Suryaa.co.in

ప్రధాని నరేంద్ర మోడీతో విజయసాయి రెడ్డి భేటీ
Editorial

బీజేపీ-వైసీపీ బంధంపై జనంలో గందరగోళం

– కొందరు అగ్రనేతలు వైసీపీతో అంటకాగుతున్నారు
– జనసైనికులు అందుకే ‘కమలం’తో కలవడం లేదు
-దానిపై స్పష్టత ఇవ్వకపోతే నష్టమేనన్న బీజేపీ నేతలు
-బీజేపీ-జనసేన సంయుక్త సంకేతాలివ్వాల్సిందే
– బద్వేలు పోటీపై జనసేన అవమానించింది
– నద్దా వద్దకు రమ్మన్నా పవన్ రావడం లేదన్న సోము
– మీడియాలో బీజేపీకి స్పేస్ లేదన్న ఐవైఆర్
– బీజేపీ సమావేశంలో నేతల ఫైర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ-బీజేపీ తెరచాటు బంధంపై ప్రజలు, సొంత పార్టీ శ్రేణుల్లో ఉన్న అనుమానాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏపీ బీజేపీ నేతలు నాయకత్వానికి ఖరాఖండీగా తేల్చిచెప్పారు. మిత్రపక్షమైన జనసేన కూడా అలాంటి అనుమానంతోనే తమను దూరం పెడుతోందని, కింది స్థాయిలోని జనసైనికులు తమను వైసీపీ మిత్రపక్షంగా అనుమానిస్తున్నారని బీజేపీ నేతలు వాపోయారు. జనసైనికులను ఎంత సమన్వయం చేసుకుందామని ప్రయత్నించినా, వారు తమతో కలసి పనిచేయడానికి సిద్ధంగా కనిపించడం లేరని నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఏపీలో బీజేపీకి మీడియాలో కనీస స్థాయిలో స్పేస్ లేనందున, నాయకత్వం దానిపై దృష్టి సారించాలని మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు సూచించారు.
విజయవాడలో రాష్ట్ర బీజేపీ నిర్వహించిన రెండురోజుల సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది. అధికార ప్రతినిధులు, ప్యానలిస్టులు, ఫీడ్‌బ్యాక్ కమిటీ, మీడియా కమిటీలతో పాటు.. మోర్చా, డిపార్టుమెంట్, సెల్స్ నేతలతో జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ భేటీ అయ్యారు. బీజేపీ ఎస్సీ, మైనారిటీలకు వ్యతిరేకం అన్న ముద్ర తొలగించే ప్రయత్నం చేయాలని సూచించారు. అనంతరం ఆయన నేతల అభిరుచులు, అంశాలపై వారి అవగాహన ఏమిటన్నది అడిగి తెలుసుకున్నారు.
కాగా అధికార ప్రతినిధులు, ప్యానలిస్టులు, ఫీడ్‌బ్యాక్ కమిటీ, మీడియా కమిటీలతో భేటీ అయిన రాష్ట్ర సహ ఇన్చార్జి సునీల్ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, ఎంపీ జీవీఎల నరసింహారావును ఆయా కమిటీల నేతలు ప్రశ్నలతో ముంచెత్తారు. విశ్వసనీయ సమాచార ప్రకారం.. బీజేపీ-వైసీపీ కలసి పనిచేస్తున్నాయని, అందుకే ప్రభుత్వంపై సమర్ధవంతంగా పోరాడటం లేదన్న భావన, క్యాడర్-జనంలో బలంగా నాటుకుందని పలువురు నేతలు స్పష్టం చేశారు. ప్రధానంగా కొంతమంది పార్టీ అగ్రనేతలు వైసీపీతో అంటకాగుతున్నారన్న ప్రచారం కింద స్థాయికి చేరిందన్నారు. దానిపై స్పష్టత ఇవ్వకపోతే జనం-క్యాడర్‌లో మరింత గందరగోళం పెరిగే అవకాశం ఉందని సూచించారు.
ఈ విషయంలో కింది స్థాయిలోని జనసైనికులు సైతం, అదే అనుమానంతో బీజేపీ వారిని దూరం పెడుతున్న పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ అనుమానంతోనే జనసైనికులు స్థానికంగా టీడీపీతో కలసి పోటీ చేశారని నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీలో ఎప్పుడూ ఇద్దరు ముగ్గురే మాట్లాడుతున్నారు. మిగిలిన సీనియర్లు ఎందుకు మాట్లాడటం లేదన్న చర్చ కూడా జరుగుతోందని నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
అదే సమయంలో జనసేన-బీజేపీ మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయన్న భావన జనంలో ఉందని, బీజేపీని ఆ పార్టీ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఉందని నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ‘అసలు జనసేనను పోటీ చేయమని మనం పవన్ వద్దకు వెళ్లి అడిగే పరిస్థితి ఎందుకొచ్చింది? మనతో సంబంధం లేకుండా బద్వేలులో పోటీ చేయటం లేదని పవన్ చెప్పడం బీజేపీని అవమానించడమేనన్న అభిప్రాయం బయట కనిపిస్తోంది. మన పార్టీ వాళ్లూ అదే ఫీలవుతున్నారు. ఎంతసేపటికీ మన పార్టీ వాళ్లే మేమూ-జనసేన కలసి చేస్తామని చెబుతున్నామే తప్ప, జనసేన నేతలు ఒక్కసారి కూడా బయట వేదికలపై మేమూ-బీజేపీ కలసి పనిచేస్తామని ఎందుకు చెప్పడం లేదు? ఈ విషయంలో నాయకత్వం సీరియస్‌గా దృష్టి పెట్టి, రెండు పార్టీల నేతలు ఒకే వేదికపైకి వచ్చి ఇద్దరం కలసి చేస్తామన్న స్పష్టత ఇవ్వకపోతే మనకే నష్టం. మనం పవన్‌తోపాటు, జనసేనను ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నామ’ని బీజేపీ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ప్రశ్నించారు.
దానిపై వీరావేశం చెందిన వీర్రాజు.. మనందరం కలసి నద్దా వెళదాం. నేను తీసుకువెళతానని పవన్‌కు చాలాసార్లు చెప్పా. కానీ ఆయన నుంచి స్పందన లేకపోతే ఏం చేయాలి? మనమైతే జనసేనకు చాలా గౌరవం ఇస్తున్నాం. జనసేన వాళ్లు పోటీ చేయడం లేదన్న విషయాన్ని నాయకత్వానికి చెప్పాం. జనసేన ఎందుకు ఇలా చేస్తుందో మేము విశ్లేషిస్తున్నాం’ అన్నారు. అయితే.. ‘బద్వేలుపై పోటీ చేయమని బయట ఎందుకు ప్రకటించారని మీరు నాదెండ్ల మనోహర్‌ను అడిగారా? అందుకాయన మీరు తిరుపతిలో మాకు చెప్పకుండా అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి మేమూ మా వైఖరి చెప్పాం అని అన్నారా’ అని ఓ నేత సోమును ప్రశ్నించగా, ఆయన జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు.
కాగా, మీడియాలో పార్టీకి ఇటీవలి కాలంలో బ్రహ్మాండమైన పబ్లిసిటీ వస్తోందని, ఈ విషయంలో అధ్యక్షుడు కూడా అభినందించారని మీడియా సెల్ నేతలు చెప్పారు. అయితే, చివరలో ముగింపు ఉపన్యాసం ఇచ్చిన మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్యారావు మాత్రం.. మీడియాలో గతంలో వచ్చినంత పబ్లిసిటీ కూడా రావడం లేదని నిర్మొహమాటంగా చెప్పడం ప్రస్తావనార్హం. ‘అఫ్‌కోర్స్.. ఏపీలో మీడియా పార్టీలపరంగా చీలిపోయింది. అయినా మన పార్టీకి ఎక్కడా స్పేస్ కనిపించడం లేదు. అధ్యక్షుడి కార్యక్రమాలు కూడా ఏదో జోన్‌లో చిన్న ముక్క వేస్తున్నారు. దీనికి కారణమేమిటో నాయకత్వం సీరియస్‌గా ఆలోచించాలి. మన పార్టీకి కనీస స్థాయిలో కూడా స్పేస్ కనిపించడం లేదు. వైసీపీతో మన స్టాండ్‌పై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెండు పార్టీలూ ఒకటేనని బయట అనుకుంటున్నార’’ని ఐవైఆర్ స్పష్టం చేశారు.
సోము వ్యాఖ్యలపై సీనియర్ల అసంతృప్తి
కాగా ఈ సందర్భంగా బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఎన్నిక ప్రారంభం కాకముందే ఓడిపోతున్నామన్న సంకేతాలివ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ‘బద్వేలులో మనం వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకం కాదు. పాపం ఆమె భర్త పోవడంతో టికెట్ ఇచ్చారు. కానీ మనం ఓడిపోయినా పార్టీ పాలసీ ప్రకారం పోటీలో ఉంటాం. మనకు ఎన్ని ఓట్లు వచ్చాయన్నది కాదు. మన సిద్ధాంతాలను ఓటర్లలోకి ఎంతవరకూ తీసుకువెళ్లగలిగామన్నదే ముఖ్యం. గెలుపు ఓటములు ముఖ్యం కాదు’ అని వీర్రాజు చేసిన వ్యాఖ్య, నేతలను నిరాశపరించింది. ఇప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ఇక బద్వేలులో ప్రచారానికి కార్యకర్తలు ఎందుకు వస్తారన్న ప్రశ్నలు, సీనియర్ల నుంచి వినిపించాయి. ఇది యుద్ధానికి ముందే తెల్లజెండా ఎగురవేయడం లాంటిదేనని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE