వైసీపీ ఇక ఇంటికే!

( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు తర్వాత ఆంధ్రా ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం ఇది. ఇలాంటి ‘పర్సెప్షన్ పాలిటిక్స్’ సామాన్య-మధ్యతరగతిపై ప్రభావం చూపుతాయి. ఇది సహజం. ‘బీజేపీ కలిస్తే జగన్ ఇక ఇంటికిపోవడం ఖాయమన్న భావన’ ఏర్పడేందుకు పొత్తు పనికొచ్చింది. మరోవైపు నేరుగా ఇది వైసీపీకి వీరవిధేయత ప్రదర్శించే ఐఏఎస్-ఐపిఎస్‌ల నుంచి కిందిస్థాయి డీఎస్పీ-ఆర్డీఓల వరకూ ఒక హెచ్చరిక సంకేతం.

బీజేపీ విడిగా పోటీ చేస్తుందని, అప్పుడు ఓట్లు చీలి వైకాపాకు కలసి వస్తుందని, ఎన్నికల సమయంలో టీడీపీ-జనసేన ఈసీకి చేసే ఫిర్యాదులకు స్పందన ఉండదన్న ఊహాగానాలు-విశ్లేషణలు కూడా జరిగిపోయాయి. బహుశా టీడీపీ-బీజేపీ పొత్తు ఉండదన్న ధీమాతోనే వైసీపీ అధినేత జగన్.. వైనాట్ 175? వైనాట్ కుప్పం అని ధీమా వ్యక్తం చేసి ఉండవచ్చు. కానీ డామిట్…ఇప్పుడు కథ అడ్డంగా అడ్డం తిరిగింది.

నిజానికి టీడీపీ-బీజేపీ పొత్తు కోసం తెరవెనుక ప్రయత్నాలు చాలాకాలం నుంచే మొదలయ్యాయి. కాగలకార్యం తీర్చే గంధర్వులు, చాలాకాలం నుంచీ ఆప్రయత్నాలు చేశారు. జగన్‌ను గద్దెదించాలన్నదే వారి లక్ష్యం. ఎప్పుడైతే చంద్రబాబు ప్రధాని మోదీని కలిశారో.. రెండు పార్టీల కలయికకు అప్పుడే బీజం పడిందని, బాబును అమిత్‌షా పిలిపించినప్పుడే పొత్తు పొడిచిందని బుర్ర-బుద్ధి ఉన్నవారెవరైనా అర్ధం చేసుకోవాలి. అంతకుముందు చంద్రబాబును కలిసేందుకు మోదీ విముఖంగా ఉండేవారని.. కానీ అమిత్‌షా, నద్దా మాత్రం టీడీపీతో కలిసేందుకు సుముఖంగా ఉన్నారన్న ప్రచారం జరిగింది.

ఆమధ్యలో టీడీపీ-బీజేపీ కలవకుండా వైసీపీ చకోరపక్షులు, ఢిల్లీ చుట్టూ కాలుగాలినపిల్లిలా ప్రదక్షణలు చేశాయి. ఆ తర్వాత జరిగిన చంద్రబాబు అరెస్టు పరిణామం, బీజేపీకి దగ్గరచేసేందుకు దోహదపడింది. దానికితోడు ఏపీలో జగన్ మహత్తరపాలన, దివ్యంగా వెలిగిపోతున్న ఆయన ప్రభుత్వ ప్రభ, వచ్చే ఎన్నికల్లో వైసీపీ భవితవ్యంపై ‘సంఘ’జనులతోపాటు, సొంత పార్టీ నేతలు ఇచ్చిన నివేదికలు కూడా టీడీపీ-బీజేపీ ఏకమయ్యేందుకు కారణమయ్యాయి. ప్రధానంగా అమిత్‌షా సోదరుడు లలిత్‌షా.. ఏపీకి సంబంధించి ఇచ్చిన వాస్తవ నివేదికలే, టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు పొడిచేందుకు కారణమయిందన్నది కమలవనంలో జరుగుతున్న చర్చ.

నిజానికి టీడీపీ-బీజేపీ పొత్తు ఉండదని, టీడీపీని నమ్మేందుకు వీలులేదని, వైసీపీ గెలిచే వాతావరణం ఉన్నందున టీడీపీతో వెళ్లేంత మతిలేని పని బీజేపీ చేయదంటూ వైసీపీ మిత్ర మీడియా గత కొద్దిరోజులు నుంచి పత్రికలు-చానెళ్లలో వినిపిస్తున్న గావుకేకల హాహాకారాలు, ఏడుపులు, పెడబొబ్బలు, ఆర్తనాదాలు పొత్తుపై నమ్మకం ఉన్నవారిని సైతం అనుమానాల్లోకి నెట్టేశాయి. తమ పెడబొబ్బలు నమ్మకం కలిగించేలా, గతంలో మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలను కూడా గుర్తు చేశాయి. అదో తుత్తి!

ప్రతిరోజూ టీవీ తెరలపై జరిగే చర్చల్లో పళ్లు ఇకిలిస్తూ, కళ్లజోళ్లు సవరించుకుంటూ, గొంతు పెద్దది చేసుకుని, మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ మాట్లాడే పెద్దగొంతులు.. పక్క రాష్ట్ర మేధావులు, పొత్తును చిత్తు చేసేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ వారి ‘శ్రమదానం’ వైసీపీ వ్యూహబృందాన్నయితే మెప్పించింది గానీ, పొత్తు పొడవకుండా మాత్రం ఆపలేకపోయింది. నిజానికి శనివారం వైసీపీ అనుబంధ-వైసీపీ ప్రేరేపిత మిత్ర మీడియా బృందానికి విషాదకరమైన రోజు.

అటు వైసీపీ వ్యూహబృందం కూడా, టీడీపీ-బీజేపీ పొత్తు ఉండకూడదని కనిపించని దేవుళ్లకు, కనిపించే చర్చిల్లో చేయని ప్రార్ధనలు లేవు. పాస్టర్లు-ఫాదర్లు-ఆర్చిబిషప్పుల నుంచి తీసుకోని ఆశీర్వాదాలు లేవు. అదనంగా బీజేపీలోని విభీషణులతో సాధ్యమైనంత ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. ఇకపై బీజేపీని కూడా విమర్శల జాబితాలో చేర్చక తప్పని అనివార్య పరిస్థితి. రోజూ అమిత్‌షా, నిర్మలాసీతారామన్, పియూష్‌గోయల్ వంటి మంత్రుల పేషీల చుట్టూ తిరిగి, తిరుపతి ప్రసాదాలు, వెంకన్న ఫొటోలు పంచిపెట్టే ‘పెద్దరెడ’్లకు ఇది సంకటమే మరి!

ప్రధానంగా తియ్యటి తిరుపతి లడ్లు, ఫొటోలు, శాలువలతో జగనన్న కోసం లాబీయింగ్ చేసే.. తిరుమల ‘అధర్మ’ప్రభువులకు, కేంద్రమంత్రుల కుమారులతో చెట్టపట్టాలేసుకుని, ఆముసుగులో అనుబంధం పెంచుకున్న పెద్దరెడ్లు- చిన్నరెడ్లకు టీడీపీ-బీజేపీ పొత్తు చేదువార్తనే .

ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీకి తోడయింది కాబట్టి.. రాగల ప్రమాదాన్ని తెలివైన మీడియా అధిపతులు గ్రహించడానికి, పెద్దగా సమయం పట్టదు. రేపటి నుంచి సర్వేలో పేరుతోనో, టీడీపీ వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానో తమ ‘ముందస్తువిధేయత’ సంకేతాలు పంపినా ఆశ్చర్యం లేదు. ఇప్పటివరకూ వైసీపీ భజనబృందంలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న ఇలాంటి మీడియా అధిపతులు, ‘అవసరాల కోసం’ తాత్కాలిక సభ్యత్వం తీసుకున్న మీడియా అధిపతులు, ఇక తమ దారి మార్చుకోవడంలో వింతేమీ ఉండదు.
కులం కార్డుతో ఒకరు, దూరపు బంధుత్వాల పేరుతో మరొకరు, గత పరిచయాల పేరుతో ఇంకొరు.. ఇవేమీ వర్కవుట్ కాకపోతే, పార్టీలో ఉన్న తమ ‘కుల’వేల్పుల ద్వారానో, బాబుకు సన్నిహితంగా ఉండే అధికారుల ద్వారానో, మళ్లీ పసుపుగూటికి రావడం తథ్యం. ఇది చెప్పడానికి పెద్ద మేధావి కానవసరం లేదు. గతానుభవాలు చూస్తే చాలు! కానీ చిన్నవయసులోనే ఇలాంటి గోకర్ణ-గజకర్ణ-టక్కుటమార విద్యలో ఆరితేరిన లోకేష్ ముందు, ఈ కుప్పిగంతులు-కులం గంతులు నడుస్తాయో లేదో చూడాలి.

ఇక వైసీపీ అనుబంధ మీడియా ఆశ చావకుండా, పొత్తుపై తమ శక్తిమేరకు కథనాలు వండివార్చవచ్చు. అంటే టీడీపీ-బీజేపీ ఓట్లు బదిలీ కావని, ముస్లిం-క్రైస్తవులు కూటమికి ఓట్లు వేయరని, బీజేపీతో పొత్తుపై టీడీపీలో అసమ్మతి మొదలయిందనే ‘వైసీపీ భక్తిపూరిత మీడియా’ వార్తలు ప్రసారం చేసినా. పత్రికల్లో అచ్చొత్తినా ఆశ్చర్యం లేదు. చనిపోయిన వారి కాయాన్ని మోసుకెళ్లే క్రమంలో, కొద్దిసేపు ఒకచోట ఆపి చెవులో చెబుతుంటారు. అలాంటిదే ఈ రాజకీయ ఎన్నికల దింపుడుకళ్లెం ఆశ కూడా!

అయితే పొత్తు రాజకీయాల్లో ఆరితేరిన టీడీపీకి అవి పెద్దగా ప్రతిబంధకం కాదు. బీజేపీ-కమ్యూనిస్టులు-కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అనుభవం టీడీపీది. ఆ సందర్భంలో సీట్లు కోల్పోయే నేతలకు ఎలా నచ్చచెప్పాలో టీడీపీకి కొట్టినపిండి. టికెట్లు రాని వారితో స్వయంగా మాట్లాడేందుకు చంద్రబాబు ఏమాత్రం అహం ప్రదర్శించరు. జగన్ మాదిరిగా ఏ సజ్జలనో, ఏ విజయసాయిరెడ్డినో, ఏ సుబ్బారెడ్డినో పంపించరు. పవన్ ఇంటికి బాబు స్వయంగా వెళ్లారన్నది మర్చిపోకూడదు. ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నేత బాబు.

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కలసిపోటీ చేసినా, మైనారిటీలు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించి ఉంచి అధికారంలోకి రాగలిగేది కాదు కదా? పైగా ఆంధ్రాలో తెలంగాణలో మాదిరిగా, మతవాదం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. హిందు-ముస్లిం-క్రైస్తవులు కలిసే జీవిస్తారు. పైగా టీడీపీపై ఇప్పుడు ముస్లింలలో నమ్మకం పెరిగింది. ముస్లిం-క్రైస్తవుల పండుగలకు చంద్రబాబు సర్కారు ఇచ్చిన బహుమానాలు, పథకాలను జగన్ సర్కారు అటకెక్కించారు. ఇలాంటి సానుకూల అంశాలే ఎక్కువ కాబట్టి, వైసీపీ ప్రేరేపిత మిత్ర మీడియా ఆశలు పెద్దగా ఫలించవు.
పైగా.. జగన్-బీజేపీ ఇప్పటిదాకా కలిసే ఉన్నారన్న విషయం, ముస్లిం-క్రైస్తవులకు తెలియదనుకుంటే అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు. మరి వారిద్దరి కలయికను పెద్దగా పట్టించుకోని మైనారిటీలు.. టీడీపీ-బీజేపీ కలిస్తే మాత్రం ఎందుకు ఆగ్రహిస్తారన్న లాజిక్ రాకపోవడమే విడ్డూరం.

సరే ఇప్పుడు పొత్తు కుదిరింది. కానీ మూడుపార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగాలి. అదొక్కటే ప్రధానం. అందుకే బాబు-పవన్-లోకేష్ -భువనేశ్వరి నలుదిక్కులా ప్రచారం చేస్తున్నారు. రేపు వారికి బీజేపీ అగ్రనేతలు జమవుతారు. ఇప్పటికే వారి సభల్లో టీడీపీ-జనసేన జెండాలు కలిసే దర్శనమిస్తున్నాయి. ఇక మూడవ జెండాగా బీజేపీ రాబోతుంది. నిజానికి ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. నాయకుల సంఖ్య తప్ప కార్యకర్తల సంఖ్య అత్యల్పం. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే దానిపేరుతో లాభపడేది కొందరు పెద్ద నాయకులే తప్ప, పార్టీకి చట్టసభల్లో ప్రవేశం ఉండదు. నాయకులకు మాత్రం ఐదేళ్లకు సరిపడా సాదరు ఖర్చులు చందాల రూపంలో పోగవుతాయి. అదొక్కటే బీజేపీ విడిగా పోటీ చేస్తే వచ్చే లాభం!

ఇప్పటిపొత్తు బీజేపీకే లాభం. ఐదు లోక్‌సభలో నాలుగు ఖాయంగా గెలిచే సీట్లే తీసుకున్నారు. గతంలో మాదిరి అత్యాశకు పోకుండా, గెలవగలిగే సీట్లే తీసుకుని తెలివి ప్రదర్శించారు. ఈ పొత్తుతో దక్షిణాదిలో కొన్ని సీట్లు గెలవాలన్న బీజేపీ నాయకత్వ ఆశ కూడా నెరవేరుతుంది. కాబట్టి బీజేపీకి పొత్తు లాభమే.

కాకపోతే.. బీజేపీ ఎట్టి పరిస్థితిలోనూ కుటుంబపార్టీలతో పొత్తు పెట్టుకోదని అమిత్‌షా పక్షాన తానే చెబుతున్నట్లు, గతంలో భవిష్యవాణి వినిపించిన దిగ్రేట్ సోము వీర్రాజు… 75 అసెంబ్లీ 15 లోక్‌సభ సీట్లతోపాటు, సీఎం సీటు కూడా ఇస్తేనే పొత్తు ఉంటుందని, నద్దా పక్షాన తానే చెబుతున్నట్లు ప్రకటించిన మహానేత విష్ణువర్దన్‌రెడ్డి.. ఇప్పుడు ఎక్కడ ముఖం పెట్టుకుంటారన్నది రాజకీయ విశ్లేషకుల ఉవాచ.

Leave a Reply