ఒక్క సినిమాతో సూపర్ స్టార్ గా మారిన సినతల్లి

“సూర్యలాంటి స్టార్‌ హీరో ఉన్నా, ఆ పాత్రకు ఫ్లాష్‌బ్యాక్‌, లవ్‌ట్రాక్‌ వంటివేవీ పెట్టలేదు. డ్యుయెట్‌ కూడా లేదు. నిఖార్సయిన కథను అంతే నిజాయతీగా తీశారు…ఈ మాటలు నావి కావు. సినతల్లి పాత్రను పోషించి మెప్పించిన లిజో పత్రికలవారితో చెప్పిన మాటలు. ఇవే మాటలు మనబోటివారు చెబితే కొందరు బాధపడతారు. ఇలాంటి అభిప్రాయాన్నే నేను మూడు రోజులకితం నా ఆర్టికల్లో వ్యక్తపరచాను.
ఓటిటిలో విడుదల అయినప్పటికీ జై భీం సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. భాషాభిమానం, ప్రాంతీయాభిమానానికి అతీతంగా తాను స్వయంగా పెద్ద సూపర్ స్టార్ అయ్యుండీ అతితక్కువ బడ్జెట్ లో ఫైట్లు, పాటలు లేకుండా తన పాత్రను డిజైన్ చూసుకుని సూర్య ప్రదర్శించిన సాహసాన్ని ప్రేక్షకులు ముక్తకంఠంతో కొనియాడుతున్నారు.
ఎప్పుడో డెబ్బై ఏళ్ళక్రితం కెవి రెడ్డి పెద్దమనుషులు పేరుతో ఒక సామాజిక స్పృహ కలిగిన సినిమా తీశారు. ఆ తరువాత పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు, సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి సినిమాలు తీశారు ఆనాటి అగ్రనటులు. చేతులు కాలడంతో మళ్ళీ వాటిజోలికి పోకుండా కమర్షియల్ సినిమాలను తీశారు.
తీర్పు, మార్పు లాంటి ప్రయోగాత్మక సినిమాలు తీశారు విశ్వేశ్వర రావు. కానీ, అవి కమర్షియల్ హిట్స్ కాలేదు.ఆర్ నారాయణ మూర్తి, టి కృష్ణ కూడా సామాజికస్పృహ కలిగిన సినిమాలు తీసినా, టి కృష్ణ మాత్రమే చెప్పుకోదగిన హిట్స్ తీశారు. ఉమా మహేశ్వరరావు తీసిన అంకురం కూడా ఉత్తమ ప్రయోజనాత్మక సినిమాగా పేరు తెచ్చుకుంది.
ఏమైనా యువహీరోలు ప్రవేశించిన తరువాత తెలుగు సినిమా మొత్తం వ్యాపారమయం అయిపొయింది. మలయాళం, తమిళంలో ఏ సినిమాలు వస్తాయా, కోట్ల రూపాయలతో వాటి హక్కులు కొనేసి మక్కీకి మక్కీ లాగిద్దాం అనుకునే హీరోలు, దర్శకులు, నిర్మాతల రాజ్యం నడుస్తున్న ఈ రోజుల్లో ఒక అగ్రహీరోతో జై భీమ్ లాంటి సినిమాను తెలుగులో ఊహించలేము.అందుకే సూర్యకు దేశం మొత్తం నీరాజనాలు పలుకుతున్నది. సినతల్లికి జేజేలు కొడుతున్నారు.

– ఇలపావులూరి మురళీ మోహనరావు

Leave a Reply