ఆనాడు నిరుద్యోగి-నేడు పోడు రైతు

  • తెలంగాణలో బతకలేక బలిదానాలు
  • బలిదానాలు వద్దు బరిగీసి కొట్లాడాలి
  • ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి

ఎన్నో ప్రాణ త్యాగాల ఫలంగా సాధించుకున్న తెలంగాణలో పోడు భూములను గుంజుకోవడం చాలా దుర్మార్గం. సీమాంధ్ర పాలకుల హయాంలోనే అన్నల అండతో తెలంగాణలో భూమి లేని వేల మంది భూములు సాధించుకొని సాగు చేసుకుంటున్నారు. తెలంగాణ వస్తే ఆ భూములకు పట్టాలు వస్తాయని సంబర పడ్డారు. కాని కథ మరోలా మారింది. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు ఉద్యమ సారధి అని నమ్మి కెసిఆర్ కు పట్టం కడితే పేదల గోషి గుంజుకుంటున్నాడు. నిత్యం అటవీ ప్రాంత పల్లెల్లో ఈ భూముల అలజడితో, ఫారెస్ట్ సిబ్బందితో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. భూములు కాపాడుకోవడానికి చాలా ప్రాంతాల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నప్పటికి పోలీసుల సహాయంతో భూములు లాక్కుంటున్నారు. గుంట భూమిలేక ఏ ఆసారా లేక జీవించే ప్రజలకు పోడు భూములు పెద్ద ఆసరాగా మారినాయి. అలాంటి భూములను లాక్కుంటే బతికేదెట్లా అని మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన జింక శ్రీశైలం పురుగు మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసాడు.

ఈ సందర్భంలో ఒకసారి తెలంగాణలో పోడు భూముల చరిత్ర తెలుసుకోవాలి. అటవీ ప్రాంతాల్లోని ప్రజలు సరైన సాగు భూమి లేక ఎక్కువగా అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించేవారు. గత 40 ఏండ్ల క్రితం పేద ప్రజల విముక్తి కోసం అటవీ ప్రాంతాల్లోకి అడుగు పెట్టిన నక్సలైట్లు సాగు భూమి లేని ప్రజలను గుర్తించి అడవిని నరికి కనీస సాగు భూమి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అన్నల పిలువునందుకున్న పేద ప్రజలు అటవీ ప్రాంతాల్లో పోడు కొట్టి ఎన్నో కష్టాలకోర్చి భూములను సాగు చేసుకున్నారు. పేద ప్రజలకు అన్నల అండ ఉండడంతో ఆనాటి సీమాంధ్ర పాలకులు పేద ప్రజల భూముల జోలికి రాలేదు. తుది దశ తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుండి అన్నల అండతో పాటు తెలంగాణ ఉద్యమ అండ కూడా పోడు రైతులకు దొరికింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న తరుణంలో ఆనాటి ఉద్యమ నాయకత్వం కూడ తెలంగాణ వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించారు.

అప్పటికే మా ఊళ్ళో మా రాజ్యం అంటూ ఉద్యమాలు కొనసాగిస్తున్న ఆదివాసి ప్రాంత ప్రజలు కూడ బహిరంగ సభలు పెట్టి తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికారు. అలా సాధించుకున్న తెలంగాణలో సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందని ఆశ పడ్డారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు తలచింది ఒకటైతే జరిగేది మరొకటైంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక సీమాంధ్ర పాలనలో సాధించుకున్న భూములను గుంజుకోవడం జరుగుతుంది. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుందని ప్రతి పల్లెలో ప్రజలు మధనపడుతున్నారు. ఆనాటి ఉద్యమాల వల్ల ఆనాటి ఆంధ్రోళ్లు, ఫారెస్ట్ అధికారులు గ్రామాల్లోకి వచ్చి పోడు భూములను ముట్టుకోవాలంటే భయపడేవారు. అదే తెలంగాణ సిద్ధించాక తెలంగాణ పాలకులకు భయం లేకుండా పోయింది. తెలంగాణ పాలకులకు భయం లేకుండా పోవడానికి కారణాలు రెండు. మొదటిది ఆనాటి ప్రశ్నించే నక్సలైట్లు నేడు లేకపోవడం. రెండవది ప్రతిపక్షాల నాయకులను గంప గుత్తగా కెసిఆర్ కొనడం వల్ల ఎదురు, బెదురు లేని పాలన కొనసాగడం వల్ల కూడా పేదల భూములు గుంజుకుంటున్నారు. ఎదురు తిరిగిన రైతులపై దాడులు చేయడమే కాకుండ, కేసులు కూడా పెడుతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనను ఎదుర్కొనలేకనే పోడు రైతులు ఆత్మహత్యల బాట పట్టారు.

సీమాంధ్ర పాలనలో రైతుల, చేనేతల, నిరుద్యోగుల వలసలు, ఆత్మహత్యలు, రాజ్య హింస, బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగానే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేసి 12 వందల మంది ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఏమి మారకపోగా మరింత ఎక్కువ నష్టం జరుగుతుంది. రైతుల ఆత్మహత్యలు గతం కన్నా ఎక్కువయ్యాయి. చేనేతల వలసలు, ఆత్మహత్యలు ఆగలేదు. బొంబాయి, దుబాయి పోయిన వాళ్ళు తిరిగి రాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రాష్ట్రం వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని, నా బలిదానంతోనైన తెలంగాణ వస్తే నా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని శ్రీకాంతాచారి లాంటి 12 వందల మంది బలిదానాలు చేసుకున్నారు. అయినా మారిందేమి లేదు. నేటికి నిరాశ నిస్పృహలకు గురైన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆనాడు నా చావు ద్వారా తెలంగాణ రావాలని యువత బలిదానాలు చేసుకుంటే నేటి యువత వారి బలిదానాలతో ఉద్యోగాలు రావాలని ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. దీనికి మొదటి సాక్ష్యం బోడ సునిల్ ఆత్మ బలిదానం. తన చావుతోనైన తెలంగాణలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని పురుగుల మందు తాగి చనిపోవడం చాలా బాధాకరం. నేటి పోడు రైతు ఆత్మ హత్యాయత్నం కూడా ఆనాటి బోడ సునిల్ లాంటిదే. బోడ సునిల్ ఆత్మబలిధానం తో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం లేస్తుందని అనుకున్నారు. ఉద్యమకారులు బోడ సునిల్ గ్రామానికి వెళ్లి ఉద్యమం చేశారు. ఉద్యమాన్ని అణచివేయడం కోసం తెలంగాణ పాలకులు పోలీసు బలగాలను దించి, బోడ సునిల్ సామాజిక వర్గానికి చెందిన నాయకులతోనే బోడ సునిల్ కుటుంబానికి నచ్చజెప్పి, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగ కల్పిస్తామని ఆశ చూపి నిరుద్యోగ ఉద్యమాన్ని కెసిఆర్ ప్రభుత్వం నీరుగార్చింది. బోడ సునిల్ బలిదానం తర్వాత వచ్చిన ఉద్యమం కొనసాగక పోవడానికి కారణం ఒకటి ప్రతిపక్ష పార్టీలను కెసిఆర్ కొనడంతో పాటు ప్రగతిశీల ఉద్యమాలకు నాయకత్వం వహించే పటిష్ట ఉద్యమ నాయకత్వాన్ని లేకుండా చేయడం. ఇలాంటి దుర్మార్గ పాలనపట్ల సిగ్గుపడాల్సిన టిఆర్ఎస్ అందుకు భిన్నంగా బంగారు తెలంగాణ అని ప్రగల్భాలు పలుకుతూ దోపిడి పాలన కొనసాగిస్తున్నారు.

ఉద్యమ కాలంలో చెప్పుకున్న ఏ విషయం నెరవేరక పోగా మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడమే కాకుండా విద్య, వైద్య దోపిడి వల్ల రాష్ట్ర ప్రజలు అప్పుల పాలవుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఎన్నికల చుట్టూ తిప్పినట్లుగానే రాష్ట్రం సాధించాక తెలంగాణ ప్రజలను ఎన్నికల చుట్టూ తిప్పుతూ పబ్బం గడుపుతున్న టిఆర్ఎస్ పార్టీ ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉద్యమ కాలంలో, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన వాగ్ధానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే ప్రణాళికలు సిద్ధం చేయాలి. మౌలిక రంగాలైన విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ ప్రాధాన్యతను పెంచాలి. ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. వివిధ శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ బలిదానాలను, వలసలను ఆపాలి. నిజాం పాలన కాలం నుండి ఉన్న భూమి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలి. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు జరిగినాయి. నీల్5, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన నినాదాలతో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. మా భూములు, మా నీళ్లు, మా వనరులు మాకు కావాలని ఎన్నో త్యాగపూరిత పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో నేటికి నిరుద్యోగ సమస్య, భూమి సమస్య అలాగే ఉంది. పోడు భూములకు పట్టాలిచ్చి భూమి సమస్యకు పరిష్కారం చూపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు బిన్నంగా ప్రవర్తిస్తూ పోడు రైతులపై దాడులు చేసి ప్రజలను తిరిగి భూమి లేని వారుగా చేసే కుట్ర జరుగుతుంది. ఇప్పటికైనా వాస్తవ స్థితిగగులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజల సమస్యలను పరిష్కారం చేయనట్లయితే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదు. టిఆర్ఎస్ దోపిడి పాలన అంతం కోసం ప్రజలు ఏకం కావాల్సిన అవసరముంది. మరో పోరాటం వైపు ప్రజలను మరల్చకుంటే నిరాశ, నిస్పృహలతో మరిన్ని ఆత్మహత్యలు పెరిగే ప్రమాదముంది. అందుకోసం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన మేధావులు, కవులు, కళాకారులు, విద్యావంతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యమకారులు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరముంది.

– సాయిని నరేందర్
సామాజిక విశ్లేషకులు
9701916091

Leave a Reply