Suryaa.co.in

Editorial

కొత్త సర్కారులో కొలువు తీరేదెవరు?

– 12న బాబు ఒక్కరేనా? మరికొందరు ప్రమాణస్వీకారం చేస్తారా?
– సీనియర్ల సంఖ్యతో సమీకరణపై కసరత్తు
– ఈసారి కాపు,మాదిగ, బీసీలకు అధిక ప్రాధాన్యం
– మహిళలకు పెద్దపీట?
– బీజేపీ కోటాలో సుజనా, సత్యకుమార్?
– కొడాలి నానిపై గెలిచిన రాముకు చాన్స్?
– ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? లేదా?
– క్యాబినెట్‌కు జనసేన కు దూరం?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించి సీట్ల సునామీ సృష్టించిన తెలుగుదేశం గద్దెనెక్కేందుకు ముహుర్తం ఖరారయింది. ఈనెల 12న అమరావతిలో ప్రజల సాక్షిగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెండోసారి, ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి సీనియర్లంతా విజయం సాధించడంతో మంత్రి పదవులపై ఆశలు, అంచనాలు భారీగా కనిపిస్తున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాల సమీకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబునాయుడు కొలువులో, ఎంతమంది చేరతారన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనసేన క్యాబినెట్‌లో చేరకూడదన్న నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో.. బాబుపై ఒత్తిడి తగ్గనుంది.

పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు జగన్ సర్కారు వేధింపులకు గురై జైలుకు వెళ్లొచ్చిన అచ్చెన్నాయుడు సహా అయ్యన్నపాత్రుడు, నారాయణ, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, వారితో పాటు జగన్ సర్కారుపై పోరాడిన ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి, రామానాయుడు, జగన్‌పై ప్రజావ్యతిరేకతకు బీజం వేసిన రఘురామకృష్ణంరాజుకు స్థానం దక్కవచ్చని భావిస్తున్నారు.

రాజధాని గుంటూరు-కృష్ణా జిల్లాల నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య బాగానే కనిపిస్తోంది. గద్దెరామ్మోహన్‌రావు, శ్రీరాం తాతయ్య, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌కుమార్; పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణంరాజు; తూర్పు గోదావరి జిల్లా నుంచి నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రు; విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత; విజయనగరం జిల్లా నుంచి కళావెంకట్రావు, బేబీ నాయన, సంధ్యారాణి; శ్రీకాకుళం జిల్లా నుంచి కొండ్రు మురళి, బెందాళం అశోక్ పేర్లు వినిపిస్తున్నాయి.

ప్రకాశం జిల్లా నుంచి డోలా వీరాంజనేయస్వామి; నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి; అనంతపురం జిల్లా నుంచి కాలువ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత; కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎన్‌ఎండి ఫరూఖ్ పేర్లు వినిపిస్తున్నాయి. కడప నుంచి పుట్టా సుధాకర్‌యాదవ్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి అమర్‌నాధ్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా చంద్రబాబునాయుడు కుటుంబాన్ని, టీడీపీని లక్ష్యంగా చేసుకుని నోరుపారేసుకున్న కొడాలి నానిని ఓడించిన యువనేత వెనిగండ్ల రాముకు.. తొలిసారి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం ద్వారా, కార్యకర్తలను సంతోషపెట్టవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వైసీపీ భూస్థాపితమైన నేపథ్యంలో.. భవిష్యత్తు రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకుని రెడ్డి సామాజికవర్గానికి, ఈసారి పెద్దపీట వేసే అవకాశం లేకపోలేదంటున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీకి జైకొట్టిన కాపు- మాదిగ-బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమిని దృష్టిలో ఉంచుకుని, కమ్మ వర్గానికి ప్రాధాన్యం తగ్గించే అవకాశాలు లేకపోలేదు. ఆ వర్గానికి ఈసారి పార్టీలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, వారిని సంతృప్తిపరచవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అనంతపురంజిల్లాలో గెలిచిన వారిలో ఎక్కువమంది కమ్మ వర్గానికి చెందిన వారే ఉండటంతో, మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి. అక్కడి నుంచి కాలువ శ్రీనివాసులుకు మాత్రం మంత్రి పదవి దక్కటం ఖాయమంటున్నారు.
ఇక బీజేపీ నుంచి కేంద్రమాజీ మంత్రి- విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి- ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌యాదవ్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చంటున్నారు. ఇద్దరూ జాతీయ స్థాయిలో ప్రముఖులు కావడంతో, వారికి మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందంటున్నారు. తాజా మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవులు ఉంటాయా? లేవా? అన్నదానిపై స్పష్టత రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సమీప బంధువులైన నారాయణ-గంటా శ్రీనిసరావులో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో చూడాలి. గత ఐదేళ్ల నుంచి నారాయణ సేవలు దృష్టిలో ఉంచుకుంటే, ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మూడేళ్ల క్రితం గంటా వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయన అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరుకాకపోవడం, పార్టీ ఆఫీసు నుంచి వచ్చే ఫోన్లకు సైతం స్పందించలేదన్న విమర్శలొచ్చాయి.

ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎవరికి పదవులు దక్కుతాయన్న అంశం ఆసక్తికరంగా మారింది. గతంలో మంంత్రిగా పనిచేసిన బీసీ నేత పితాని సత్యనారాయణ, గత ఐదేళ్లలో జగన్ సర్కారుపై పోరాడిన కాపు నేత రామానాయుడు, జగన్‌ను జాతీయ స్థాయిలో అప్రతిష్ఠపాలు చేసి, ఒంటరిగా పోరాడిన క్షత్రియ నేత రఘురామకృష్ణంరాజు ఒకే జిల్లా, ఒకే పార్లమెంటు పరిథిలోని ఎమ్మెల్యేలు కావడ ం విశేషం. . గోదావరి జిల్లాల్లో ఈ మూడు కులాలు కీలకమైనవే. మరి చ ంద్రబాబునాయుడు ఎవరి వైపు మొగ్గుతారో చూడాలి.

కాగా ఈసారి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. హోంమంత్రి మహిళకే ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో మాదిగలు గంపగుత్తగా టీడీపీ పక్షాన మొగ్గిన నేపథ్యంలో, మంత్రివర్గంలో మాదిగలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వైశ్య వర్గం నుంచి శ్రీరాం తాతయ్యకు ప్రాధాన్యం ఇవ్వవచ్చంటున్నారు.

స్పీకర్ ఎవరు?
కీలకమైన స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సీనియర్ నేత ఎన్‌ఎండి ఫరూఖ్ (మైనారిటీ), గోర ంట్ల బుచ్చయ్యచౌదరి( కమ్మ), సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (రెడ్డి), కన్నా లక్ష్మీనారాయణ (కాపు), కళా వెంకట్రావు (తూర్పు కాపు), రఘురామకృష్ణంరాజు ( క్షత్రియ) పేర్లు చర్చకు వస్తున్నాయి.

LEAVE A RESPONSE