ఈ ఏడాది మార్చిలో చైనాలోని దక్షిణ గ్వాంగ్జి ప్రావిన్స్‌లో కుప్పకూలిన చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. బ్లాక్‌బాక్స్‌లోని ఫ్లైట్ డేటాను విశ్లేషించగా కాక్‌పిట్‌లో ఉన్న ఎవరో ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కిందికి డైవ్ చేయమని బలవంతం చేసినట్టు తేలింది.
విమాన సిబ్బంది సహా 132 మందితో బయలుదేరిన బోయింగ్ 737 విమానం ప్రమాదానికి గురైనప్పుడు గంటకు 700 మైళ్ల వేగంతో 29 వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్నట్టు ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 132 మందీ ప్రాణాలు కోల్పోయారు. చైనాలో గత 28 ఏళ్లలో సంభవించిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఇదే.
విమాన శిథిలాల మధ్య దొరికిన బ్లాక్‌బాక్స్ ఫ్లైట్ రికార్డుల నుంచి డేటాను విశ్లేషించిన అమెరికా అధికారులు.. కాక్‌పిట్ నుంచే విమానాన్ని ఉద్దేశపూర్వకంగా విపత్తులోకి నెట్టేశారని తేల్చారు. విమానం వేగంగా కిందికిపడిపోతున్న సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, సమీపంలోని విమానాల నుంచి పదేపదే కాల్ చేసినా విమానంలోని పైలట్లు స్పందించలేదని అధికారులు తెలిపారు.
పైలట్, కో పైలట్ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ వారికి ఎలాంటి సమస్యలు లేవని చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. విమానం నుంచి వారు ఎలాంటి ఎమర్జెన్సీ కోడ్‌ను పంపలేదని, కాక్‌పిట్ భద్రతను వారు ఉల్లంఘించే అవకాశమే లేదని చైనా అధికారులు చెబుతున్నారు. అయితే, విమానాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా కూల్చారని బ్లాక్‌బాక్స్ విశ్లేషణలో తేలడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.