మాటలు మూటకట్టుకొచ్చాడు..!

పెను తుపాను
తలొంచి చూస్తే..
తొలి నిప్పు కణం అతడే…

మాటలను నమ్ముకునే
సినిమాకొచ్చాడు..
ఆ మాటలను సంధిస్తునే
జనాల్ని థియేటర్లకు
రప్పిస్తున్నాడు..!

కెవి రెడ్డిది స్క్రీన్ ప్లే పుష్టి..
కె యస్ ప్రకాశరావుది
భారీ సన్నివేశాల దృష్టి..
విశ్వనాధునిది కళాసృష్టి..
దాసరిది డ్రామా పరిపుష్టి..
దర్శకేంద్రుడిది
ఒంపుసొంపుల వృష్టి…
త్రివిక్రముడిది
మాటల కుంభవృష్టి..!

సన్నివేశాల కోసం పదునైన
మాటలు రాసి ఒప్పిస్తాడు..
అప్పుడప్పుడు మాటల
కోసమే సన్నివేశాలు
సృష్టించి నప్పిస్తాడు..
లక్షలు విలువ చేసే అక్షరాలు..
అక్షర లక్షలు..
అక్షరాక్షతలు..
శ్రీనివాసుడి దక్షతలు..
అందుకే ఆయన అక్షరాలు
స్వర్ణాక్షరాలు..
మాటలు శిలాశాసనాలు!

బరువైన సన్నవేశాలు..
భావోద్వేగాలు..
సరాగాలు..విరాగాలు..
ఏ దర్శకుడు
ఎలా కట్టించినా రక్తి..
త్రివిక్రమునిది
మాటల శక్తి.!
ఆయన డైలాగులు
పంచులు కావు..
కొర కంచులు,రాయంచులు..
డబ్బుల సంచులు..!!
అందమైన కథకి
చక్కనైన స్క్రీన్ ప్లే
పంచె కడితే
దానికి సొగసుగా
అమరే జరీ అంచులు..!

ఈ శ్రీనివాసుడికి సినిమా
కానే కాదు జల్సా..
బొమ్మ తియ్యడమే
ఆయనకు కులాసా..
మాటలతోనే థింసా..
నువ్వే నువ్వే అంటూ దిగి
అతడు గా పెరిగి..
ఖలేజా తో మజా చూపి..
అత్తారింటికి దారేది..
సినిమా హిట్టుకు
అత్తను మించిన సెంటిమెంటు తీరేది..
అరవింద సమేత సీత..
ఫ్యాక్షనిజం హింసపై
కీలెరిగి వాత..
ఫెయిలైనా అజ్ఞాతవాసి
తగ్గని వాసి..
అలవైకుంఠపురం..
ట్విస్టుల కాపురం..
భావోద్వేగాల గోపురం..
లాంగుగా ఉండని డైలాగులు
త్రివిక్రమ్ సినిమాని
అందంగా నిలబెట్టే మూపురం..!

అతడి సినిమాలు
ఫ్లడ్ లైట్లు వెలుగుతున్న
తెరపై దాగుడుమూతలు
ఆడిస్తాయి..
బైస్కోపు చూసొచ్చి
పక్క వీధిలో హరికథకి
వెళ్లి వచ్చినట్టు చెప్పిస్తాయి..
అత్తని తీసుకురావడం ఎలా అని పుస్తకం రాపిస్తాయి..
గొప్ప గొప్ప యుద్ధాలన్నీ
నా అనుకున్న వాళ్ళతోనే
జరిపిస్తాయి..
బొమ్మ చూసాక అమ్మా
అనిపిస్తాయి…!

అ తో సినిమా..
అ ఆ తో సినీమాయ..
అం అహా అనేప్పటికి
ఇంకెన్ని మంచి బొమ్మలు వస్తాయో కమ్మహా..!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply