Suryaa.co.in

Editorial

అన్నకు అలా.. చెల్లికి ఇలా!

– దెబ్బల్లో రక్తపు దెబ్బలు వేరయా?
– బెజవాడలో జగనన్నపై రాయి దాడికి నుదుటిపై గీతలు
– మాచర్లలో చెల్లి రెడ్డమ్మ నుదుటన కొడవలి గాయం
– రెడ్డమ్మ చెల్లి నుదుటన కారిన రక్తం
– సోషల్‌మీడియాలో మళ్లీ జగనన్న ‘కట్టు’ కథలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగనన్న. బెజవాడలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనను ‘చంపే కుట్ర’(?)తో ఇద్దరు యువకులు, బస్సు మీదున్న అన్నపై రాయి విసిరారు. దానిదుంపతెగ.. అది విచిత్రంగా ముందు అన్నకు తగిలి.. కింద పడి.. మళ్లీ పైకి లేచి. అన్న పక్కనే ఉన్న శీను త మ్ముడి కంటిని గాయపరిచిందట. దానితో అన్న నుదుటిపై ఆ రాయి ‘భారీ గాయమే’ చేసిందట. ఎన్నికల ప్రచారానికి వెళ్లొచ్చిన అన్న, దగ్గర్లోని సర్కారీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.

ఈలోగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ చానెళ్లల్లో ‘అన్నపై హత్యాయత్న’మంటూ, వంతుల వారీగా ఒకటే వాంతుల వార్తలు. వెరైటీ సౌండ్లతో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేస్తూ, బ్రేకింగ్ ‘వ్యూసు’ల న్యూసులు. ఆపరేషన్ గదిలోకి వెళ్లిన అన్నకు, ఒక అరడజను మంది డాక్టర్లు చికిత్స చేసి, చివరాఖరకు బ్యాండేజీ వేసి పంపించారు. ఆ సందర్భంగా అన్న కూడా అక్కడి డాక్టర్లు, నర్సమ్మలతో షిక్కటి షిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. ఇక తమ్ముడు శీను కంటికీ, దాదాపు పెద్దాపరేషనే చేశారట. దానితో ఆయన పాపం, కంటిని కప్పేస్తూ ఇంకొంచెం పెద్ద పట్టీతోనే దర్శనమిచ్చారు. జగనన్న నుదుటయితే, ఆ బ్యాండేజీ సైజు రోజూ మారి కనిపించింది.

అన్నదమ్ముల బ్యాండేజీ సైజులపై సోషల్‌మీడియాలో సెటైర్లు, అప్పటికే దీపావళి బాంబుల్లా పేలిపోతున్నాయి. మధ్యలో జగనన్న డాక్టర్ చెల్లెమ్మ సునీత ఎంటరయి.. అన్న వేసుకున్న బ్యాండేజీ తక్షణం తీయకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అది తీసేస్తే గాలికి అదే మానిపోతుందని ప్రిస్కిప్షన్ రాయకుండానే సలహా ఇచ్చారు. ఆ రెండో రోజున ఏమైందో ఏమో.. జగనన్న నుదురు బ్యాండేజీ లేకుండా, చిన్న గీత కూడా లేకుండా ఫ్రెష్ గా దర్శనమిచ్చారు. దానితో పదిరోజుల జగనన్న ‘కట్టు’కథకు శుభం కార్డు పడినట్టయింది.

సీన్ కట్ చేస్తే.. పోలింగ్ సందర్భంగా, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటాల గ్రామంలో, ఓరెడ్డమ్మ చెల్లిపై వైసీపీ కార్యకర్తలు వేట కొడవలితో దాడి చేశారు. కారణం ఆమె టీడీపీ బూత్ ఏజెంటుగా కూర్చోవడమేనట. దానితో ఆమె నుదుటిపై అర అంగుళం మేర లోతు గాయమయింది. ముఖం నిండా రక్తం ధారగా కారిపోయింది. కళ్ల కింద భాగం దెబ్బలతో వాచిపోయింది.

అయినా మాచర్ల రెడ్డమ్మ చలించలేదు. వేటకొడవలితో తనను ‘నిజంగా’ హత్య చేసేందుకు.. వైసీపీ కార్యకర్తలు తన నుదుటిపై అర అంగుళం లోతుతో కోసినా, సదరు రెడ్డమ్మ ఏమాత్రం వెరవలేదు. సర్కారీ ఆసుపత్రికి పరుగులు తీయలేదు. అన్నలా అరడజను మంది డాక్టర్లతో కట్టు కట్టించుకోలేదు. ఆపరేషన్ తర్వాత డాక్టర్లతో గ్రూపు ఫొటోలూ దిగలేదు. మొక్కవోని ధైర్యంతో పోలింగ్ బూత్‌లోనే కూర్చుంది. ఇంతకూ ఆమె పేరు మంజులారెడ్డి. మాచర్ల వైసీపీ అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, స్వయంగా మరదలేనట! అదివేరే విషయం.

ఇంతకూ మానిపోయిన జగనన్న ‘కట్టు’కథలో.. మాచర్ల రెడ్డమ్మ ఎందుకొచ్చిందనుకుంటున్నారా? అదే ఇక్కడ ట్విస్టు. ఎందుకంటే మన తెలుగు సోషల్‌మీడియా సైన్యం చేతులు ఒక పట్టాన ఊరుకోవు కదా? ఆ అలవాటు ప్రకారంగా.. జగనన్నకు తగిలిన గాయం తాలూకు బ్యాండేజీని- మాచర్ల రెడ్డమ్మకు తగిలిన ‘ఒరిజినల్’ కొడవలి నెత్తుటి గాయం ఫొటోలను పోల్చుతూ, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

జగనన్నా..నిజమైన ‘దెబ్బంటే ఇదన్నా’ అని కొందరు.. ‘జగనన్నా రాయిదెబ్బకు నువ్వే అంత పొడవు బ్యాండేజీ వేసుకుంటే, పాపం ఆ అక్క ఇంకెన్ని మీటర్ల బ్యాండేజీ వేసుకోవాలన్నా’ అని మరికొందరు.. ‘దెబ్బంటే ఇట్లా రకతం రావాలేగానీ గీసుకున్నదానిని దెబ్బంటే ఎట్లన్నా’అని, ఇంకొందరు తెగ సెటైర్లు సంధిస్తున్నారు. మానిపోయిన గాయాన్ని గుర్తు చేయడమంటే ఇదేమరి!

LEAVE A RESPONSE