జగనన్న ’మీడియా సూక్తి’ ముక్తావళి!

– మీడియా భజనను రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదట
– మీడియా భజనపై జగనన్న అద్భుత అనుగ్రహభాషణ
( మార్తి సుబ్రహ్మణ్యం)

’’ స్వార్ధ ప్రయోజనాల కోసం మీడియా భజన చేస్తుందని మన రాజ్యాంగ నిర్మాతల, స్వాతంత్య్ర సమరయోధులు ఊహించలేదు’’
– ఈ డైలాగేదో డాక్టర్ అంబేద్కరో.. మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీనో.. అసలు మీడియాతో సంబంధం లేని.. చానెళ్లతో బాదరాయణ సంబంధం లేని… జయప్రకాష్ నారాయణ లాంటి ఓ సాధారణ రాజకీయ నాయకుడో చేసిందనుకుంటే కచ్చితంగా ప(త)ప్పులో కాలేసినట్లే. ఇవి అచ్చంగా ఒకప్పుడు.. ఒక పత్రిక- మరో చానెల్‌కు పురుడుపోసి, దానిని మహావృక్షంగా మార్చిన ‘మీడియా మొఘల్’ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్య. అంటే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న అదే జగనన్న.. స్వాతంత్య్ర దినోత్సవ వేళ టన్నుల కొద్దీ కురిపించిన ఆవేదనతో కూడిన ఆరోపణ. అదో ధర్మాగ్రహం. ఆశ్చర్యంగా లేదూ?!

ఎందుకుండదూ?.. మామూలుగా ఇలాంటి డైలాగులు ఏ సీపీఐ నారాయణ, లేదా సీపీఎం మధు చేసి ఉంటే నవ్వుకునేవారు. ఎందుకంటే ఆ రెండు పార్టీలకూ చెరో పత్రిక చేతిలో ఉంది కాబట్టి. బహుశాeenadu అందువల్లే వారు ఇలాంటి సాహస వ్యాఖ్యలు చేయరు. ఇక టీడీపీ చంద్రబాబుకు ఈనాడు-ఈటీవీ, ఆంధ్రజ్యోతి- ఏబీఎన్, టీవీ5 బహిరంగ- మానసిక మద్దతుదారులే తప్ప, అవి టీడీపీకి సొంత చానెళ్లు కాలేవు.

ఎందుకంటే ఆ ఐదు సంస్థలకు బాబు అధికారంలోకి రావాలన్న కామన్ అజెండా ఉన్నప్పటికీ, అంతకుమించిన వ్యాపారపోటీ కూడా ఉంటుంది. పైగా ఎవరికి వారు చంద్రబాబుకు తామే రాజగురువులుగా భావించుకుంటారు. సో..అక్కడా చిన్నపాటి పోటీ అన్నమాట. అందువల్ల టీడీపీకి మద్దతు అన్న అంశంలోనే కలుస్తారు తప్ప, మిగిలిన వ్యవహారాల్లో వారి అజెండాలు వేరు. ఇది స్పష్టం. సో.. రాజకీయ ప్రత్యర్ధులు విమర్శిస్తున్నట్లు, ఆ ఐదు సంస్థల్లో టీడీపీ పెట్టుబడులు కనిపించవు. అప్పట్లో స్టుడియో -ఎన్ చానెల్ నడిపి, చేతులు కాల్చుకున్న విఫల ప్రయోగమే దానికి కారణం కావచ్చు.

ఇక పవననన్న పార్టీకీ రెండు చానెళ్లున్నాయి. కాకపోతే అవి కూడా చంద్రబాబుకు ఆ ఐదు ఎలా మద్దతిస్తాయో, పవన్‌కు ఆ రెండూ అలాగే మద్దతునిస్తున్నాయి. రన్నింగులో ఎవరి ఇం‘దనం’ వారిదే. కాకపోతే ఆ రెండు పవన్ కోసం పనిచేస్తాయి. ఇక సాక్షి పత్రిక, సాక్షి చానెల్ రెండూ జగనన్నsakshi-ys కుటుంబానిదే. కాబట్టి లాభనష్టాలు కూడా ఆ కుటుంబానిదే. ఇక అధికారంలో ఉంది కాబట్టి, మిత్ర మీడియా సౌజన్యం ఎలాగూ ఉంటుంది. అంటే కావలసినన్ని లీకులు, హైపులూ ఇచ్చేందుకు ఎవరెడీగా ఉంటాయన్నమాట. ఒకవేళ అధికారం మారితే, ఆటోమేటిక్కుగా అటువైపు సర్దుకుంటాయి. ఇది కామన్‌గా కనిపించే ఆర్ట్ ఆఫ్ లివింగ్’ పాలిసీనే!

ఇదీ.. ఏపీలో మీడియా ముసుగు తొలగిస్తే కనిపించే అసలు సిసలు నిజం. కానీ.. ‘‘స్వార్ధ ప్రయోజనాల కోసం మీడియా పనిచేస్తుందన్న విషయాన్ని రాజ్యాంగ నిర్మాతలు, సమరయోధులు ఊహించలేద’’న్న జగనన్న వ్యాఖ్య ఎవరినుద్దేశించి చేసినప్పటికీ.. అది జగనన్న కుటుంబ ఏలుబడిలో ఉన్న మీడియాకూ వర్తిస్తుందన్న సత్యం, ఆయన గ్రహించకపోవడమే విచిత్రం. అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వ్యక్తిగతంగా తనకు- రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి పెట్టే ‘రాజకీయ ర్యాంగింగు’కు తాళలేక.. మహానేత వైఎస్ తన కుమారుడయిన, నాటి కాంగ్రెస్ ఎంపీ-నేటి సీఎం జగన్మోహన్‌రెడ్డితో పెట్టించిన మీడియా సామ్రాజ్యమే.. సాక్షి అన్నది రహస్యమేమీ కాదు.

అప్పుడు సాక్షి మీడియా కాంగ్రెస్‌కు దన్నుగా నిలిచి, వైఎస్ తరచూ విమర్శించే ‘ఆ రెండు పత్రికల’ విమర్శలకు ధీటుగా జవాబిచ్చింది. అంటే కాంగ్రెస్ కరపత్రంగా పనిచేయడం ద్వారా, కాంగ్రెసుకూ ఓ పేపరుందని చాటింది. టీడీపీపై నేరుగా దాడి చేసింది. దానివల్ల అప్పటివరకూ ఈనాడు, ఆంధ్రజ్యోతి చెప్పేవే నిజాలని నమ్మే జనాలను, సాక్షి మరో మార్గం పట్టించింది. దానితో సత్యం, అసత్యం రెండూ జనంలోకి వెళ్లాయి.

YS-Jagan-sakshi-buildingసూటిగా చెప్పాలంటే.. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ స్వార్ధప్రయోజనాల కోసమే, వైఎస్ మీడియా పనిచేసిందన్నమాట. కానీ అప్పుడు వైఎస్ కూడా.. ఇప్పటి జగన్ మాదిరిగా రాజ్యాంగాలు, సమర యోధులంటూ భారీ డైలాగులు పేల్చిన దాఖలాలు లేవు. బహుశా అప్పుడు వైఎస్‌కు, ఇప్పటి జగనన్న దగ్గర ఉన్న పాత్రికేయ మేథావులు, సలహాదారుల మాదిరిగా స్క్రిప్టు ఇచ్చేవారు లేకపోవచ్చు.
సరే. అప్పటి సంగతెందుకు? పెద్దాయన మృతి చెందిన తర్వాత, జగన్‌కు సొంత మీడియా ఆశ-శ్వాసగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆయన మీడియా లేకపోతే, జగన్ జనంలో నిలిచేవారే కాదు. ఓదార్పు-పాదయాత్రలో ఏ స్వార్ధప్రయోజనం లేకుండానే.. ఆయన సొంత మీడియా పనిచేసి ఉంటే, అన్ని పేజీలు జగనన్నకు అంకితం చేసి ఉండేవి కావు.

ఇక జగనన్న సొంత మీడియా.. ఇప్పుడు కూడా ఏ స్వార్ధ ప్రయోజనం లేకుండా పనిచేస్తుందనుకోవాలా? అన్నది బుద్ధిజీవుల ప్రశ్న. ఓవైపు విపక్షాలపై విమర్శనాస్త్రాలు, మరోవైపు సొంత సర్కారుపై ప్రశంసల జల్లు కురిపించుకునే జగనన్న మీడియా.. ఏ స్వార్ధ ప్రయోజనం లేకుండానే ఆ పని చేస్తోందా అన్నది పాత్రికేయం ప్రశ్న. అసలు ఓవైపు సొంత మీడియాకు కోట్లాది రూపాయల ప్రకటనలిస్తున్నారంటూ విపక్షాలు ఇల్లెక్కి కోడై కూస్తున్నాయి.

మరోవైపు, పథకాలు ప్రజల కోసమా? సొంత మీడియాకు ప్రకటనలిచ్చి పోషించుకోవడానికా? అని నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి నిలదీస్తున్న వేళ… మీడియా స్వార్థ ప్రయోజనం కోసం పనిచేస్తుందన్న డైలాగును.. రాజ్యాంగ నిర్మాతలు- సమరయోధుల నోటిలో పెట్టి, జగనన్న మాట్లాడటమే భలే వింతగా ఉందన్నది బుద్ధిజీవుల ఉవాచ.

అయినా జనం పిచ్చి గానీ.. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి, ఎడిషన్ల మీద ఎడిషన్లు పెట్టి, వంద కోట్ల రూపాయలతో చానెళ్లు పెట్టి, మీడియా సంస్థలు నడిపేది స్వార్ధ ప్రయోజనాల కోసం కాకుండా.. ప్రజాసేవ చేసేందుకా?! పిచ్చితనంతో కూడిన అమాయకత్వం కాకపోతే?!

Leave a Reply