తెల్లోడి అహం మీరింది హద్దు..స్వరాజ్యానికి అదే తొలిపొద్దు..

బానిసత్వాన్ని పంటి బిగువున భరిస్తూ..
జరుగుబాటు లేక
తిరుగుబాటుకు తెగించక
దుఃఖంతో మగ్గిపోతున్న
భరతజాతిని మేలుకొలిపిన
ఒక్క పొలికేక..
అది సింహగర్జన..
ఔను..ఆ స్వరం
మంగళ్ పాండేదే..!

అప్పటివరకు ఆ పులీ
పటాలమనే బడిలో
బానిసత్వ పాఠాలు
పఠించిన బంటే..
తెల్లోడి బంటురోతే..
దాస్యశృంఖలాలు
తెంచుకోవాలని అంతరాత్మ
పురిగొల్పుతున్నా..
తరుణం రాలేదో..
కిరణం తలుపు తట్టలేదో..
అగమంది అంతరంగం..
పెరుగుతున్నా
లోలోన రక్తప్రవాహవేగం..!

రానే వచ్చింది ఆ రోజు..
దొర టెంపరితనం
ఉసిగొల్పింది..
ఆవు కొవ్వు..పంది కొవ్వు
తూటా పిన్నుకు రాసి
రెచ్చగొడితే..
నోట కరిచి లాగలేని
అంతరాత్మ..
దిక్కులు పిక్కటిల్లగ
ఈస్టిండియా దద్దరిల్లగ
బకింగుహామే బెంబేలెత్తగా
భీకరంగా ఒకే అరుపు..
భరతజాతి తిరుగుబాటుకు
తొలిపిలుపు..
తెల్లోడు ఇచ్చిన అదే తూటా
తీసింది అతగాడి తాట..
దొర ప్రాణం తీసి
తానూ మరణశిక్షకు గురైనా
పాండే తెగువ..
ఆ బల్లియా వీరుడి బలిదానం..
ఒకనాటికి సంగ్రామమై..
స్వరాజ్య కాంక్ష
ప్రతి భారతీయుడి ఇంగితమై..
బ్రిటిష్ ముష్కరుల దాష్టీకానికి చరమగీతమై..
బానిసత్వం గతమై..
భరతభూమి ఒకనాటికి
సర్వస్వతంత్రమై..!

తొలి స్వాతంత్ర సమర యోధుడు మంగళ్ పాండే
తెల్ల దొరను చంపిన
ఈ పొద్దు
భరతజాతి బానిసత్వ విముక్తికి తొలిపొద్దు..
మంగళ్ పాండే జిందాబాద్..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply