సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ గురించి…

మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు త్రిపురనేని గోపిచంద్.
మానవుడు సగం జీవితం నేర్చుకోవడంతోనూ
మిగిలిన సగం తాను నేర్చుకున్నది తప్పు అని తెలుసుకోవడంతోనూ
గడుపుతున్నాడు..
త్రిపురనేని గోపీచంద్ (సెప్టెంబర్ 8, 1910 – నవంబర్ 2, 1962) సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు.
గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం, ఆస్తి, శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్నే అతన్ని ఒక జిజ్ఞాసువుగా, తత్వవేత్తగా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల.
1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది
“అసమర్థుని జీవయాత్ర”
జీవితం జీవించటం కోసమే తప్ప సిద్ధాంతాల కోసం కాదన్న ఒక ప్రాథమిక సత్యాన్ని ఈ నవల ఆవిష్కరిస్తుంది.
తెలుగు నవలా సాహిత్యంలో ఆధునిక యుగం పందొమ్మిది వందల నలబైలలో ప్రారంభమయ్యిందని విమర్శకులు నిర్ణయించారు. 1946లో వెలువడిన త్రిపురనేని గోపీచంద్‌ ‘అసమర్థుని జీవయాత్ర’తో ఈ ఆధునిక యుగం మొదలైందన్నారు. దీనికి ముందు వెలువడిన నవలల్లో సంఘ సంస్కరణ దృష్టి ప్రధానంగా కనిపించేది. మానవుల కష్టసుఖాలకు సంఘమే ప్రధాన కారణమనీ, సంఘం మారితే తప్ప వ్యక్తులు సుఖంగా జీవించలేరనీ ఆనాటి నవలాకారులు భావించేవారు. కానీ మానవుల కష్టాలకు గానీ, సుఖాలకు గానీ ఆయా వ్యక్తుల మనస్తత్వమే కారణమౌతుందని గోపీచంద్‌ ‘అసమర్థుని జీవయాత్ర’లోనూ, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లోనూ ప్రతిపాదించారు. సిగ్మండ్‌ ఫ్రాయిడ్, యూంగ్, అడ్లర్‌ మొదలైన మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన మనోవిశ్లేషణా సూత్రాల ప్రభావంతో పందొమ్మిది వందల ఇరవైలలో పాశ్చాత్య సాహిత్యంలో డి.హెచ్‌.లారెన్స్, జేమ్స్‌ జాయిస్, వర్జీనియా ఉల్ఫ్‌ మొదలైనవారు నవలలు రచించారు. ఈ తరహా మనస్తాత్విక నవలలను ‘మనోవైజ్ఞానిక నవలలు’ అన్నారు. ‘అసమర్థుని జీవయాత్ర’ను తెలుగులో వెలువడిన మొట్టమొదటి మనోవైజ్ఞానిక నవల అని చెప్పొచ్చు.
అంతరిస్తున్న జమీందారీ వ్యవస్థ, అప్పుడప్పుడే స్థిరపడుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ – ఈ రెండింటి సంఘర్షణలో ఒక అపురూపమైన సందిగ్ధ మనస్తత్వాన్ని సంతరించుకున్న సీతారామారావు ఇందులోని కథానాయకుడు.ఈ నవల తెలుగునేలలో మొలకెత్తి మానుగా ఎదిగింది. అప్పటి మన పల్లెటూళ్ళు, మానవ సంబంధాలు ఇందులో మనకి తారసపడతాయి. ఆస్తి, అంతస్థులు తమ వికృతరూపంలో మనకి సాక్షాత్కరిస్తాయి. వీటికి ఈ నవల అద్దం పట్టింది.జమీందారీ వ్యవస్థ ఎలా బీటలు వారుతుందో, మన సమాజంలో పెట్టుబడిదారీ బీజాలు ఎలా నాటుకుంటున్నాయో వివరించారు శ్రీ గోపీచంద్‌. నవల ‘కనీసం ఒక తరం జీవితాన్ని అయినా కళ్ళకు కట్టాలి’ అంటారు సాహితీవేత్తలు. ఈ నవల ఈ పని చేసిందనీ, మన జీవితాలని మనకి ఎరుక పరిచిందనీ చెప్పవచ్చు. ఈ పని చేసింది కనుకనే ఈ నవల ఇంకా నిలబడి ఉంది.
వారు వ్రాసిన “మెరుపుల మరకలు” అనే గ్రంధంలో గాంధీరామయ్య అనే ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర ఒక సజీవ పాత్ర. ఆ పాత్ర శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారిది అని. రామస్వామిచౌదరి గారు, పంతులుగారు మంచి స్నేహితులు. రెండు భిన్న ధ్రువాలు. ఒకరు కరుడుగట్టిన నాస్తిక వాది, మరి ఒకరు పూర్తి ఆస్తికులు. అయితే, ఇద్దరు గాంధేయవాదులు. రామస్వామిచౌదరి గారికి యవ్వనంలోనే భార్య గతించింది. పునర్వివాహం చేసుకోలేదు. ఒక రోజు పంతులుగారు రామస్వామిచౌదరి గారిని కలవటానికి తెనాలి వెళ్ళారు. స్నేహితులిద్దరికి గోపీచంద్ గారు భోజనం వడ్డిస్తున్నారు. ఆ సందర్భములో, పంతులు గారు “ఏమయ్యా! రామస్వామి నీవు ఉద్యమాలలో పూర్తిగా మునిగి, కుమారుడి వివాహము సంగతే మర్చిపోయావు” అని అన్నారు.
అప్పుడు, చౌదరి గారు, నిజమే పంతులు గారు, ఆ విషయము పూర్తిగా మరచిపోయాను. మీరే ఏదైనా మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చెయ్యండి అని అన్నారట. అప్పుడు.పంతులు గారు, గోపీచంద్ తో, “నీవు మద్రాస్ వెళ్ళే లోపు ఒక పది రోజుల ముందు, గుంటూరు రా..” అని అన్నారు. గోపీచంద్, సరే అంటం… అలాగే గుంటూరికి వెళ్ళటం జరిగింది.
ఆ రోజుల్లో గుంటూరులో “శారదా నికేతన్” అనే వితంతు శరణాలయం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. దాని నిర్వహణ భాద్యత అంత ఆ రోజుల్లో పంతులు గారే చూసుకునే వారు. ఆ రోజుల్లో అన్నీ బాల్యవివాహాలు కావటం చేత, వదూవరులకు వయోబేధం ఉండటం చేత అక్కడ ఉన్నవారిలో కూడా చాలామంది బాలవితంతులే! గోపీచంద్ వచ్చి పంతులు గారిని కలసి, ఎందుకు రమ్మన్నారో చెప్పమని అడిగారు. పంతులు గారు ఏ విషయము చెప్పకుండా, నీకు నచ్చిన ఒక క్లాసుకు వెళ్లి ఒక పది రోజులు పాఠాలు చెప్పమన్నారు.
ఆ వితంతు శరణాలయాన్ని పంతులుగారు నడుపుతున్న తీరు, బాలవితంతుల దీన పరిస్థితి గోపీచంద్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆయన రచనలలో కొన్నింటిలో వాటి ప్రభావం కనపడుతుంది. కాలక్రమంలో గోపీచంద్ గారి మీద వారి నాన్నగారి ప్రభావం తగ్గ నారంభించింది. స్వతంత్ర భావాలను పెంచుకున్నారు. జీవితములో పెంచి పెద్ద చేసిన నాన్నగారి కంటే పంతులుగారి ప్రభావం అతని మీద చాలావరకు ఉంది. అందుకే, గాంధీరామయ్య పాత్ర సజీవంగా నిలిచిపోయింది.
గోపీచంద్ గారు నెమ్మదిగా Marxist philosophy నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంధాన్ని వ్రాయటం జరిగింది. పోస్ట్ చెయ్యని ఉత్తరాలు, అసమర్ధుని జీవయాత్ర, మెరుపుల మరకలు.. ఈ గ్రంధాలలో కూడా చాలావరకు తాత్విక చింతన కనపడుతుంది. ఆయనే, ఒక చోట ఇలా అంటారు, “మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు”. మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది.
నిన్న మనం నమ్మింది ఈ రోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్నివదలి మళ్ళీ అన్వేషణ సాగించాలి. ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు, చలం గారు కూడా చెప్పారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ. నిరంతర సంచారి కాని వాడు, ఎంత ధనవంతుడైనప్పటికీ, నా దృష్టిలో అతను ఒక ‘బికారి’ మాత్రమే. దీనికి ఆయన జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. ఒక పుస్తకాన్ని వారి తండ్రిగారికి అంకితం ఇస్తూ- ‘ఎందుకు’ అని అడగటం నేర్పిన నాన్నగారికి అని వ్రాసారు. అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికెదిగారు.
1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాడు. 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు. 1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసాడు. తర్వాత అరవిందుని భావాలపట్ల ఆకర్షితుడై ఆధ్యాత్మికవాదం వైపుకి మళ్లాడు. 1962 నవంబర్ 2న, గోపీచంద్ మరణించాడు. భారత ప్రభుత్వము సెప్టెంబరు 8, 2011న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది.
ఆయన జీవితమే ఒక చైతన్య స్రవంతి. ఆయన లాగా, ఆలోచించటమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి!

– ఏ. శ్రీనివాసరెడ్డి

Leave a Reply