‘అడవి’లో పూచిన అగ్నిపూలు..!

ఆయన చెయ్యి పడని
రంగం లేదు..
భీమవరం ముద్దు బిడ్డ..
ఆంధ్రప్రదేశ్ సొంత గడ్డ..
తెలంగాణ విమోచనంలోనూ
తానున్నాడు..
అలా అయ్యాడు
సాహితీ వారధి..
రచనలతో సెగ పుట్టించిన
అక్షరాల మహారధి..
భావోద్వేగాల జలధి..!

అడవి బాపిరాజు..
అతడు కథకుడంటే..
ఆయన కలం హసించినా
కుంచె అలుక వహించునేమో..
కులుకుల నర్తకుడంటే
చక్కగా పాడే గళం
కినుక చూపునేమో..
కళాదర్శకుడు కదా
అలా పొగిడితే..
దార్శనికుడు
తిరగబడడా మరి..
ఇన్ని వన్నెలున్న
కోనంగి బాపిరాజు
అన్నిటినీ మించి
వెన్నెల రూపున్నవాడు..
మల్లెల మనసున్న రేడు..!

బావా బావా పన్నీరు..
బావను పట్టుకు తన్నేరు..
ఇలా రాసిన బాపి బావ
మహారచయితల కోవ..
ఓ చేత్తో
పిల్లల కోసం పాటలు..
మరో చేత్తో
పోరాటాల బాటలు..
రెండు చేతుల్తో
చరిత్ర పుటలు..
ఆ అడవిలో వెలసిన
అక్షరాల పూదోటలు..!

ఆ కలం గోన గన్నారెడ్డి ని
సజీవంగా ఆవిష్కరించింది..
హిమబిందు తో శాతవాహనుల చరిత్రను
కళ్ళెదుట నిలిపింది…
అడవి శాంతిశ్రీ పేర
ఇక్ష్వాకుల కాలాన్నీ..
అంశుమతి ద్వారా
చాళుక్యుల చరితనూ
పరిచయం చేసింది..
తంజావూరు నాయకులు
మధురవాణి లో
కదిలే శ్రేణి..!

కవిత్వం..శిల్పం..
చిత్రలేఖనం..సంగీతం..
యుద్ధం..ఆయుధాలు..
ప్రేమ..వ్యవసాయం..
వ్యాపారం..
ఎత్తుకు పై ఎత్తులు..
అన్నీ రచనా వస్తువులే..
అడవి కాచిన వన్నెలే!

విశ్వనాధుని వేయిపడగలు
బాపిరాజు నారాయణరావు
ఈ రెంటి మధ్య
అందమైన అక్షర పోటీ..
ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో
బాపిరాజు మహత్తు
సాధించింది పైచేయి..
కవిసామ్రాట్టు సూర్యుడై..
బాపిరాజు చంద్రుడై..
వెలిగినారు సాహితీ వినీలాకాశంలో..
స్వయం ప్రకాశంతో..!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply