Suryaa.co.in

Entertainment

ఆయన కళా’రే’డు..

(నేడు సత్యజిత్ రే వర్ధంతి (23.04.1992)సందర్భంగా నివాళి అర్పిస్తూ..)

*ఆయన..*
భారతీయ సినిమాకి
శాశ్వత చిరునామా..
*ఆయన..*
డ్రస్సు..అడ్రస్సు..యశస్సు..
అన్నీ సినిమానే..
ఆ సినిమా ఆయనకి హనీమూనే..
ఆయన సినిమా ప్రేక్షకుడికి
ఫుల్ మూనే..
ఆ సినిమాకి ఆయన హీమానే..!

*సత్యజిత్ రే..*
మొత్తం సినిమా ఆయన
మస్తిష్కంలోనే ఆవిష్కారం
అవుతుంది..
ఆ బుర్రలో సినిమా కొత్త అర్థాలను వెతుక్కుంటుంది..
అవార్డులను రప్పించుకుంటుంది..
మామూలు దర్శకులు
తీస్తే అది సినిమా
ఈ రే తీస్తే
అప్పుడది కళాఖండం..
సున్నితమైన సామాజిక అంశాలకు రే సినిమాలు
ఎక్స్ రేలు…!

సృజనాత్మకత రే
ఇంటిపేరు..
కళాత్మకత ఆయన
సినిమాల తీరు..
వాస్తవికత..ఆయనను శిఖరాగ్రానికి చేర్చిన తేరు..
వీటన్నిటి కలబోతగా
సత్యజిత్ తీసిన ప్రతి సినిమా సజీవంగా
ప్రవహించే సెలయేరు…!

సినిమాపై ఆసక్తి లేని
మనిషి..
మరి ఆయన చేతిలో సినిమాకి ఎన్ని నగిషీలో..
ప్రతి సినిమా ఒక శిల్పి చేతిలో శిల్పంలా..
అవార్డులు ఆయనకు
హంసతూలికా తల్పంలా..
రవీంద్రుని శాంతినికేతనంలో
ప్రాచ్యకళలు
ఆయన మెలకువలు..
అజంతా ఎల్లోరా అందాలు
ఆయన కథల్లో కువకువలు..
కథ..కళ..రచన..వచన..
సినిమాలోని ప్రతి విభాగం..
సత్యజిత్ చేతిలో పడితే
దానికో వైభోగం..
భారతీయ సినిమాను ఆయన చేశాడు బాపు’రే’…
ఆయన్ను చేరి పులకించింది
అంతటి ఆస్కా’రే’..
భారతరత్న సైతం
సత్యజిత్ రే ఇంట
హిప్ హిప్ హు’రే’..
సత్యజిత్ రే సినిమా అంటే
ఓ పరంప’రే’..
అందుకే ప్రపంచం
ఆ దర్శక దిగ్గజం
పేరు చెబితేనే
శిరసు వంచి
అంటుంది భళా’రే’..!

పథేర్ పాంచాలి..
తొలి చిత్రమే హుర్రే..
ఆయన ఒకనాడు సినిమాకి అగంతక్..
ఎప్పటికీ అపరాజితో..
భారతీయ సినిమా
కాపురుష్ వో మహారుష్..
ఈ దర్శక మహారుష్..!

*ఎలిశెట్టి సురేష్ కుమార్*
9948546286

LEAVE A RESPONSE