కమల్..క్యా కమాల్ హై!

నటిస్తే విశ్వరూపం..
అభినయిస్తే దశావతారం..
హీరోగా భలేభలే మగాడు..
సిసలైన భారతీయుడు..
మనిషిగా స్వాతిముత్యం(?)..
కెరీరెమో మరోచరిత్ర!

వచ్చిన కొత్తలో
మన్మధలీల చేసినా..
వయసు పిలిచింది అంటూ పరుగులు పెట్టినా..
కుర్రాళ్లోయ్..కుర్రాళ్లోయ్
ఇలా వెర్రెక్కి గంతులేసినా…
ఇది కథ కాదు..
కమల్ హాసన్ నటజీవితం..
అది సాగరసంగమం..
ఆయన చిత్రరంగ ప్రవేశమే
శుభసంకల్పం…
అమాయకత్వం ఉట్టిపడే
పాత్రల్లో పరకాయప్రవేశం..
ఆకట్టుకునే ప్రతి సన్నివేశం..
ఇంట్లో ముసలమ్మ పోయినా
ఇతగాడి ఆకలిరాజ్యం…
కడుపు దేవేసే నటన..
అసలు మాటల్లేని సినిమా..
పుష్పకవిమానం..
అంతా సైగలతోనే…
అమలతో ప్రేమ..
కనులతో వ్యక్తీకరణ..
మిగిలిన ఆధారం
కాగితం ముక్క
ఎగిరిపోతే ఆవేదన..
అభినయ పరాకాష్ట…
అలా పెరుగుతూ వచ్చిన
కమల్ ప్రతిష్ట..!

రూపంలో..తత్వంలో..
స్వరంలో..స్వగతంలో
పొంతన లేని పది పాత్రలు..
శంకర్ మీద ఒట్టు..
అది పూర్తిగా కమల్ కనికట్టు..
అసలు చివర్లో బుష్ హాసన్
వేదికపై లేచిన తీరు..
మేకప్పా..క్లోనింగా..
ఏం చేశాడు..
నా సామి రంగా!

అతడు కమలని
చెప్తేనే గాని తెలియని భారతీయుడి గెటప్పు..
అవినీతిపరులను చంపేటప్పుడు ముఖంలో
అదోలాంటి ఎక్స్ప్రెషన్
ముసలాడి పాత్రతోనే
ఆ సినిమా
సరికొత్త సెన్సేషన్!

సొట్టోడు..పొట్టోడు..
ముంబై లుంగీ డాన్
ఈరినాయుడు..
కూతురిపై మహానది
అంత ప్రేమ కురిపించే తండ్రి..
కలగా కల్పనగా
కనిపించిన దొరసాని
శ్రీదేవి కోసం
రైల్వే స్టేషన్లో
కుప్పిగంతులు
వేసిన మాస్టారు..
అంతకు ముందు అదే
ఎర్రగులాబీ శ్రీదేవిని అల్లాడించిన శాడిస్టు దిలీప్
బాన పొట్ట కురూపి మేయర్
క్షత్రియపుత్రుడు..
నిజం చెప్పాలా
అబద్ధం చెప్పాలా..
అమాయకంగా ప్రశ్నించే
సుద్దమొద్దావతారం..
స్వాతిముత్యం
అదరగొట్టిన దశావతారం..
ఒకదానిని మించి ఒకటి..
అందమైన
మగువలను తలదన్నే
భామనే సత్యభామనే..
సావిత్రినే వల్లో పడేసిన
జెమినీని పిచ్చెక్కించిన
ముసలి మిన్మినీ..
అవ్వై షన్మి..
ఇలాంటి పాత్రలు
కమల్ కే చెల్లు..
ఆయన ఎలా కావాలంటే
అలా వంగిపోయే విల్లు…!

నటనలో మేరునగం..
అతడిలో ఎంజీఆర్,శివాజీ
కనిపిస్తారు చెరో సగం..
ఇటు కెరీరు
అప్పుడప్పుడు తకరారు..
అటు సంసార జీవితం
ఎప్పటికప్పుడు మారు..
పెళ్ళాల పోరు..
మార్చేసే తీరు..!
రాజకీయంగా
ముక్కల్ నీది మయ్యం..
కొత్త కయ్యం..
ఉడకని బియ్యం..
అవన్నీ పక్కనబెడితే
కమల్ ఓ లెజెండ్..
మేల్ బ్యూటీ…
పాత్రలన్నీ వెరైటీ..
ఖచ్చితంగా
నట యూనివర్సిటీ!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply