Suryaa.co.in

Entertainment

ఎప్పటికీ నవ్యం…ఆ దృశ్యకావ్యం!

వినుడు వినుడు
రామాయణ గాథ
వినుడీ మనసారా..

అద్భుత పురాణ గాథ
రామాయణాన్ని వాల్మీకి
అందించె ఏడు కాండలుగా
దానిని పుల్లయ్య,సీఎస్సార్
మలచె 22 రీళ్లుగా
పంచరంగుల దృశ్యకావ్యం
లవకుశగా..!

రామన్న రాముడు
కోదండరాముడు..
శ్రీరామచంద్రుడు వచ్చాడయ్యా..
సీతమ్మ తల్లితో
వచ్చాడయ్యా..
ఇలా శ్రీకారమై..
రామకథను వినరెయ్య
ఇహపరసుఖములనొసగే
సీతారామ కథను
వినరెయ్య నుడికారమై..
సురలు పొగడ ధరణిజతో
పురికి తరలె రఘునేత
వరకు పాటలలోనే పారవశ్యం..
రామాయణ మధురసం..

శ్రీరామపట్టాభిషేకంతో శ్రీకారం
లవకుశుల పట్టాభిషేకం
అనంతరం
శ్రీమచంద్ర ప్రభువు
అవతార పరిసమాప్తం వరకు
ప్రతి దృశ్యం మనోహరం..
27 పాటల మణిహారం..!

ఆజానుబాహువు
అయోధ్య రామయ్య
ఆరడుగుల అందగాడు నందమూరి
తారక రామయ్య
ఇద్దరూ ఒకరేనా..
సీతను కానలకు పంపుతూ
జానకిరాముడి విలాపం..
లక్ష్మణాది సోదరులు
ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత అంటూ
నిలదీసిన వేళ
రాజారాముడిగా ఆవేశం..
తల్లికి సమాధానం చెప్పలేక
నిస్సహాయుడిగా నిలిచిన
కోసల రాముడి విలాపం..
భూజాత భూమాతలో
కలసిపోయే సమయాన
మామూలు మనిషిలా శోకం
ఇలా అన్ని రసాలు అపూర్వంగా ప్రదర్శించి
తారకరాముడు
వెండితెర రాముడిగా సాక్షాత్కరించిన
కన్నులపండుగ..
లలితా శివజ్యోతి శంకరరెడ్డి
బ్రతుకు పండగ..!

ఇలపై అవతరించిన మహాలక్ష్మి
ఆమెకు మరో రూపు దాల్చిన అంజలీదేవి..
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు నేపథ్యంగా అడవులకు
అమాయకంగా పయనమైనా..
లక్ష్మణస్వామి పిడుగులాంటి వార్తను చెప్పగా కుప్పకూలినా
అమ్మ రమ్మని పిలిస్తే కన్నులారగ తుదిసారిగ కరువుతీర వీరశృంగార రామావతారమ్ము
దరిశన మొనర్చి నిన్ను చేరెద
మన్నింపుమమ్మా
అని తల్లిని వేడుకున్నా
లోకపావని నామంతో వాల్మీకి వెంట ఆశ్రమం చేరినా..
ధరణిజ మదిలో
మెరిసిన మోదము అంటూ
బిడ్డల ముద్దుగారు పాటలు
విని మురిసినా..
తండ్రీకొడుకుల భీకర సమరానికి వగచినా..
అంజలికి ప్రేక్షక లోకం
ఘటించింది
కోట్ల చేతులతో అంజలి..!

ఇక లవకుశుల
సమ్మోహన రూపం..
సినిమా తీయడంలో ఆలస్యమై
కొలతలు మారినా
ఆ ఇద్దరినీ రాముని కొడుకులుగానే చూసి జనం
థియేటర్లలో ప్రభంజనం..!

వాల్మీకికి మరో రూపమై నాగయ్య…
మూర్తీభవించిన మాతృమూర్తిగా కన్నాంబ..
కాంతారావు,కైకాల,శోభన్..
రమణారెడ్డి,సూర్యకాంతం..
ఎవరికి వారే జీవించగా
సినిమా ఆడేసింది సంవత్సరాల తరబడి
నిర్మాతలకు అంతులేని రాబడి!

ఘంటసాల సంగీతం..
పాటలు..మహాగాయకుడు
నాగయ్యకే ప్లేబాక్ ఇచ్చిన
మాస్టారి సాహసం..
సందేహింపకుమమ్మ..
ఆ గంధర్వ గాయకుడి
స్వర విన్యాసం..
సప్తాశ్వరథమారూఢంతో మొదలుపెట్టి..
ఇంతకు పూని వచ్చి..
ప్రతిదినమేను తొలుదొలుత
పాదములంటి నమస్కరించి..
ఇదె మన ఆశ్రమము..
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం..
తాటకి దునుమాడి..
స్త్రీ బాలవృద్దుల తెగనాడ గూడుట పాడి కాదని వెనకాడుచుంటి..
ఇలా ఎన్నెన్నో
పద్యాలు శ్రీరాముడికి నైవేద్యాలు..
పాటలు అనుభవేకవేద్యాలు..
ఇలాంటి ఎన్నో మృదుమధుర
విశేషాల సమ్మేళనం
తొలి తెలుగు
రంగుల సమ్మోహనం..

లవకుశ విడుదలై 59 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఓ కవనం..
అవలోకనం..

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

LEAVE A RESPONSE