Suryaa.co.in

కొత్త జోనల్ వ్యవస్థతో పోలీసులకు  నిరాశ
Editorial

రచ్చ అవుతున్న నాటి పోలీసు ‘రావు’ల రాజ్యం

– పోలీసు శాఖలో చెలరేగిన ‘పోలీసు రావు’లు
– విపక్షాల ఫోన్లపై నిఘా వేసిన ప్రణీత్‌రావు
– ఎన్నికల తర్వాత రికార్డులు ధ్వంసం
– సర్కారు మారగనే రావుపై సస్పెన్షన్
– నాటి ప్రభాకర్‌రావు హవాపై రేవంత్ నిప్పులు
– ఎస్‌ఐబీలో ‘వెలమ రాజ్యైం’పె ఇప్పుడు చర్చ
– ప్రగతిభవన్ కేంద్రంగా విపక్షాల ఫోన్లపై నిఘా వేసిన వైనం
– వారితో అడ్డదారి పనులు చేయించారన్న ఆరోపణలు
– ప్రగతిభవన్‌లో తోడేళ్లు ఉన్నాయంటూ ఈటల ఫైర్
– నాడు డీజీపీ ఫోన్‌పైనే నిఘా పెట్టార న్న విమర్శలు
– రిటైరయినా పదవులు వదలని వెలమ పోలీసు బాసులు
– రేవంత్‌రాకతో రాజీనామాలు చేసిన వెళ్లిన వైనం
– విచారణతో తలపట్టుకుంటున్న రావుల సంఘం
– ప్రణీత్‌రావు పెదవి విప్పితే చాలామందికి చేటు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

పదేళ్లు తెలంగాణను నిర్నిరోధంగా పరిపాలించిన బీఆర్‌ఎస్‌కు ఆ మాజీ పోలీసు అధికారులే కళ్లు చెవులయ్యారు. రాజకీయ ప్రత్యర్ధులు, ఉద్యమకారులు, చివరకు డీజీపీ ఫోన్లపై నిఘా పెట్టేంత బరితెగింపులో వారు సిద్ధహస్తులు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు.. పోలీసు అధికారులు కూడా ఫోన్లలో స్వేచ్ఛగా మాట్లాడుకోలేని భయం. అంతగా వణికించేవారు ఆ పోలీసులు. కారణం వారంతా బీఆర్‌ఎస్ పాలకుల కులం వారే కావడం!

రిటైరయినవారితో రాజకీయ ప్రత్యర్ధుల ఆనుపానులు కనిపెట్టి, ప్రజాస్వామ్యానికి పాతర వేసిన నాటి పాలకులకు, ఈ మాజీ పోలీసు‘రావు’లే సర్వస్వమట. నాటి పాలక వర్గమైన వెలమ కులానికి చెందిన కొందరు మాజీ పోలీసు అధికారులు, ఒక ఐపిఎస్, మరొక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి బృందం, తెలంగాణలోని విపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. రేవంత్ సర్కారు రావడంతో ‘రిటైరైన రావు’లు రాజీనామా చేసి వెళ్లిపోగా, కీలకపాత్ర పోషించిన ప్రణీత్‌రావు మాత్రం అడ్డంగా దొరికిపోయారు. దానితో ప్రణీత్‌రావు పెదవి విప్పితే ఎంతమంది ‘రావుల పుట్టి’ మునుగుతుందోనన్న ఆందోళన ఇప్పుడు, ‘రావుల సంఘం’లో మొదలయిందట.

బీఆర్‌ఎస్ పాలనలో విపక్షాలు, రాజకీయ ప్రత్యర్ధులు, ప్రజాసంఘాలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరికి నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి ఫోన్లపైనే నిఘా పెట్టారన్న వార్తలు అప్పట్లో సంచనం సృష్టించిన విషయం తెలిసిందే. పాలకవర్గ కులానికి చెందిన పోలీసు అధికారి ప్రభాకర్‌రావు ఈ ఆపరేషన్‌కు చీఫ్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో సహా, అందరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని నాటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దానికి సంబంధించిన వివరాలను రేవంద్ ఈసీకి అందించారు.

ఆ మేరకు ఆయన ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో.. బీఆర్‌ఎస్‌కు ఎన్నికల నిధులు వసూలు చేస్తున్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారులతోపాటు, ప్రభాకర్‌రావు, రాధాకృష్ణ వంటి పోలీసు అధికారులపైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిజానికి వీరంతా వెలమ సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం. రిటైరయిన ఈ వెలమ కులానికి చెందిన అధికారులను ఏరికోరి తీసుకువచ్చి, రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లపై నిఘా పెట్టారన్న ఆరోపణలు, ఇప్పుడు విచారణ రూపంలో రావడం సంచలనం సృష్టిస్తోంది.

నిజానికి ప్రభాకర్‌రావు నేతృత్వంలో… వేణుగోపాలరావు, నర్శింగరావు, ప్రణీత్‌రావు, భుజంగరావు వంటి సొంత సామాజికవర్గ అధికారులతో ఒక బృందం ఏర్పాటుచేసి, ఫోన్ ట్యాపింగ్-ప్రత్యర్ధులపై నిఘా వ్యవహారాలను వారికి అప్పగించారన్న వార్తలు అప్పట్లోనే సంచలనం సృష్టించాయి. ఇంటలిజన్స్ మాజీ అధికారి కిషన్‌రావు రిటైరయి చాలా ఏళ్లయినా, ఆయన అన్ని ప్రభుత్వాల్లో కొనసాగుతున్న వైచిత్రిపై అప్పుడే విస్మయం వ్యక్తమయింది.

అయితే కేసీఆర్ హయాంలో రిటైరైన వెలమ పోలీసు అధికారులకు ఓఎస్డీల రూపంలో మళ్లీ ఉద్యోగాలిచ్చి, ఇలాంటి ఆపరేషన్లకు వారిని వినియోగించుకున్నారన్న విమర్శలు వినిపించేవి. రేవంత్ సీఎం అయిన తర్వాత పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో చేరిన రిటైర్డ్ అధికారులంతా తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోయారట. కేసీఆర్ సర్కారు హయాంలో ఒక వెలుగు వెలిగిన వెలమ అధికారులంతా తాజాగా ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరిపై వేటు పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారట.

ఎన్నికల ఫలితాల రోజు రాత్రి సిసి కెమెరాలు ఆఫ్ చేయించిన ప్రణీత్‌రావు, 45 హార్డ్‌డిస్కులను ధ్వంసం చేసి, కీలకమైన ఫైళ్లను మాయం చేసినట్లు రేవంత్ ప్రభుత్వం గుర్తించిందట.

దానితో రావుపై సస్పెన్షన్ వేటు వేసిన రేవంత్ సర్కారు.. అనుమతి లేకుండా హైదరాబాద్ దాటి వెళ్లవద్దని ఆదేశించింది. ప్రణీత్‌రావు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టాన్ని అతిక్రమించి, అనుమతి లేకుండా విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయట. ప్రాధమిక విచారణ పూర్తయితే ప్రణీత్‌పై క్రిమినల్ కేసు సహా, మిగిలిన అనేక కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్ ఆపరేషన్ టీమ్‌కు నేతృత్వం వహించిన ప్రణీత్‌రావు.. నాటి మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడన్న ప్రచారం పోలీసువర్గాల్లో వినిపిస్తోంది.

రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లు-వారి కదలికలపై నిఘా వంటి వ్యవహారాలను.. నాటి పోలీసు అధికారి ప్రభాకర్‌రావు ప్రగతిభవన్ నుంచి స్వయంగా పర్యవేక్షించేవారన్న చర్చ అప్పట్లో జరిగిన విషయం తెలిసిందే. రిటైరయిన ప్రభాకర్ హవాను చూసి డీజీపీ స్థాయి అధికారులే వణికిపోయేవారన్న ప్రచారం ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకునే మాజీ మంత్రి ఈటల ప్రగతిభవన్‌లోని తోడేలుతోనే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వ్యాఖ్యానించడం గమనార్హం. నిజానికి ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలన్నా దానికి అనేక నిబంధనలున్నాయి. అనధికారికంగా ఎవరు ట్యాప్ చేసినా అది నేరమే.

కానీ కేసీఆర్ సర్కారు కొనుగోలు చేసిన అత్యాధునిక పరికరాలతో.. ఎవరి అనుమతి లేకుండా, సెల్‌ఫోన్ కంపెనీ ఆపరేటర్ల అనుమతి లేకుండా నేరుగా ఫోన్లు ట్యాప్ చేయవచ్చు. అయితే అది పూర్తి అనధికారికంగా వినియోగించేవేనని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. నిజానికి ఇవి నక్సల్స్, టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా వేయడానికి మాత్రమే వినియోగించాలి.

కానీ కేసీఆర్ సర్కారు మాత్రం తన రాజకీయ ప్రత్యర్ధులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాసంఘాల నాయకుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు మాత్రమే.. ఆ పరికరాలు వాడారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు ప్రణీత్‌రావు ధ్వంసం చేశారని చెబుతున్న కాల్‌డేటా రికార్డులు, ఐఎంఈఐ నెంబర్లు, ఫైళ్లు, ఇతర డేటా అంతా అధికారికంగా ట్యాపింగ్ చేసినవేనంటున్నారు. దానితో ఆయనపై అనేక కేసులు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం బీఆర్‌ఎస్ మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. విచారణలో ఎంతమంది ఫోన్లపై ప్రణీత్‌రావు బృందం ట్యాపింగ్ చేసింది? అందులో విపక్షాలకు చెందిన వారెంతమంది? సొంతపార్టీకి చెందిన వారెంతమంది అన్న వివరాలు బయటకొస్తే బీఆర్‌ఎస్ చిక్కుల్లో పడక తప్పదు.

LEAVE A RESPONSE