రాష్ట్రం లోని వైసీపీ ప్రభుత్వం మళ్ళీ “మూడు రాజధానుల” కాన్సెప్ట్ ను తవ్వి తలకెత్తుకున్నది. కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మంత్రులు, “మూడు రాజధానులు” మా ప్రభుత్వ విధానం అంటున్నారు. విశాఖపట్నం నుంచి త్వరలోనే ఎగ్జీక్యూటివ్ కాపిటల్ ప్రారంభం అవుతుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ ప్రకటించారు.
విశాఖపట్నం కు ఎగ్జిక్యూటివ్ కాపిటల్ తరలించడం కంటే…. లెజిస్లేటివ్ క్యాపిటల్ తరలించడం…. కారు చౌక, చిటికెలో పని. విశాఖలో ఒక క్యాపిటల్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది. బహుశా ఎవరికీ ఇబ్బంది కూడా ఉండదు.
వైసీపీ ప్రభుత్వం అధికారం లో ఉన్నంత కాలమూ ఏడాదికి అటు ఇటుగా పాతిక రోజులే శాసన సభ / మండలి సమావేశాలు ఉంటాయి గనుక మన శాసన/ మండలి సభ్యులు సరదాగా విహార యాత్రకు వెళ్లి వచ్చినట్టు వెళ్లి వస్తారు.
అదే ఎగ్జి క్యూటివ్ క్యాపిటల్ అంటే…. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్, గవర్నర్ రాజభవన్, డీజీపీ ఆఫీస్, వెలగపూడి లోని సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు తరలి వెళ్ళాలి. వందల, వేల కోట్లు ఖర్చు. ఉద్యోగులకు డిస్ లొకేషన్. మళ్ళీ వాళ్లకు ఇళ్ళు చూడాలి. ఇదంతా నెలకో…., రెండు నెల్లకో అయ్యేపని కాదు. ఈ లోపు ఎన్నికల హడావుడి మొదలవుతుంది.
అందువల్ల, సచివాలయం, సీ ఎం క్యాంపు కార్యాలయం, రాజ్ భవన్, డీజీపీ ఆఫీస్, శాఖాధిపతుల కార్యాలయాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంచేసి, శాసనసభ భవనాన్ని విశాఖపట్నం తరలిస్తే చాలా సులువుగా పని జరిగిపోతుంది.
ఇక, న్యాయ రాజధాని ని కర్నూలు కు మార్చడానికి ఒక ప్రొసీజర్ ఉన్నది కనుక, దానిని ఫాలో అవ్వవచ్చు. సీ ఎం, హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి సమావేశమై, హై కోర్టు ను కర్నూల్ కు తరలించాలని కోరుతూ ఒక ఏకగ్రీవాభిప్రాయాన్ని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కి నివేదించాలి. భారత ప్రధాన న్యాయ మూర్తి ఆ విజ్ఞాపన ను పరిశీలించి ; సహేతుకం గా ఉన్నదని భావించాక, ఆ సిఫారసు ను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపుతారు. ఆ శాఖకూడా దానిని పరిశీలించి… రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. అప్పుడు, రాష్ట్ర హై కోర్టు ను అమరావతి నుంచి కర్నూలు కు తరలింపు ప్రత్తిపాదనకు ఆమోదం తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేస్తారు.
అదే, ‘శాసన రాజధాని’ ని వెలగపూడి నుంచి విశాఖపట్నం తరలించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పని. అప్పుడూ రెండు రాజధానులు ఏర్పాటు చేసిన ‘ఘనత’ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇక, మూడవ రాజధాని కర్నూలు లో ఏర్పాటు అనేది ఒక్కటే పెండింగ్ లో ఉంటుంది. దాని విషయం తాపీగా ఆలోచించవచ్చు. అందులో రాష్ట్రపతి…. కేంద్ర న్యాయ శాఖ, సుప్రీం కోర్ట్…. హై కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి… ప్రమేయం ఉండడం వల్ల ; పనులు వేగంగా జరగవు కదా!

@venkata _rayudu