ఇక్కడా ఎనభై…. ఇరవైయ్యే!

ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కొత్త సూత్రీకరణను బహుళ ప్రచారం లోకి తీసుకువచ్చారు. అదే -80:20. అంటే తన పాలనను 80 మంది అమోదిస్తుంటే ;ఇరవై మంది వ్యతిరేకస్తున్నారు అనేది ఈ సూత్రీకరణ. ఇది ఎలక్షన్ కమిషన్ వారి కోసం బీజేపీ ఇచ్చిన వివరణ. తప్పుబట్టడం కుదరదు. కానీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సూత్రికరణ లోని అసలు అంతరార్ధం వేరు. ఇది ఉత్తరప్రదేశ్ ఓటర్లకు అర్ధం అయింది.

యూపీ ఓటర్లలో 80 శాతం మంది హిందువులు అయితే ; 20 శాతం మంది ముస్లిం లు అని ఆయన ఉవాచ లోని అంతరార్ధం. ఈ సూత్రీకరణ బాగా పాపులర్ అయింది. విభజన రాజకీయం సూపర్ హిట్ అయింది.బీజేపీ మళ్ళీ అధికారం లోకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే 80:20 పరిస్థితే కనిపిస్తున్నట్టుగా ఉంది.

అయితే – ఇక్కడ ‘విభజన’ అనేది మత పరమైనది కాదు. కులపరమైనది అని కూడా అనిపించడం లేదు.
జగన్ అనుకూల…., వ్యతిరేక శక్తులే ఇలా 80:20 నిష్పత్తి లో విడిపోయి ఉన్నారా అనిపిస్తున్నది.
కొందరు సీనియర్ జర్నలిస్ట్స్ వ్యక్తం చేస్తున్న ఈ తరహా అభిప్రాయం కొందరికి చాలా ఆశ్చర్యం కలిగిస్తే…, కలిగించవచ్చు. ఎందుకంటె, జగన్ ప్రభుత్వం పై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ – రేపే ఎన్నికలు అన్నంత హడావుడి పడి పోతున్నది.దాని నేతలు భీకరంగా విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వానికి రోజువారీ సవాళ్లు విసురుతున్నారు. చంద్రబాబు నాయుడు ‘డైలీ మీడియా’ కార్యక్రమం అనంతంగా సాగిపోతున్నది. బైడెన్, మోడీ వంటి ఇతర జాతీయ నేతల వెనుక వారి వారి జాతీయ పతాకాలు ఉన్నట్టుగా …. పేద్ద పేద్ద టీడీపీ పతాకాలు ఈ మీడియా సమావేశాల్లో దర్శనమిస్తూ…. అయన మైండ్ సెట్ కి అద్దం పడుతున్నాయి. ఇతార చిల్లర మల్లర నేతలు కూడా ఇదే బిల్డ్ అప్ లో ఊగిపోతున్నారు.జగన్ అనుకూలంగా మినహా మిగిలిన మీడియా లో కూడా వీటికి గట్టి ప్రచారం లభిస్తున్నది.

(యాంటీ) సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వ చర్యలను చింపి పోగులు పెడుతున్నారు. ప్రజలలో కూడా తీవ్ర విమర్శలు వె లువడుతున్నాయి. ఏ నలుగురు కలిసినా ; జగన్ ప్రభుత్వానికి శాపనార్ధాలు పెడుతున్నారు. వీటిని కౌంటర్ చేయడానికి జగన్ గానీ ; ఆయన తరఫున అధికార సిలువ భారాన్ని మోస్తున్నట్టుగా కనిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గానీ ; ప్రభుత్వ సమాచార శాఖ గానీ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించదు.

శాసనసభ ఎన్నికలకి ఇంకా రెండేళ్ల సమయం ఉ న్నపుడే…. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం,పరిస్థితి ఇలా కనపడుతుంటే ; మరో రెండేళ్ల తరువాత జగన్ ప్రభుత్వ పరిస్థితి ఏమిటీ అంటూ అమితాశ్చర్యం లో మునిగిపోయేవారు కూడా లేకపోలేదు.

బల్బు వెలగడానికి అవసరమైన స్విచ్ బలుబు దగ్గర ఉండదు. చమటలు పట్టేటట్టు దానిని ఎంత పిసికినా…. బల్బ్ వెలగదు. దాని స్విచ్ ఎక్కడో ఒక మూలన…, గదిలో ఉంటుంది. అది ఎక్కడో కనిపెట్టి ఒక నొక్కు నొక్కితే గదిలో లైట్ వెలుగుతుంది. అలా తెలుగుదేశం పార్టీ, దాని నేతలూ బల్బ్ ను పట్టుకుని వీర పిసుకుడు పిసుకుతున్నారు. అందుకే,వారిని పట్టించుకుంటున్నట్టు లేరు అనిపిస్తున్నది.

దీనితో పాటు ; 80::20 ఫార్ములా కూడా ఆంధ్ర లో సైలెంట్ గా పనిచేస్తుందనే భావన కలుగుతున్నది.
రాష్ట్ర జనాభాలో దాదాపు 70, 80 శాతం జనాభా కి – ఏదో ఒక పేరుతో – డబ్బులు ప్రభుత్వం నుంచి నేరుగా అందుతున్నాయి.సంక్షేమ పధకాలు రాష్ట్రం లో కొత్త ఏమీ కాకపోయినా ; ఈ తరహా లో డబ్బులే నేరుగా అందే అనుభవం మాత్రం ఇదే మొదటి సారి.

ఈ ‘సంక్షేమ’ నగదు అందని వారు, తెల్ల కార్డు పరిధిలోకి రానివారు, వైట్ కాలర్ జనాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు…. వగైరా వగైరాలు – రాష్ట్ర జనాభాలో ఓ ఇరవై శాతానికి మించి ఉండే అవకాశం లేదు.
రాష్ట్ర జనాభా ఓ అయిదు కోట్ల మంది అనుకుంటే ; మీడియా ను ఫాలో అయ్యేవారు, ప్రభుత్వాన్ని విమర్శించేవారు, సొంతంగా ఆలోచిస్తూ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగలిగిన వారు, రోడ్ల మీదకు వచ్చి… ప్రభుత్వ తప్పొప్పులను విశ్లేషించ గలిగిన వారు – ఇలా అన్ని కేటగిరీ లో కలుపుకున్నా ; వారి సంఖ్య ఒక కోటి దాటదనే అంచనాలు ఉన్నాయి. అంటే -జనాభాలో ఇరవై శాతం.

ఇక మిగిలిన 80 శాతానికి రాజకీయాలు పట్టవు. ప్రభుత్వ మంచి చెడులు పట్టవు. పేపర్లు చదవరు. వార్తలు పట్టవు. టీవీ లు చూసినా…. వాటిల్లో వచ్చే సినిమాలో…, లేక డైలీ సీరియళ్ళో చూస్తారు. నిద్ర లేవడం, వారి దైనం దిన వ్యాపకాలలో మునిగి పోవడమే తప్ప ;మరో వ్యాపకం పట్టని వారు ఈ 80 శాతం లో ఉన్నారనేది విశ్లేషకుల అంచనా. వీరి ఖాతాల్లోనే జగన్ ప్రభుత్వం -క్రమం తప్పకుండా నగదు వేస్తున్నది. వీరి ఖాతాల్లో వేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి ఎలా వస్తున్నాయి అనే అంశంతో సంబంధం లేకుండా -వీరి ఖాతాల్లో నగదు జమ అవుతూనే ఉంటుంది.

వీరికి- జగన్ దేవుడితో సమానం. ఏ పరిస్థితుల్లో అయినా జగన్ గనుక ముఖ్యమంత్రి గా లేక పోతే ; తమ బ్యాంకు ఖాతాలు ఎండిపోతాయానేది ఒక్కటే వారికి తెలిసిన అంశం. బ్యాంకు ఖాతాలు బోసిపోతే ; నాలుకలు పిడచకట్టుకు పోతాయి. మొహాలు కళా విహీనం అయిపోతాయి. చేతిలో కొనుగోలు శక్తి అడగంటి పోతుంది. అందువల్ల ; జగన్ ఉండాలి అనే భావనే వీరిది. వీరిలో అత్యధికులు – 80 శాతం లోకి వస్తారు. అందుకే, జగన్ ఆ పదవి లో ఉన్నంత కాలం -ఆంధ్ర ఓటర్లు 80:20 నిష్పత్తి లో చీలిపోయారు అనేది కొందరి పరిశీలకుల మాట.దీనిని తెలుగుదేశం నేతలు పరిగణన లోకి తీసుకున్నారో… లేదో తెలియదు.

– భోగాది వేంకట రాయుడు

Leave a Reply