ఎన్టీఆర్ దెబ్బ‌కి టెంట్ లేచిపోయింది

(జి.ఆర్.మహర్షి)
ఎన్టీఆర్ బడిపంతులు సినిమా క‌లెక్ష‌న్ దెబ్బ‌కి మా ఊళ్లో ఒక టెంట్‌ని విప్పి మ‌ళ్లీ క‌ట్టారు. ఈ క‌థ ఏందంటే..
నేను ఆరో త‌ర‌గ‌తిలో వుండ‌గా రాయదుర్గానికి ఒక కొత్త అలంకారం వ‌చ్చింది. దాని పేరు జ‌య‌ల‌క్ష్మీ టూరింగ్ టాకీస్‌. మేము వుండే ల‌క్ష్మిబ‌జార్‌కి దూరంగా వుండే నేసేపేట‌లో దీన్ని క‌ట్టారు. టెంట్ కాబ‌ట్టి క‌ట్టారు అన‌కూడ‌దు. ప్రొజెక్ట‌ర్ రూమ్‌కి మాత్ర‌మే గోడ‌లు , మిగ‌తా అంతా రేకులు, మూడు క్లాస్‌లు. నేల‌, బెంచీ, కుర్చీ. 40, 75, 90 పైస‌లు టికెట్‌.
నేల అంటే న‌ల్ల బండ‌లు. బెంచీల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. త‌యారు చేసిన కార్పెంట‌ర్ ఎవ‌రో కానీ, మ‌హాజ్ఞాని. కొట్టాల్సిన చోట కాకుండా , కొట్ట‌కూడ‌ని చోట మేకులు కొట్టాడు. బెంచి మీద ఎక్కువ మంది కూర్చుంటే అది ప‌డ‌వ‌లా అటూఇటూ ఊగేది.
ఒక‌సారి బంగారు బాబు సినిమాలో అక్కినేని చెంగావి రంగు చీర అని పాట ఎత్తుకోగానే జ‌నం ఉత్సాహంతో విజిల్స్ వేస్తూ ఊగిపోయారు. బెంచి కూడా అదే లెవెల్‌లో ఊగి పుటుక్కున విరిగిపోయింది. ఎవ‌రి మీద ఎవ‌రు ప‌డ్డారో తెలియ‌దు. సినిమా ఆపేసి లైట్లు వేసి ప‌డ్డ వాళ్ల‌ని లేపారు. ప‌డ్డవాడు చెడ్డ‌వాడు కాదులే అనుకుంటూ ప‌డిన వాళ్లంతా ఇంకో బెంచీలో స‌ర్దుకుని సినిమా చూశారు. ఆ విరిగిపోయిన బెంచీ ఒక స్మార‌క చిహ్నంలా టెంటు ఆవ‌ర‌ణ‌లో చాలా కాలం ప్ర‌ద‌ర్శ‌న‌కి వుండింది.
చైనా మార్ష‌ల్స్ ఆర్ట్స్‌ సినిమాల‌కి , ముందు వుయ్యా , ఇయ్యా, ఇక్‌ట‌క్ అనే సౌండ్స్ రికార్డ్ చేసి త‌ర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తార‌ట‌. సినిమాల్లో డైలాగ్‌ల కంటే ఈ కేక‌లే ఎక్కువ. ఇదే రకంగా ఆ రోజుల్లో థియేట‌ర్ల‌లో బెంచీలు త‌యారు చేసేట‌ప్పుడే ముందుగా న‌ల్లుల ప‌రివారాన్ని సందుల్లో వ‌దిలి త‌యారు చేసేవాళ్లు. కింద బూర్రెల్లా వాచిపోయేలా కుట్టేవి. మేము నిక్క‌ర్లు వేసుకునే వాళ్లం కాబ‌ట్టి మాకు అస‌లు రక్షణ లేదు. ప్రేమ క‌థా చిత్రాల్ని కూడా మేము ఉలిక్కి ఉలిక్కి ప‌డుతూ చూసేవాళ్లం. కొంత మందికి సినిమా చూడ‌డం కంటే న‌ల్లుల్ని చంప‌డం పైన్నే ఆస‌క్తి. సిగ‌రెట్ పెట్టెల్ని అంటించి బెంచి సందుల్లో దూర్చేవాళ్లు. ఆ సెగ‌కి బెంచీలు కాలిపోయిన చారిత్రాత్మ‌క సంఘ‌ట‌న‌లు కూడా లేక‌పోలేదు.
కుర్చీల‌న్నీ గాడ్రెస్ కంపెనీవి. ఇండియాలో ఆ కంపెనీ పెట్టిన తొలి రోజుల కుర్చీల్ని వేలంలో తెచ్చి టెంట్‌లో ప‌రిచారు. కూచున్నా లేచినా విచిత్ర‌మైన సౌండ్ చేసేవి. ఈ మూడు త‌ర‌గ‌తుల‌కి ప్రేక్ష‌కుల ప‌రిమితి లేదు. టికెట్లు ఇస్తూనే వుంటారు. లోప‌లున్న వాళ్లు సీటు కోసం యుద్ధం చేస్తూ వుంటారు. కొత్త సినిమా వ‌స్తే కుర్చీలు , బెంచీలు తెచ్చి అద‌నంగా వేస్తూ వుంటారు. స‌గం సినిమా వ‌ర‌కు ఒక్కోసారి ఈ ప్ర‌హాస‌నం న‌డుస్తూ వుంటుంది. బెంచీలు మోసేవాళ్ల త‌ల‌లు స్క్రీన్‌కి అడ్డం వ‌చ్చి జ‌నం అరుస్తూ వుంటారు. కాలంతో, స్థ‌లంతో సంబంధం లేకుండా ఆడ‌వాళ్ల క్లాస్‌లో కొప్పు యుద్ధాలు జ‌రిగేవి. అరుపులు ఎంత తీవ్రంగా వుండేవంటే గంభీర‌మైన ఘంట‌సాల పాట‌లు కూడా విన‌ప‌డేవి కావు.
టెంట్ కాబ‌ట్టి రెండు ఆట‌లే. ఎండాకాలం రేకుల ఉక్క‌కి చ‌చ్చే వాళ్లం. నాలుగైదు బొంగుల్ని ఫిల్ల‌ర్ల‌గా వాడ‌డం వ‌ల్ల , వాటికి ఫ్యాన్లు వేలాడేవి. అవి ఆన్ చేస్తే విచిత్రంగా త‌లలు ఊపుతూ ద‌డ‌క్ ద‌డ‌క్ అని అరిచేవి. చాలా సార్లు వాటిని ఆఫ్ చేయ‌మ‌ని వేడుకునే వాళ్లు. గాలి రావాల‌ని ప‌ర‌దాలు ఎత్తేవాళ్లు. బ‌య‌ట కొట్టం హోట‌ళ్ల నుంచి మిర‌పకాయ బ‌జ్జీల ఘుమ‌ఘుమ వ‌చ్చేది ఇక టాయిలెట్ అనే మాట‌కే అర్థ‌మే లేదు. ఇంట‌ర్వెల్ అంటే బోర్ పాట‌లు వ‌చ్చిన‌ప్పుడు బ‌య‌టికి రావ‌డ‌మే. విశాల‌మైన మైదానంలో ఎవ‌రి వీలును బ‌ట్టి ఒక‌టో రెండో పూర్తి చేసుకోవ‌డ‌మే.
ఈ టెంటుని గ‌జ‌గ‌జ వ‌ణికించే సినిమా ఒక‌టొచ్చింది. దాని పేరు బ‌డిపంతులు.ఎన్టీఆర్ ముస‌లి వేషం. సెంటిమెంట్‌, ఎమోష‌న్స్ లేడీస్‌కి తెగ న‌చ్చేసి ఇరుగుపొరుగూ, పిల్లాజెల్లాతో దండ‌యాత్ర చేశారు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు టికెట్లు ఇవ్వ‌డంతో సోష‌ల్ సినిమా కాస్తా స్టంట్‌ సినిమాగా మారిపోయింది. మ‌గ‌వాళ్ల నేల క్లాస్‌ని ర‌ద్దు చేసి , స్త్రీల‌కే కేటాయించినా సాధ్యం కాలేదు.
క‌లెక్ష‌న్స్ వ‌దులుకోవ‌డం ఇష్టం లేక నిర్వాహ‌కులు రాత్రికి రాత్రి రేకుల్ని ఊడ‌పీకి టెంటుని వెడ‌ల్పు చేశారు. దానికి తోడు మ్యాట్నీ కూడా వేశారు. క‌ర్ట‌న్లు ఎత్తిన‌ప్పుడ‌ల్లా స్ర్కీన్ ప‌గ‌లే వెన్నెల‌గా క‌నిపించింది. ఈ సినిమా దాదాపు రెండు వారాలు ఆడింది. ఎన్టీఆర్, అంజ‌లీదేవి విడిపోయిన‌ప్పుడు వెక్కిళ్లు DTSలో వినిపించాయి.
కొన్నేళ్ల త‌ర్వాత ఈ టెంట్ ఆగిపోయింది. చాలా కాలం ఒక శిథిలగృహంలా వుండేది. ఇప్పుడు జ్ఞాప‌కాల్లోనే వుంది. మాసిపోయిన ప‌ర‌దాల మ‌ధ్య సంతోషాన్ని , క‌న్నీళ్ల‌ని , యుద్ధాన్ని , దైవ‌త్వాన్ని, ప్రేమ‌ని , విర‌హాన్ని , జీవితాన్ని, మ‌ర‌ణాన్ని , బ్లాక్ వైట్‌లో , రంగుల్లో చూపించిన ఒక తీపి గురుతు ఊహ‌ల్లో మాత్ర‌మే వుంది. కాలం ముఖాల్ని మారుస్తుంది, ఊరిని మారుస్తుంది. చిన్న‌త‌నంలో నేను చూసిన‌ది ఏదీ రాయదుర్గంలో ఇప్పుడు లేదు. ఆ ఊరికి నేను ప‌రాయివాణ్ణి. ఈ భూమికి కూడా ఏదో ఒక రోజు మ‌న‌మంతా ప‌రాయివాళ్ల‌మే! మ‌నుషులంతా ఎదురు చూస్తూనే ఉంటాం..”జీవితం కోసం , లేదా మృత్యువు కోసం!”
మరో సముదాయం నుంచి

Leave a Reply