బాధే శ్యామ్ బాదేశాడు

కోట్లాది రూపాయల వ్యయం..
హీరో ప్రభాస్ గనుక..
అతగాడికి బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్థాయి ఇమేజ్ వచ్చింది గనుక..
అంత భారీగా ఖర్చు పెట్టారు గాని రాధేశ్యామ్ కథలో ఆ డిమాండ్ లేదు.
వాస్తవానికి ఇది ప్రభాస్ తో అంత డబ్బు పారబోసి తీయాల్సిన కథ కానే కాదు.
మన దేశంలోనే..ఇంకా చెప్పాలంటే మంచి సెట్టింగులు వేసిఏ శర్వానందో..ఇంకొంచెం ఖర్చుతో విజయ్ దేవరకొండనో..మధ్యస్థంగా కార్తినో పెట్టి ఇంకాస్త బలమైన కథతో..పటిష్టమైన స్క్రీన్ ప్లేతో..ఆసక్తి పెంచే ఎడిటింగ్ తో తీస్తే సరిపోయేది.అలా చెయ్యకుండా కథకు అవసరం లేని విదేశీ లోకేషన్లు..భారీ ఖర్చులు..ఇవే ప్రధానంగా కనిపించాయి సినిమాలో..

అవసరమైన చోట ఖర్చు పెట్టినట్టు కాకుండా భారీ సినిమా అనిపించుకునేందుకు డబ్బులు వెదజల్లినట్టు అనిపించింది.సినిమాలో కనిపించిన రిచ్ నెస్ కథలో గాని..కథనంలో గాని కనిపించలేదు.అసలు ఆ కథకు అంత రిచ్ లొకేషన్స్..అన్ని దేశాల్లో చిత్రీకరణ అవసరం లేదు.కేవలం రాజమౌళిలా భారీతనం కోసమే ఆ హంగులన్నీ..

ఇక ప్రభాస్ కు లవర్ బాయ్..(లవర్ మ్యాన్ అనాలేమో..)లుక్ తెచ్చేందుకు కష్టపడినా మీసాలు తీసేసి అతని రూపం పాడుచేసినట్టు అనిపించింది.లేతగా కనిపించాల్సింది పోయి ముదరగా అనిపించాడు. మీసాలు లేకుండా హుందాగా కనిపించే సచిన్ ఖేడ్కర్ కు మీసాలు తగిలించి పాడుచేసారు.ఎప్పుడూ మీసాలు లేకుండా కనిపించే మురళీ శర్మకు మీసాలు అతికించి గుర్తుపట్టలేకుండా మార్చేశారు.డైలాగులు బాగా పలికే నటుడిని మూగనోము పట్టించి ఉనికే లేకుండా చేసినట్టు అనిపించింది.

ఆయన మాత్రమే కాదు జగపతిబాబు..జయరామ్ వంటి పెద్ద స్టార్స్ ని ఆ పాత్రలకు వారిని ఎందుకు పెట్టారా అనే స్ధాయిలో సరిగ్గా వాడుకోకుండా చేసేశారు.జయరామ్ నైతే మరీ కమెడియన్ లెవెల్ కి దించేసారేమో అనిపించింది.ఇక భాగ్యశ్రీ ఉందా అని సినిమా నుంచి బయటికి వచ్చాక వాళ్ళు..వీళ్ళు చెబితే తెలుసుకున్న పరిస్థితి.

మొత్తానికి రామ్ చరణ్ కు మగధీర తర్వాత వచ్చిన ఆరెంజ్ లా..ప్రభాస్ కి బాహుబలిని అనుసరించి విడుదలైన రాధేశ్యామ్..ఆరెంజ్ కూడా బొమ్మరిల్లు భాస్కర్ అతి తెలివితేటలతో జాతికి ఒక సరికొత్త ప్రేమ సందేశం ఇస్తున్న మేధావిని సుమా అన్నట్టు అర్థం కాని ఓ సినిమా తీసేసి నిర్మాత చెయ్యి కాల్చేసి ప్రేక్షకుల నడుం విరక్కొట్టేసాడు.

ఇప్పుడేమో రాధాకృష్ణ అనే దర్శకుడు(ఇతగాడికి అంత పేరు ప్రతిష్టలున్నట్టు వినలేదు)యువతరాన్ని పాడుచెయ్యడానికా అన్నట్టు ఫ్లిర్టేషన్షిప్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి ఇప్పటికే డేటింగ్ తదితర పోకడల వల్ల కొంత పెడత్రోవ పట్టేస్తున్న యువతకు లేనిపోని పరిజ్ఞానాన్ని పెంపొందించే వ్యర్థ ప్రయత్నం చేసాడు.

ప్రేమ కంటే కొన్ని చోట్ల మితిమీరిన శృంగార సన్నివేశాలు ఇబ్బందిగా అనిపించాయి. కథ డిమాండ్ చేస్తే లిప్ కిస్ లు అని మొదట్లో చెప్పిన సినిమా మేధావులు యాక్టర్లను డిమాండ్ చేసి అవసరం ఉన్నా లేకపోయినా ముద్దుల వర్షం కురిపించేస్తున్నారు.

ఇక కథాపరంగా చూస్తే 1976 నేపథ్యం ఆంటూ వర్తమాన వాతావరణాన్ని చూపించేసాడు దర్శకుడు..
ఎంత ఆధునికత అని సరిపెట్టుకున్నా ప్రభాస్..పూజా హెగ్డేతో పాటు ఇతర నటీనటుల గెటప్పులు లేటెస్ట్ ఫ్యాషన్స్ తో సాగాయి..అసలు ఒక జ్యోతిష్కుడికి అంత లేటెస్ట్ గెటప్ అవసరమా..అది కూడా 1976 లో..రంగస్థలం సినిమాలో కథాకాలానికి అనుగుణంగా నటీనటుల ఆహార్య వ్యవహారాలను
తీర్చి దిద్దడంలో దర్శకుడు..ఇతర సాంకేతిక నిపుణుల శ్రద్ద..కృషి స్పష్టంగా కనిపించాయి.ఈ సినిమాలో ఆ స్పృహ కృషంరాజు గెటప్ విషయంలో మాత్రమే తెలిసింది.ఆయన కూడా వయసు మరీ ఎక్కువై పాత్రకు న్యాయం చెయ్యలేకపోయారు.ఇంతోటి పాత్రకు ఇతర భాషల్లో కట్టప్ప సత్యరాజ్ ను పెట్టేసి
నడిపించారట..

ఎంత ఐన్ స్టీన్ ఆఫ్ పామిస్ట్రీ అయినా క్షణాల్లో మొత్తం జీవితాన్ని గురించి చెప్పేస్తున్నట్టు చూపించడం
కృతకంగా అనిపించింది.ఇక క్లైమాక్స్ పూర్తిగా కథకు అందని ఇంగ్లీష్ సినిమా వాతావరణంలో సాగింది. మొత్తంగా సినిమా టూరింగ్ టాకీస్ లో చూస్తున్న టైటానిక్ ఇంగ్లీష్ సినిమాలా అనిపించింది..

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply