Home » నోరా…వీపుకు తీసుకురావద్దు

నోరా…వీపుకు తీసుకురావద్దు

(ఇలపావులూరి మురళీ మోహనరావు)
‘హీరోల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అలా ఉంటే ఈ పరిశ్రమలో ఎలాంటి వివాదాలు ఉండవు. తాత్కాలికమైన పదవుల కోసం మాటలు అనడం.. అనిపించుకోవడం వల్ల బయట వాళ్లకి లోకువైపోతాం. మన ఆధిపత్యం చూపించుకోవడానికి అవతలి వాళ్లను కించపరచాల్సిన అవసరం లేదు. అసలు వివాదానికి మూలం ఎవరో గుర్తించి.. అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టగలిగితే మనదే వసుధైక కుటుంబం’ అని చిరంజీవి నీతులు వల్లించారట!ఈ నీతుల్ని అమలులో పెట్టాల్సివస్తే ముందుగా నాగబాబును, పవన్ కళ్యాణ్ ను చిరంజీవి దూరంగా పెట్టాలి మరి!
తనకన్నా వయసులో పాతికేళ్ళు పెద్దాయన, సీనియర్ నటుడు, అమితాబ్ బచ్చన్ లాంటి జాతీయ హీరో మెప్పు పొందిన మన ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు మీద నాగబాబు నోరు పారేసుకుని బ్రాహ్మణ

నటీనటులకు ఆగ్రహం తెప్పిస్తారా? కోట శ్రీనివాసరావుతో పోల్చితే నాగబాబు స్థాయి ఎంత? అది దురహంకారం కాదూ?
ఇక ఆడియో ఫంక్షన్లో సాక్షాత్తు తమ సామాజికవర్గపువాడే అయిన ఒక రాష్ట్ర మంత్రిని పట్టుకుని సన్నాసి అని దూషిస్తాడా పవన్ కళ్యాణ్? పైగా ముఖ్యమంత్రి కులాన్ని బహిరంగంగా ప్రస్తావిస్తాడా?పోసాని కృష్ణమురళి తప్పే చేశాడనుకుందాం. ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు. లేదా మరొక ప్రెస్ మీట్ పెట్టి ఖండనమండనలు చెయ్యొచ్చు. అలాంటి ప్రజాస్వామ్యయుత మార్గాలను వదిలేసి అభిమానుల ముసుగులో రౌడీలను ఇంటిమీదికి పంపడం ఏమి సంస్కారం? అందునా కేంద్రమంత్రిగా పనిచేసిన చిరంజీవి సోదరుడు!
తన సోదరులు ఇతరులను అలా దూషిస్తున్నప్పుడు “అది తప్పు” అని చిరంజీవి బహిరంగంగా ఖండించాడా? ఇలా ధృతరాష్ట్రుడిలా ప్రవర్తిస్తున్నంతకాలం మెగా సోదరులు ఏనాటికీ నాయకులు కాలేరు. వారిని ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆదరించరు. తమ కుటుంబంలో తనతోపాటు అల్లు అరవింద్, నాగబాబు, రెండుచోట్ల పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయారా అని చిరంజీవి ఆత్మపరిశీలన చేసుకుని తమ్ముళ్లకు హితవు చెప్పాలి.

Leave a Reply