సినిమా అమ్మ..శాంతమ్మ

అక్కినేనినే అబ్బి అని పిలిచేంత చనువు..
నందమూరి చెంపలనే
ఎడాపెడా వాయించి
కొరడా కింద పడేయిరా
అని శాసించేంత అధికారం..
పాటలు పాడే గుమ్మ..
తెలుగు సినిమా అమ్మ…
టాలెంటేమో బహుళ
వెండితెర వకుళ..
శాంతకుమారీ మణి..
పుల్లయ్య గారి సతీమణి!

ఒకనాటి శశిరేఖ..
మర్నాటి చిత్రాంగి..
తొలినాటి యశోదగా
చిరుచిరు నగవులు
చిలికే తండ్రీ…ఆంటూ
అపురూపంగా గొంతు సవరించిన కుమారి
పుల్లయ్య గారి
శ్రీమతిగా మారి..
పౌరాణికాల నుంచి సాంఘికాల్లోకి చేరి..
తన వీణ తీగలే
సవరించడం మానేసి
రాచనగరున మూలపడేసిన
రాణి..ప్రేమనగర్
కళ్యాణ్ బాబు మాత..
మత్తు ఏదో మరిగి..
చివరకు కొడుకు విషం తాగితే గుండె కరిగి…!
ఆ ఒక్క తల్లి పాత్రలోనే
దర్పం..కాఠిన్యం..
అసూయ..ఔదార్యం..
కలగలిపిన తల్లి…
రంగారావునే గడగడలాడించిన సతి..
మంచి నటనే ఆమె పరపతి!

సురేష్ బ్యానరులో
బొమ్మ పడితే శాంతమ్మ ఉండాల్సిందే..
అది రామానాయుడు సెంటిమెంటు..
నటించడం ఆమె కమిట్మెంటు

ఏయెన్నార్ కి
ఆమె హీరోయిన్..
ఆమే వదిన..ఆమే అమ్మ..
ఎన్టీఆర్ కి నాయనమ్మ..
శివాజీ..జెమినీ..
ఏ గణేశన్ అయినా
శాంతకుమారే అమ్మ..
పుల్లయ్యకి మాత్రం ముద్దుగుమ్మ..
మన తెలుగు
హీరోల అమ్మ
ప్రేక్షకుల పెద్దమ్మ!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply