Home » మలినమవ్వడం ఎరుగని నది సీతారామశాస్త్రి కవిత్వం

మలినమవ్వడం ఎరుగని నది సీతారామశాస్త్రి కవిత్వం

మలినమవ్వడం ఎరుగని నది సీతారామశాస్త్రి కవిత్వం

గంగా, యమున నదులు కనిపిస్తాయి కానీ సరస్వతీ నది కనపడదంటారు. ఎందుకు కనపడదంటే నది రూపంలో కాకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి రూపంలో మన మధ్యనుంచి పారింది. ఆయననే సరస్వతీనది అని ఎందుకనాలి? ఆ స్థాయి కవులు ఇక ఎవ్వరూ లేరా? సినిమా రంగంలో ఏమో గానీ బయటుండరా?అని ప్రశ్నలు వేసుకోవచ్చు. ఉండొచ్చు. కానీ ఎటువంటి బురదని అంటించుకోకుండా, ఏ కాలుష్యానికీ గురి కాకుండా, బురదలోంచి పారుతున్నా కూడా వీలైతే బురదని స్వచ్ఛంగా మార్చడం తప్ప మలినమవ్వడం ఎరుగని నది సీతారామశాస్త్రి కవిత్వం. అందుకే ఆయనకు మాత్రమే ఈ పోలిక వర్తిస్తుంది.
సమాస భూయిష్టమైన తత్సమాలతో గంభీరమైన పాటల నుంచి, “పచ్చిదనం” ధ్వనించే ఊర పాట వరకు దేన్నైనా సమర్ధవంతంగా రాసి మెప్పించగల సవ్యసాచిలాంటి వేటూరి ప్రభంజనం కొనసాగుతున్న రోజుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆయనతో పోటీ పెట్టుకోకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఏకంగా 35 సంవత్సరాలు అగ్రస్థానంలో కొనసాగడమంటే మాటలు కాదు. వెతికినా బూతు కనపడని పాటలాయనవి.
ఐటం సాంగ్ రాసినా కూడా చక్కని సాహితీ విలువలతో కూడిన కవిత్వం రాయడం సిరివెన్నెలకే చెలింది.
“అంతం” సినిమాలో సిల్క్ స్మిత పాటొకటుంటుంది. “ఎంత సేపైన ఎదురు చూపేన నా గతి” అని సాగే ఆ పాటని చూస్తే తప్ప అది ఐటం సాంగని తెలియదు.
అలాగే మహర్షిలో “సాహసం నా పథం..” అనే పాట ఈవ్ టీజింగ్ సాంగ్ అని చూస్తే తప్ప తెలియదు.
ఆయనకి ఏ అంశమిచ్చినా సభ్యతని, సంస్కారాన్ని, సాహిత్య విలువలని పెనవేసి రాసారు తప్ప పొట్టకూటి కోసం కలం పట్టు వదులుకోలేదు.
“ఆయనతో పాట రాయించుకోవడం చాలా కష్టమండీ. దర్శకుడు రాత్రంతా ఆయనతో కూర్చోవాలి.లేకపోతే ఎన్ని నెలలైనా తెవలదు” అని సినిమా రంగంలో ఒక అభిప్రాయం చెలామణీలో ఉండేది.కేవలం ఆ టాక్ మూలాన ఆయన కాలంలో ఇతర కవులు వెలుగులోకొచ్చారు తప్ప నిజంగా యావత్ తెలుగు సినీ ప్రపంచాన్ని కవిత్వం, వ్యక్తిత్వం, ఋషిత్వం అనే మూడు అడుగులతో ఆక్రమించేయగల వామనమూర్తి సీతారామశాస్త్రి. ఆయనలో అంతటి ప్రతిభ ఉంది.
పాటని అప్పటికప్పుడు వమనం చేసినట్టు కాకుండా శ్రద్ధగా ప్రసవించడం ఆయన ఎంచుకున్న మార్గం. ఈ శ్రద్ధకి ఓపికపట్టలేని వాళ్లు ఇతర కవుల వద్దకు వెళ్లేవారు. అలా కొత్త కవులకి ఉదరపోషణ అయ్యేది.
ఏ తరమైనా ఒకే రంగంలో ఉన్న ఇద్దరికి వైరమో, పోటీనో ఉంటుంది. కానీ శాస్త్రిగారితో ఎవరికీ పేచీల్లేవు. అందరికీ ఆయన గురుతుల్యుడే. అందరికీ మిత్రుడే.
అప్పుడెప్పుడో త్రివిక్రం శ్రీనివాస్ ఈయన గురించి చెబుతూ, ఇరుకు సందుల్లో ఖరీదైన ఇంపోర్టెడ్ కార్ నడపడం ఎంత కష్టమో సినిమాల్లో నియమాలు పెట్టుకుని పని చెయ్యడం కూడా అంతేనని చెప్పారు. ఇక్కడ వ్యాపార విలువలు తప్ప సాహిత్యపు విలువలు ఉండవనేది ఒక వాదాన. అటువంటి నిర్మాతలకి, దర్శకులకి ఎదురెళ్లి పాటంటే తాను రాసిందే అని చెప్పి ఒప్పించగల నేర్పరితనం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సొంతం. అదే ఆయన్ని ఆ స్థాయికి పెంచింది.
నిజానికి ఆధునిక కవిత్వం బతికున్నది, ప్రాచుర్యం పొందుతున్నది సినిమా పాట రూపంలోనే. శాస్త్రిగారి పాటల్లోని “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి”, “నిశావిలాసమెంత సేపురా- ఉషోదయాన్ని ఎవ్వడాపురా” వంటి ఉత్తేజభరితమైన పంక్తులకి కాలం చెల్లడమనేది జరగదు. అవి నిత్య సత్యాలు. అటువంటివి ఎన్నో సృజించారాయన.
ఆయన కొన్ని వ్యసనాలకి దూరంగా ఉండుంటే వారిలోని సంగీతసరస్వతి ఇంకొన్నాళ్లు మనల్ని అలరించి ఉండేది. ఏళ్ల తరబడి చేసిన ధూమపానం ఆయన ఆయుష్షుని త్వరగా పీల్చేసింది. ఆ ఒక్క పనీ ఆయన చేయకపోయుంటే బాగుండేది కదా అని వారి అభిమానులు కొందరనుకోవడం సహజం.
ఏది ఏమైనా శాస్త్రిగారు తెలుగుజాతికి సాహిత్యం రూపంలో తరగనంత నిధిని వదిలి వెళ్లారు. ఆ నిధిని ఎంతమంది పంచుకున్నా పెరిగేదే తప్ప తరిగేది కాదు.ఆయన పాటలపై ఇప్పటికే ఎందరో పీ.హెచ్ డీ లు చేసి డాక్టరేట్లందుకున్నారు.
ఒక్కో పాటలోనూ ఒక్కో లోతైన వ్యక్తిత్వ వికాసం గోచరిస్తుంది. వాటిని ఆస్వాదిస్తూ, ఆలోచిస్తూ జీవితాన్ని వికాసవంతం చేసుకోవడమే ఆయన అభిమానులు, తర్వాతి తరాల వారు తమకు తాము చేసుకోదగ్గ మంచి. అదే సీతారామ శాస్త్రి గారికి నిజమైన నివాళి.

– రవీందర్‌రెడ్డి ఇప్పల

Leave a Reply