం ప్రజలు, పాలకులు ఎలాగూ కట్టలేరు వీటి పరిరక్షణకు పూనుకోవాలి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో లైవ్ ఫోర్ట్స్ తలపిస్తున్న గుత్తి కోట, పెనుకొండ కోట, రత్నగిరి కోట, సిద్దవటం కోట, గండి కోట, రాయదుర్గం కోట అలాగే ప్రముఖ దేవాలయాలైన లేపాక్షి, తాడిపత్రిలో వెలసిన బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడి, చింతల వెంకటరమణ స్వామి గుడి, పశుపతినాథ్ దేవాలయం, ఆదిమ మానవుడు గీసిన చిత్రాలు. జీవ వైవిధ్యం, వృక్ష సంరక్షణ చాటి చెప్పే తిమ్మమ్మ మర్రిమాను. సామాజిక శాస్త్రాల్లో స్థానిక అంశాలు చోటు కల్పించాలి.

తమ ప్రాంత నాగరికత, చరిత్ర, ప్రజల జీవన శైలి, ఆహార అలవాట్లు, సంప్రదాయం కట్టుబాట్లు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. పాఠ్యాంశాలలో చొప్పిస్తే పిల్లలకు తమ ప్రాంతం గొప్పతనం గురించి తెలుస్తుంది. అలాగే ఈ ప్రాంతాలను సందర్శించడానికి హెరిటేజ్ వాక్, స్థానిక పర్యాటక వలయాలు రూపొందించుకొని పిల్లలకు విధిగా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యాటక దినోత్సవం ప్రజల పండుగగా జరుపుకోవాలి. అలాగే కేవలం దినోత్సవాల కే పరిమితం కాకుండా వీటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి భావి తరాలకు అందించే ప్రయత్నం చేయాలి.

డా.యం. విరూపాక్ష రెడ్డి,
అధ్యక్షులు,
అనంత పురాతన కట్టడాల పరిరక్షణ కమిటీ

Leave a Reply