Suryaa.co.in

Andhra Pradesh Entertainment

చింతామణి నాటకం రద్దు నిర్ణయం బాధాకరం….

సుబ్బిశెట్టి పాత్రధారి ఆత్మకూరు వాసి చాంద్ భాషా గారి అభిప్రాయం

కుటుంబ జీవన వ్యవస్థ అస్తవ్యస్తంగా అవుతూ ఎందరో మహోన్నతమైన వ్యక్తుల జీవన విధానానికి పతనమవడానికి కారణమయ్యే పరాయి స్త్రీ పై వ్యామోహం పతనానికి నాంది అనే అంశంతో గొప్పగా రచించిన చింతామణి కథాంశాన్ని నాటక దృశ్య రూపం గా ప్రదర్శిస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలలో కూడా గొప్ప సందేశాత్మకంగా ప్రదర్శించబడి గొప్ప ప్రజాదరణ కలిగిన చింతామణి నాటకం ఆంధ్ర రాష్ట్రంలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధాకరం అని తెలిపారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణవాసి చింతామణి నాటకంలో 130 సార్లకు పైగా సుబ్బిశెట్టి పాత్ర పోషించిన చాంద్ భాషా .. రచయిత రచించిన మూల కథాంశంలో ఎక్కడ వ్యంగ్యంగా అర్ధాలు వచ్చే పదాలు లేవని కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించే సమయంలో అక్కడి ప్రజల శైలిని బట్టి కొన్ని చోట్ల అత్యుత్సాహంతో పాత్రధారులు చెప్పే మాటలు హావభావాలను బట్టి సుబ్బిశెట్టి అనే పాత్ర అలా కనిపించి ఉండవచ్చు అని ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ నాటకరంగంపై ఆసక్తితో తాను ఆత్మకూరు చెందిన శ్రీరామ నాట్యమండలి ఆధ్వర్యంలో 130 సార్లు సుబ్బిశెట్టి పాత్ర ను పోషించిన ఎప్పుడు ఏ రోజు ఎక్కడ కూడా ఏ ఒక్క పదం దంద్వ అర్ధాలు వచ్చేలా నటించలేదని వారు తెలిపారు.

ఆ నాటకంలో ఏడు ఎనిమిది పాత్రలు ఉన్నాకూడా ప్రజలు హాస్యం వచ్చే విధంగా సుబ్బిశెట్టి పాత్రధారి మాటలు ఉన్నందున ఆ పాత్రను ప్రజలు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా వీక్షించారని గౌరవప్రదంగా తమ నటనను ప్రజలు స్వీకరించారు అని తెలిపారు. ప్రతి నాటకంలో కూడా ఒకటి రెండు పాత్రలు ఇటువంటి హాస్యం పండించే ధోరణిలో నాటకాలు ఉంటాయని ఏ ఒక్క కులాన్ని గాని వర్గానికి కానీ నాటకాల్లో తక్కువ చేసి చూపించేలా నాటకాన్ని రచించరని, నటించరని తెలిపారు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ నాటక ప్రదర్శన పై అభ్యంతరం వ్యక్తం చేయలేదని అన్నారు…అభ్యంతరము ఉన్న సన్నివేశాలపై చర్చించి వాటిని తొలగించమని సూచిస్తే బాగుండేదని పూర్తి నాటకం నే రద్దు పరచడం బాధాకరమని ఆయన తెలిపారు… పాత్రలపై అభ్యంతరం వ్యక్తపరుస్తూ మొదలుపెడితే అన్ని నాటకాలతో పాటు సినిమాలు, సీరియల్ లు ఏవి కూడా ప్రదర్శనకు నోచుకోలేవని చాంద్ భాషా తెలిపారు..తాము పోషించే ప్రతి ఒక్క పాత్ర తనకు దైవంతో సమానం అని అన్నారు.. కళాకారులలో వారి నటనను ఆస్వాదించాలి కానీ కులాలతో పోల్చుతూ పూర్తి నాటకం నే తప్పు పట్టడం రద్దు పరచడం సరి కాదని మరోసారి దీనిపై పునరాలోచించుకుంటే నాటక రంగానికి శ్రేయస్కరమని సూచించారు…నాటక రంగంపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి అని అటువంటి వారికి పొట్ట కొట్టే విధంగా ఈ నిర్ణయం ఉందని దీనిపై మరోసారి ప్రభుత్వం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE