Suryaa.co.in

Entertainment

మంచి గయ్యాళి

సూర్యకాంతానికి చెప్పేరా..
ఛాయాదేవికి కూడా చెప్పేయండి..
ఇదీ వరస..
సినిమాలో ఆ గయ్యాళి ఉంటే ఈ గంప ఉండాల్సిందే..
అప్పుడే..
హీరోయిన్ కష్టాలు పెరిగేది..
కుటుంబాలు విడిపోయేది..
హీరో బాధ్యత రెట్టింపయ్యేది..
కథ రక్తి కట్టేది..
సినిమా పండేది..!

రమణారెడ్డి..రేలంగి..
గుమ్మడి..అంతటి ఎస్వీఆర్..
ఎంతటి ఘటికుడైనా
కాంతమ్మ..చాయమ్మ..
చేతిలో పడితే ఉతుకుడే..!

ఛాయాదేవి..
హలాయుధుడు బలరామునే
మాటలతో నిరాయుధుని
చేసిన రేవతి…
ప్రియదర్శినిలో తాను గనిన
స్వర్ణాభరణాల నగిషీని
నామోషీ లేకుండా
రుక్మిణికి అంటగట్టేసిన
యదురాజ పట్టమహిషి..!
ఇక ఉమ్మడికుటుంబాల్లో
గుమ్మడి కుటుంబాల్లో
ఈ దేవి అడుగుపెడితే
దేవేసినట్టే..
నాయిక మెడకు ఉచ్చు..
పచ్చని సంసారాల్లో చిచ్చు..
వీటిలో మన చాయమ్మ
స్పెషలిస్టు..వాటిలో ఆయమ్మ బెస్టు..
ఆమె వచ్చాక
శాంతికి విశ్రాంతి..
ప్రేక్షకుడికి కరవయ్యే మనశ్శాంతి..!

దుర్గమ్మత్తను సాగనంపడమే
అంజికి అవార్డు..
ఆంజనేయ ప్రసాదుకి
అల్లుడిగా రివార్డు..
గుండమ్మకథకి శుభం కార్డు!
పాపం..సొంత అన్నయ్యే
కాకిబుద్ధని సర్టిఫికేటు..
గాంధీ గారి క్లాసా..
మేనకోడలి సరసం..
గుండమ్మకథ నవరసాల్లో
ఛాయమ్మది రౌద్రరసం..
ఆమె వచ్చాక
అంతటి గుండక్కకే
గంటయ్య కాడ నీరసం!

అన్నట్టు…ఈ దుర్గికి
ఓ లవ్ స్టోరీ కూడా ఉందండోయ్..
అది కూడా ట్రై యాంగిల్..
యమున్ని చూసి
ఆమె కళ్ళు జిగేల్..
ఆమెను చూస్తే
సిహెచ్ గుప్తాకి
అదో రకం జిల్..
అబ్బో..అదో యమగోల..!

పూజాఫలంలో సావిత్రి
పుణ్యాన్ని నొక్కేసే ప్లాను..
మధ్యలో గుమ్మడికీ లైను..
ఎల్విజయలక్ష్మి నృత్యం
ఛాయమ్మ పైత్యం..
పౌరాణికాల్లోనూ విలనీ..
అమ్మో…గయ్యాళిగా
ఆమెకెంత పేరనీ..
సినిమాల్లో ముంచేదైనా
నిజ జీవితంలో
సూర్యకాంతంలా
ఛాయాదేవీ మంచిదనీ..
ఆ ఇద్దరి లైఫుల్లో
అదే ఐరనీ..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE