తెలుగు వారి గొప్ప అత్త..
గయ్యాళి పాత్రల పోట్లగిత్త..
తిట్ల పురాణ గజకర్ణ..
తెలుగింటి వంటల అన్నపూర్ణ..
పేరు సూర్యకాంతం..
ఎనలేని ప్రతిభ
ఆమె సొంతం..
మాట సూటి..
వ్యవహారం ధాటి
ఒక తరహా పాత్రలలో
ఆమెకు ఎప్పటికీ
లేనేలేదు పోటీ..
అటు ఎన్టీఆర్…
ఇటు ఏయెన్నార్..
మధ్యలో గుండమ్మ..
ఇద్దరు మహానటులున్న కథకు ఆమే నాయిక..
ఆ సినిమాతోనే అయింది
ఆమె తెలుగు సినిమాకి
తిరుగులేని ఏలిక..
ఈ గుండుబోగుల
గుండమ్మకి
కావాలి అందరి బాగోగులు..
ఆరళ్లు పెట్టింది
మారుటి కూతురు సావిత్రికి
నిజజీవితంలో
తల్లిప్రేమను చూపిందట
అదే అభినేత్రికి..
జమున నుంచి
యమున వరకు
కాంతమ్మే అమ్మ
రామారావు మొదలు
చిరంజీవి దాకా
ఈ కాంతమే అయస్కాంతం..!
పరిశ్రమలో ఎస్వీఆర్
అంటే అందరికీ దడ
ఆ మహానటుడికి
సూర్యకాంతంతోనే రగడ..
చూస్తేనే గడబిడ..
మాయాబజార్ లో
ఆ ఘటోత్కచుడికి మాత
దసరాబుల్లోడులో
మన సూర్యకాంతమ్మ
గొంతు వింటేనే
ఆ బాబాయికి
నిద్ర పట్టని కలత..
ఆమెతో గుమ్మడికి గుండెపోటు
నాగయ్యకు నగుబాటు
రమణారెడ్డికి
పొడుగు సర్దుబాటు..
ఆయన హైటు..
ఈమె వెయిటు
మాస్టార్ మాస్టార్
నీటి వంకాయ్
మాస్టారి పెళ్ళాం ముళ్లవంకాయ్..
ఈ గంటయ్యకు
ఆమె గుండక్క..
ఈయన కోటు డొల్ల వాటం
ఆమె ఎడం చేతి వాటం..
విజయా వారి పతాకం
రెపరెపల గాలివాటం..!
రేలంగికి ఆమె సరిజోడు
వెంకట్రామయ్య నడక
ఆయనంటే
కాంతమ్మకు పడక
జనం నవ్వలేక
సినిమాహాళ్లు పకపకా
రాజబాబుతోనూ జతకట్టి ఫొటో స్టూడియోలో
ఫ్యామిలీ ఫోటోకి ఫోజిచ్చింది
స్క్రీన్ మొత్తంలో..!
ఒకటా రెండా..
వందల సినిమాలు
హాస్యానికి ఆమె చిరునామా
గయ్యాళి పాత్రలకు
ఆమే తెరనామా..
మళ్లీ పుట్టదు
అలాంటి ఓ నటి…
తెలుగు సినిమా చరిత్రలో
గుండక్కది
ఓ ప్రత్యేక సంపుటి..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286