Suryaa.co.in

Entertainment

అప్పట్లో సినిమా పబ్లిసిటీ…

ఆ రోజుల్లో కొత్త సినిమాల పబ్లిసిటీ ఇప్పటిలా కాకుండా చాలా భిన్నంగా ఉండేది. ఇది 50, 60, 70 దశకాల నాటి మాట. కొత్త సినిమా విడుదలైనప్పుడు.. ఓ జట్కాకో లేదా ఓ రిక్షాకో రెండు వైపులా బోర్డులు (అట్టలు) అమర్చి ఆ సినిమా పోస్టర్లు అతికించేవారు‌. ఆ బండి ముందుకి ఓ లౌడ్ స్పీకర్ అమర్చేవారు. వీధుల్లో తిప్పుతూ ఆ సినిమా బండిలో ఓ వ్యక్తి కూర్చుని ఓ మైకు పట్టుకుని ఆ సినిమా వివరాలు అనౌన్స్ చేసేవాడు.. మధ్యమధ్యలో ఆ సినిమాలో పాటలను గ్రామోఫోన్ రికార్డులు పెడుతూ… నేడే చూడండి.. తప్పక చూడండి మీ అభిమాన థియేటర్ జ్యోతి సినిమాలో.. అంటూ ఆ సినిమా పేరు, నటీనటులు, విశేషాలు చెబుతుండేవాడు. ఆ సినిమా పేపర్లు (పాంప్లెట్స్) కూడా పంచేవారు‌.

ఈ సినిమా బండి రాగానే వీధి పిల్లలు వెనుక పరుగెత్తేవారు ఆ పేపర్ల కోసం. అఫ్ కోర్స్ నేను కూడా.. ఇంకా పెద్ద పండుగల సందర్భంగా పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు మరింత అట్టహాసంగా ఉండేది. విడుదల ముందురోజు సాయంత్రం 06 నుంచి రాత్రి 12 వరకూ పబ్లిసిటీ భారీగా ఉండేది. ముందు ఆ సినిమా పెద్ద పోస్టర్ ఉన్న బొర్డ్ ను చెరువైపులా ఇద్దరు పట్టుకునేవారు. వెనుక సినిమా బండీలో బ్యాండ్ పార్టీ ఉండేది. ఆ వెనుక మరో ఒకటో రెండో సినిమా బండీలు ఉండేవి. ఒక దాంట్లో నటీనటుల కటౌట్లు మరో బాండీలో మైక్ అనౌన్స్ మెంట్ లు ఉండేవి. బ్యాండ్ వాద్యాల హోరు, అనౌన్స్ మెంట్ హోరు జోరుగా ఉండేవి. ఒక్కోసారి బాణాసంచా పేలుళ్ళు కూడా ఉంటుండేవి.

టీవీలు లేని ఆరోజుల్లో రాత్రి 9 గంటలకే పడుకోబోయే వాళ్ళం. ఈ హోరుకి లేచిపోయి వీధి గుమ్మాలోకి వెళ్ళేవాళ్ళం చూడటానికి‌. సినిమా పాంఫ్లెట్స్ ఇంటింటికీ పంచేవారు. ఇంతజోరుగా ఉండేది సినిమా పబ్లిసిటీ అప్పుడు‌‌. ఐతే 1980లలో టీవీలు వచ్చాక ఈ తరహా ప్రచారం బాగా తగ్గిపోయింది. నాకు జ్జానం వచ్చేక సుమారు ఓ పది పన్నెండు సంవత్సరాలు ఈ విధమైన పబ్లిసిటీని ఎంజాయ్ చేసేం. మరువలేని జ్ఞాపకాలలో ఈవిధమైన సినిమా ప్రచారం ఒకటి..

గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని),
ధర్మపురి రోడ్ విజయనగరం
ఫోన్ 9985561852

LEAVE A RESPONSE