రేపు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చి వైయస్సార్ ప్రదేశముగా పెడతారేమో!

0
9

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చెత్త నిర్ణయం. రాత్రికి రాత్రే ఆన్లైన్ లో కాబినెట్ తీర్మానం యుద్ధ ప్రాతిపదికన ఆమోదం చేసి ఉదయానికి గంటల వ్యవధిలోనే అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చిందా, దీనిలో వందో వంతు విభజన హామీల, ప్రత్యేకహోదా సాధన పై పెడితే రాష్ట్రం, భావితరాలు బాగుపడతాయి. దిల్లీ పాదుషాలని డిమాండ్ చేసి రాష్ట్రానికి న్యాయం చేసే ధైర్యం లేదుకానీ, కక్ష సాధింపునకు మాత్రం ధైర్యమా?

వైద్య విద్యను ఒక్కో విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉండే గందరగోళం నుంచి బయటకు తెచ్చి, అలాగే అనేక ఆరోగ్య సేవలను ఓ గొడుగు క్రిందకి తీసుకువచ్చే అలాంటి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒకటి పెట్టాలని ఆలోచన ఈ దేశంలోనే మొట్టమొదటిసారి చేసింది, రూపుదిద్దింది ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా 1986లో ఆయనే ఉన్నారు, సిస్టంను తీర్చిదిద్దారు. దేశంలో అనేక రాష్ట్రాలు ఆయన ఆలోచనను ఫాలో అయ్యారు. ఆధునిక వైద్యం సామాన్య ప్రజలకు అందాలని ప్రభుత్వ ఆసుపత్రులలో అధునాతన పరికరాలు తెప్పించారు.

బొక్కల ఆసుపత్రిని జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నిమ్స్ లా చేశారు. ఒక్కో రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయం కోస్తా రాయలసీమలో కూడా ఉండాలని ఉద్దేశంతో ఆయన రాష్ట్రంలో అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుమతి పొంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ప్రైవేటు మెడికల్ కళాశాలగా నడుస్తున్న పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలని, దానికి విజయవాడలో ఉన్న విలువైన భూమి, భవనాలు ఆస్తుల్ని జాతీయకరణ చేసి, ప్రాంతాల వారి కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతంలో ఉన్న వారికి కూడా నిష్పత్తి ప్రకారం ఆరోజు సీట్లు ఇచ్చి, రాష్ట్ర స్థాయి ఏకైక మెడికల్ కళాశాల గా కూడా దాన్ని రూపొందించి ఏర్పరిచారు (నేడు రాష్ట్రం విడిపోయినప్పటికీ రాష్ట్రంలో 3 ప్రాంతాలకి నిష్పత్తిలో సీట్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వ మెడికల్ కళాశాల అక్కడే ఉంది).

“అయ్యా… ఆ కళాశాల మీ స్వంత బంధువుల అందరిదీ, మీరు హాని చేస్తున్నారు” అని చెప్పినా “మెడికల్ కళాశాలలకు డొనేషన్ ఏంటి? ప్రజలకంటే బంధుత్వం ఏ మాత్రం ఎక్కువకాదు, కులమత స్వార్ధం మా పాలనలో ఉండదు బ్రదర్ ” అని చెప్పి ఆయన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఎంత వ్యతిరేకత వచ్చినా ” సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు మా నిర్ణయం మారదు ప్రజల కోసం” అని చెప్పిన మనిషి ఎన్టీఆర్ గారు. ఆ స్థలంలోనే విశ్వవిద్యాలయం ఏర్పరిచారు. అలా నేడు ఎంతమంది ఈ దేశంలో చేయగలరు? అలాగే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడా తిరుపతిలో రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయంగా నేర్పరిచారు. తెలుగునాట మాత్రమే కాక ఈ దేశంలోనే తెలుగువారి ఆత్మగౌరాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ గారి పేరు మార్చి డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెడితే పైనున్న వైయస్సార్ గారి ఆత్మ కూడా ఏమాత్రం సహిస్తుంది అనుకోవడం భ్రమ జగన్ గారూ. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంను డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు పెట్టింది డా. వైయస్సార్ గారే.

హార్టీ కల్చర్ యూనివర్శిటీ కి ఇప్పటికే డా. వైయస్సార్ గారి పేరు పెట్టారు. ఎన్ని యూనివర్సిటీలకు పెడతారు? ఇంకా కొత్తది ఏమన్నా ఆలోచన చేసి వారి పేరు పెట్టండి, ఆయనా ఉన్నది మార్చడం ఏమిటండీ? మొన్ననే ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న 400 కోట్ల పైగా నిధులను డైవర్ట్ చేశారు.

నాడు ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగుగంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు ముందు పెట్టిన అదే వైయస్సార్ గారు హైదరాబాదు విమానాశ్రయంలో ఎన్టీఆర్ డొమెస్టిక్ టెర్మినల్ పేరు తీసేసి నాడు కేంద్రంలో పెద్దలను మెప్పించడానికి చేసిన నిర్ణయం తెలుగువాడికి అవమానం కాదా? ఆరోజు కాంగ్రెస్ లో ఉండి ఎన్టీఆర్ గారిని వ్యతిరేకించినవారు కూడా నేడు ఈ విశ్వవిద్యాలయం విషయంలో అసంబద్ధ నిర్ణయాన్ని ఒప్పుకోరు. ఇదేమీ స్కీం కాదు ప్రభుత్వం మారగానే పధకం పేరు మార్చటానికి.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ని జాతీయ పార్కుగా 1998లో ప్రకటింపచేయడం, జలగం వెంగళరావు గారి , కోట్ల విజయభాస్కర రెడ్డి గారి, మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద, వారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగాగా పని చేసినా సరే తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని పెట్టింది. ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు వారు జన్మించిన ప్రదేశం ఉన్న జిల్లా కాకుండా వేరే జిల్లాకి ఆయన పేరు పెట్టి ఎన్నికల టైంలో హామీ ఇచ్చాం కాబట్టి చేశాము అంటున్నారు. పైపై మెరుగులు కోసమా, ఎన్నికల జిమ్మిక్కులా? తెలంగాణ ఏర్పడిన తరువాత ఎన్టీఆర్ స్టేడియం, పార్కుని హైదరాబాదులో మారుద్దామని ఆలోచన మొదట్లో కొందరు సూచనలు చేసినా, ప్రభుత్వంలో కొందరు అనుకున్నా, అది దుర్మార్గమైన చర్యగా ప్రజల దృష్టిలో పడతామని వారు దాన్ని మార్చుకుని ఎన్టీఆర్ గారి పేరునే కొనసాగిస్తున్నారు.

బ్రతికున్న వ్యక్తులపైనే కాదు, గతించిన పెద్దలపై రాష్ట్ర స్థాయి సంస్థలు/వ్యవస్థని మార్చి ఇదే కక్ష సాధింపు కొనసాగితే రేపొద్దున్న పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ఢిల్లీలో విదేశీయులు పేర్లు మార్చి స్వదేశీయులు పేర్లు మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది వేరు. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన చోట ఎన్టీఆర్ స్థాపించిన విశ్వవిద్యాలయాన్ని పేరుని మార్చేసి వేరే పేరు పెడతాం అనడం అవాంఛనీయం. గౌ అసెంబ్లీలో ఆ భజన లాంటిది చూస్తుంటే రేపు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చి వైయస్సార్ ప్రదేశముగా, లేదా 26 జిల్లాలకు 26 మంత్రుల పేర్లు పెట్టాలనేవారు కూడా బయలుదేరరా అనిపించదా?

వైజాగ్ లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన భారీ క్రికెట్ స్టేడియం, సెంట్రల్ పార్కుకి డా.వైయస్సార్ పేర్లు పెట్టుకున్నారు. అది వేరే. కానీ ఇలాంటివి వేరే, ఓ తెలుగుదేశం లేదా జనసేన, వామపక్ష కాంగ్రెస్ ఒక పార్టీ అని కాకుండా దీని మీద నిస్పక్షపాతంగా అందరూ కూడా గళం ఎత్తాలని కోరుకుంటున్నాను.

– చలసాని శ్రీనివాస్