సినిమా వెర్రి..ముదిరి పిచ్చి..!

ఆ వర్మం అర్థం కాని
ఓ మర్మం..
తన రాతను తనే మార్చుకున్న ఓ ఖర్మం..
తాను చెప్పేదే ధర్మం
అనుకుని వివాదమై జనం పట్టించుకోకపోయినా
అలా సినిమాలు తీస్తుండడమే
అతగాడి ఆపద్ధర్మం!

శివ..ఈ సినిమా చూసి
అబ్బో.. ఓ దర్శకుడు పుట్టాడని అనుకునేలోగానే
హిట్టు మీద హిట్టు..
ఏ క్షణంలో మొదలైందో
ఏమో తిక్క
క్షణక్షణం తీక్షణం అవుతూ..
నిప్పుకణం
లాంటోడు తనని తానే
ఆర్పేసుకునేందుకు
కట్టేసుకుంటే కంకణం..
ఇదిగో..ఇప్పుడిలా డీలా..
హిట్ల కోసం లంకణం!

చిన్నప్పుడు నచ్చిన షోలే..
ఎ ఫిలిం బై సిప్పీ..
మెచ్చేసి ఈ కార్డు
చెరిపేద్దామని ఆ రికార్డు..
వెర్రితలలు వేసి మేధస్సు..
కెరీర్లోనే అది పెద్ద తుస్సు..
రివర్స్ కొట్టేసింది అప్పటివరకు పోగుచేసిన
వర్మ యశస్సు..
భగ్నమైపాయె ఓ పిచ్చివాడి
హిట్టు సినిమాల తపస్సు!!

ఇంటర్వ్యూలు..
ఇన్నర్ వ్యూలు..
జనాల చెవిలో పూలు..
ఒకనాటికి బెడిసికొట్టి
అతగాడే ఏప్రిల్ ఫూలు!
బుద్దిలాగే సినిమాలు
పట్టేసి పక్కత్రోవ..
వెంకన్న చేతి మీద
దొంగల కాలు..
దెబ్బకి ఆ సినిమా
గోవిందా..గోవిందా..
జాము రాతిరి జాబిలమ్మ..
ఓ హిట్టూ..
జాగు చేయకే ఇలా!
యదో బుద్ధిహి..
స్థదో గతిః..
అతగాడి బొమ్మలు
అధో గతిః..!

ఇ.సురేష్ కుమార్

Leave a Reply