Suryaa.co.in

Entertainment

మనసున మల్లెల మాలలూగెనే..

ఆమె గళం..
సప్తస్వర సమ్మేళం
ఆమె అభినయం..
చతుషష్టి కళాకౌశలం..
ఆమె అక్షరాలు..
అపుడపుడు అక్షతలు..
ఆమె నైజం..
సొగసుగా కనిపించే తలబిరుసు..
వ్యవహారం బహుముఖం
నచ్చకపోతే.. నప్పకపోతే
విజయా సంస్థకే
కటీఫ్ శ్రీముఖం..
తొలినాటి మల్లీశ్వరి..
మలినాటి లలితమ్మ
మరునాటి రాజ్యలక్ష్మమ్మ..
ఎవ్వరికీ లొంగని మంగమ్మ..
రామకృష్ణ గారి శ్రీమతి..
అభినేత్రి భానుమతి
వెండితెరకు విలువైన బహుమతి..!!

కాళిందిగా వచ్చింది..
కాళికమ్మలా విజృంభించింది
కాంచనమాలకే నచ్చేసింది..
మిస్సమ్మను తాను మిస్సయినా సావిత్రి వచ్చిందిలే అని సరిపెట్టేసింది..
ఆమె ఫ్లాష్ బ్యాక్
మొత్తం ప్లేబాక్..
అద్భుతమైన గొంతు
ఎవ్వరికీ ఇవ్వలేదు అరువు
ఏనాడూ ఎవరి స్వరం
తెచ్చుకోలేదు ఎరువు..!

ఇందుకేనా
నీవు చేసే
పూజలన్ని తపోధనా..
మత్తెక్కించే
ఆ స్వరవిన్యాసంతో విప్రనారాయణుడు
సన్యాసానికే సన్యాసం..
అమ్మాయిలూ అబ్బాయిలూ
_నా మాటలో నిజం
వింటారా మీరు..
రెండో ఇన్నింగ్స్ లోనూ
గళంలో తగ్గని హుషారు..
తీరని నా కోరికలే తీరు
ఈ రోజు..
ఆ గొంతులో అహం..
అంతటి రాయలే దాసోహం…
వెన్ ఐ వస్ జస్ట్
ఎ లిటిల్ గర్ల్..
కె సరా..సరా..
లివింగ్ స్టన్ ఇంగ్లీషు పాటకూ
పోయలేదా ప్రాణం..
ఏడ తానున్నాడో బావ
జాడ తెలిసిన పోయిరావా..
ఇలా అడిగితే మల్లీశ్వరి
మళ్లీమళ్లీ కరిగిపోదా మేఘమాల..!
శ్రీకర కరుణాలవాల వేణుగోపాల..
మల్లమ్మ భక్తి మురిపాల..
ఇలాంటి ఎన్నో పాటలు
భానుమతి గళం నుంచి జాలువారిన తేనెమూటలు!

చేసేసి రచన ఆగిందా..
స్టూడియో ఆమెదే..
పాటలూ పాడేసి..
సంగీతమూ తనే..
ఇన్ని చేశాక
దర్శకత్వమూ తనదే..
ప్రేమలో తనుంటే లైలా..
ప్రేములో తనుంటే*
ఇతరులు ఇంకోలా ..
ఫిమేల్ డామినేషన్..
అయినా గాని
ఎన్టీఆర్..ఏయెన్నార్..
ఇద్దరితోనూ*
హిట్టు కాంబినేషన్!
బామ్మ మాట బంగారు బాట
సూపర్ సాంగ్..
నూతన్ కు మాత్రం బూమ”రాంగ్”!

మొత్తానికి భానుమతి
వెండితెర వీర భాగమతి..
ఎన్నో కళలతో భువికి దిగివచ్చిన వాగ్దేవి అనుమతి..
అభినయ మయూర..
అదృష్టవశాత్తు
గంధర్వ లోకం
నుంచి భువిపైకి
జారిపడిన మనోహర!
(విజయవాడ లో ఓసారి మనసున మల్లెల పాట
ఆమె మధురంగా ఆలపిస్తుంటే వినే భాగ్యం కలిగింది..!)

ఎలిశెట్టి సురేష్ కుమార్

LEAVE A RESPONSE