మెగాఫ్యామిలీ ఫ్యాన్స్.. ఇక మారరా?

– హవ్వ.. అమ్మవారి గుళ్లో హుండీపై ఎక్కుతారా
– ‘పువ్వుపార్టీ’ నేతలకు అది అపచారంలా అనిపించలేదా?
– అభిమానుల అరాచకంపై రాంచరణ్ క్షమాపణ చెప్పలేదేం?
– ‘అన్నయ్య’ నుంచి ‘తమ్ముడు’ వరకూ అంతా ఇంతేనా?
– ప్రజారాజ్యం నుంచి జనసేన వరకూ అదే అత్యుత్సాహం
( మార్తి సుబ్రహ్మణ్యం)

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. ఉత్తరాదిలో కపూర్ కుటుంబం మాదిరిగా దక్షిణాదిన తన ఫ్యామిలీ కూడా చిత్రపరిశ్రమలో కలకాలం నిలిచిపోవాలన్నది ఆయన వ్యక్తపరిచిన ఆకాంక్ష. మంచిదే. ఉత్తరాదిన కపూర్ కుటుంబానికి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తరాలు మారినా, జనం ఆ కుటుంబాన్ని, వారి నటనను మర్చిపోరు. బహుశా ‘‘హిందీ చిత్ర పరిశ్రమ ఉన్నంతవరకూ కపూర్ కుటుంబం కొనసాగుతుందేమో’’ అన్నంతగా, ప్రేక్షకులు- కపూర్ ఫ్యామిలీ మధ్య బంధం అలా ఫెవికాల్ మాదిరిగా పెనవేసుకుపోయింది. బహుశా.. మన మెగాస్టార్ కూడా అదే కోణంలో, అలాంటి సదుద్దేశంతోనే తన మనసులోమాటను బయటపెట్టినట్లు ఉండవచ్చు. ఎందుకంటే తాను- తన కొడుకు- తమ్ముళ్లు- తమ్ముడి కొడుకులు- బామ్మర్ది కొడుకు- చెల్లెలి కొడుకులంతా తెలుగు సినీరంగంలో ప్రభవిస్తున్నారు కాబట్టి!
కానీ.. ‘కపూర్’ ఫ్యామిలీకి ఉత్తరాదిలో ఎంత స్టార్-సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్నా, వారి అభిమానులెప్పుడూ ‘అతి’ చేసి, ఇతరులను ఇబ్బందిపాలు చేసిన దాఖలాలు చరిత్రలో లేదు. చొక్కాలు, ఫ్యాంట్లూ చింపేసుకుని, రక్తంతో తిలకాలు దిద్దుకుని ఊరేగిన సందర్భాలు మచ్చుకు ఒక్కటీ కనిపించదు. వెర్రి అభిమానం-పిచ్చి చేష్టలతో చిత్ర విచిత్ర విన్యాసాలు చేసి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన ట్లు భూతద్దం వేసి వెతికినా కనిపించదు. కానీ.. మెగా ఫ్యామిలీకి చెందిన అభిమానులు మాత్రం వాటికి పూర్తి రివర్సు. ఆ ఒక్కటే.. మన తెలుగు మెగాస్టార్ మర్చిపోయినట్లున్నారు. కపూర్ ఫ్యాన్స్‌కూ-మెగా ఫ్యాన్సుకూ అదే తేడా!

సీన్ కట్ చేస్తే…
రెండురోజుల క్రితం దక్షిణాదిన ‘కపూర్ ఫ్యామిలీ తరహా’ను కోరుకున్న మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్‌తేజ, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి అమ్మవారి ఆశీస్సుల కోసం వెళ్లారు. తప్పులేదు. ఎవరి
ram-charan3 నమ్మకం వారిది. సిన్మాహిట్టావలని, రేట్లు కూడా పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లి ఉండవచ్చు. అయితే.. అలాంటి ఆధ్మాత్మిక కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేసి వెళ్లకుండా, దాన్నో ఈవెంట్‌గా మార్చి అమ్మవారి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు.

అబ్బాయి.. అదేనండి.. చరణ్‌బాబు.. గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగి, అమ్మవారి గుడిలోకి వెళ్లేంతవరకూ ఒకటే రచ్చ. అభిమానులు ర్యాలీగా వెళ్లారు. పోనీ వెళ్లిన వారు తిన్నగా ఉన్నారా? అదీ లేదు. అబ్బాయిగారు ఆలయంలో అమ్మవారి సన్నిధిలోకి వెళితే,
durga-temple అభిమానులూ తోసుకుని ఆయనతోపాటు గుళ్లోకి వెళ్లారు. పాపం సిన్మాయాక్టరును చూద్దామని ఉత్సాహంగా స్వాగతం చెప్పేందుకు వెళ్లిన, మహిళా ఈఓను ఈడ్చి పక్కనపడేశారు. భక్తులు నమ్మకంతో వేసే హుండీలపైకి , బూట్లతో ఎక్కి, సెల్ఫీలు దిగారు. ఆలయంలో చరణ్‌బాబుకు జిందాబాదులు కొట్టారు. ఈ జుగుప్సాకరమైన సుందర- సుమధుర- శాస్త్రీయ-ఆధ్మాత్మిక సన్నివేశాలన్నీ సోషల్‌మీడియాలో వైరల్ అయినవే. కల్పించి చెప్పేవేమీ కాదు.

సరే.. ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక పోలీసులు, ఆలయ భద్రతా సిబ్బంది చేతులెత్తేశారే అనుకోండి. గుళ్లోనే అమ్మవారి సేవలో ఉన్న అబ్బాయి బాబు గారయినా.. తన సేవలో తరిస్తున్న అభిమానుల ఆగడాలను
ram-charan-at-the-kanakadurga-temple అడ్డుకోవద్దూ? అక్కడి నుంచి వెళ్లిపొమ్మని గద్దించవద్దూ? ఆలయాల్లో అన్యులకు జిందాబాదులు కొట్టకూడదని గడ్డిపెట్టవద్దూ? అబ్బే.. అలాంటివేమీ కనిపించలేదక్కడ. తన కోసం అమ్మవారి గుళ్లోకి బూటు కాళ్లతో వచ్చిన వారి అత్సుత్సాహాన్ని చూసి, బాబు మురిసి ముక్కలయిపోయారు.

ఈ అరాచకం ముగిసిన తర్వాత దుర్గగుడి పూజాలు, ఆలయంలో సంప్రోక్షణ చేశారట. అంతలావు మెగాస్టార్ గారబ్బాయి, కొత్త సినిమా రేట్లు పెంచేసుకోమని స్వయంగా సీఎం జగనన్నే అనుమతించిన చరణ్‌బాబు.. వందలాదిమంది అభిమానులతో రాకరాక గుడికి వచ్చారు. ఏదో అభిమానులు ‘అత్యుత్సాహంతో కూడిన ఉన్మాదానంద’చర్యలకు పాల్పడ్డారే అనుకోండి. దాన్ని చూసీ చూడనట్లు వదిలేయకుండా.. అలా పాపపరిహారం కోసం సంప్రోక్షణం చేస్తారా? గుడి పెద్దలు, పూజారులకు ఎన్ని గుండెలు?

అసలు ఒక్క ఈ దుర్గగుడి దుర్మార్గమే కాదు. గతంలో ‘మెగా ప్యామిలీ ఫ్యాన్స్’ అత్యుత్సాహ చర్యలు ఎన్నో. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రకటి ంచిన నాటి తిరుపతి సభను తలచుకుంటేనే, అక్కడికి వెళ్లిన నాలాంటి జర్నలిస్టులకు ఆ పీడకల దృశ్యం చెదిరిపోదు. చిరంజీవి చివరలో తన ప్రజారాజ్యం పార్టీ పేరు ప్రకటించారో లేదో, వందలు-వేల సంఖ్యలో అభిమానులు బారికేడ్లు బద్దలుకొట్టుకుని, మధ్యలో కూర్చున్న వారి తలలపైనుంచి స్టేజీపైనున్న చిరంజీవిని చేరుకునేందుకు ఉరికారు.

ముందున్న ప్రెస్‌గ్యాలరీలో కూర్చున్న మాలాంటి జర్నలిస్టులంతా బతుకుజీవుడా అంటూ, స్టేజీ కింద దూరి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోవలసి వచ్చింది. ఈ ఘటన జరిగిన తర్వాత చిరంజీవి గానీ, ఆ పార్టీ పెద్దలు గానీ జర్నలిస్టులకు జరిగిన అసౌకర్యంపై కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత చిరంజీవి పర్యటనలకు వెళ్లిన నాలాంటి జర్నలిస్టులు అనేకసార్లు, ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఇబ్బందిపడ్డవారే. ఆ తర్వాత ముచ్చటగా మూడుచోట్ల నిర్వహించిన ఇంద్ర సినిమా ఫంక్షనూ అంతే. బెజవాడలో బారికేడ్లను విరిచేసిన ‘అభిమానుల క్రమశిక్షణ’ను చూసి అక్కడున్న రాఘవేంద్రరావు-అశ్వినీదత్తు అవాక్కయ్యారు.

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత, విజయవాడ హోటల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించేవారు. అక్కడా అభిమానులది అదే అత్యుత్సాహం. ప్రెస్‌మీట్‌కు వచ్చిన జర్నలిస్టుల కంటే, పవన్ అభిమానుల సంఖ్యే ఎక్కువ. అసలు ప్రెస్‌మీట్లలో అభిమానులను అనుమతించే సంప్రదాయమేమిటో అర్ధం కాదు. పవన్ ప్రసంగం మధ్యలో జిందాబాదుల చిరాకు! చివరాఖరకు పాపం ఆలస్యంగా వచ్చిన జర్నలిస్టులకు, కూర్చునేందుకు కుర్చీలు లేక నిలబడే రాసుకునేవారు. జర్నలిస్టులకు కేటాయించిన కుర్చీలను కూడా అభిమానులే ఆక్రమించుకునేవారు. ఇప్పుడు అబ్బాయి అభిమానుల వంతు! గతంలో రాంచరణ్ సెక్యూరిటీ సిబ్బంది.. దారికి అడ్డుగా వచ్చారన్న కారణంతో, ఒక వ్యక్తిని చితకబాదిన దృశ్యాలు మీడియా-సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిందే.

అయితే ఏమాటకామాట. పాపం కల్యాణ్‌బాబు అప్పటికీ అభిమానులకు తలంటుపోస్తుంటారు. నాగబాబన్నయ్య కూడా జనసైనికులకు క్రమశిక్షణ ముఖ్యమంటూ.. ‘లేని దాని గురించి’ చెబుతుంటారు. పవన్ ప్రసంగం మొత్తం వినకుండా మధ్యలో దూరి.. ‘సీఎం సీఎం’ అంటూ ఒకటే కేకలు, ఈలలు. అయితే వాస్తవంలో జీవించే పవన్ కల్యాణ్ మాత్రం ‘‘అరేయ్ అబ్బాయ్.. మీరు నన్ను సీఎం సీఎం అంటారు. నన్ను చూడ్డానికి వస్తారు. ఓట్లు మాత్రం వేరేవాళ్లకు వేస్తార’’ని అక్కడికీ ఉన్నమాట చెబుతూనే ఉంటారు. అభిమానుల అల్లరితో చిర్రెత్తిన ఆయన.. ‘నేను సీఎంగా ఉండనని’ చెప్పాల్సిన పరిస్థితికి రావలసి వచ్చింది. అయినా మెగా ఫ్యాన్స్‌లో మార్పు లేదు. రాదు.

ఇప్పుడు ఏపీలో పవన్ కల్యాణ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కౌలురైతుల కోసం 5 కోట్ల సొంత డబ్బును విరాళం ఇస్తున్నారు. రైతు కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. నేనున్నానని అభయమిస్తున్నారు. నిజంగా సొంత డబ్బు ఖర్చుపెట్టుకుని, ఈ మాదిరిగా రాజకీయాల్లో సేవ చేసే వారు చరిత్రలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. సినిమాల్లో వచ్చే ఆదాయాన్ని ఇలా ప్రజల కోసం ఖర్చు పెట్టే దమ్ము, తెగువ, పెద్ద మనసు, దయాగుణం ఎంతమంది రాజకీయ నాయకులకు ఉంది?

ఎన్టీఆర్ కూడా తన ఆస్తులను కుటుంబానికి పంచిన తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు. జోలె ఎత్తి విరాళాలు సేకరించడమే తప్ప, ఆయన ఎప్పుడూ ఇలా సొంత డబ్బు ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఎన్నికల్లో డబ్బు పంచను అన్న పవన్.. నిజంగా దానిని తొలిసారి చేసి చూపించారు. అఫ్‌కోర్స్.. దానివల్ల ఆయన సహా అంతా ఓడిపోయినా, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల మెప్పు పొందారు. అదొక సాహసం. అది ఆయనకే చెల్లింది. పవన్ కల్యాణ్‌లో ఉన్న తపన, సమాజంపై ఉన్న చిత్తశుద్ధిని మెచ్చుకోని వారికి, సమాజంపై బాధ్యత లేనట్లే లెక్క.

ఆయన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా లాంటి జర్నలిస్టులు అప్పట్లో ఆయనలోని ఆవేశం, చిత్తశుద్ధి స్వయంగా చూసినవాళ్లమే. ఆయనకు సమాజంపై స్పష్టమైన అవగాహన ఉంది. లేనివారిపై దయ ఉంది. కష్టాల్లో ఆదుకునే పెద్దమనసుంది. కానీ, అభిమానులను నియంత్రించి, వారిని క్రమశిక్షణలో పెట్టే ధైర్యమే లేదు. అది లేనంతవరకూ పవన్ ఆశించిన లక్ష్యం నెరవేరదన్నది ఆయనను అభిమానించే వారి ఉవాచ. ప్రజలు క్రమశిక్షణ ఉన్న పార్టీనే కోరుకుంటారన్నది విస్మరించకూడదు.

బెజవాడలో పవన్ పర్యటనకు ముందుభాగంలో కనిపించే అభిమానుల దృశ్యాలు చూస్తే.. సమాజంలో మార్పు కోరుకునే పవన్‌ను వ్యక్తిగతంగా అభిమానిస్తారే తప్ప, ఆయన పార్టీకి ఓటేసేందుకు అంగీక రించరు. జనసేన రాజకీయ బలహీనతకు ఇదో ప్రధాన కారణం. ఒకరకంగా అభిమానులే పవన్‌కు బలం-బలహీనత.

సరే.. రాంచరణ్‌తేజ అభిమానుల ఆగడం మీడియాలో వచ్చిన తర్వాతయినా..ఆలయాన్ని సంప్రోక్షణ చేసిన తర్వాతయినా.. అబ్బాయిబాబు కనీసం అమ్మవారి భక్తులకు క్షమాపణ చెప్పకపోవడం దారుణం. బహుశా అమ్మవారి కంటే తన ఫ్యామిలీకే ఎక్కువ అభిమానులున్నందున, సారీ చెప్పడాన్ని అవమానంగా ఫీలయి ఉండవచ్చు. అమ్మవారంటే ఆమెకు నోరు లేదు కాబట్టి అడగలేకపోవచ్చు. ఆగ్రహించకపోవచ్చు.

మరి పెద్దనోరు పువ్వుపార్టీ బాసు సోము ఈర్రాజు ఏం చేస్తున్నట్లు? హిందూ మతానికి, ధర్మానికి పెద్దరికం చేసే బీజేపీ వస్తాదులు, వారిని నడిపించే హిందూ సంస్థలు, కాషాయం కట్టిన స్వాములు, ఈ అవమానంపై ఎందుకు నవరంధ్రాలూ మూసుకున్నట్లు? మొన్నీమధ్య తిరుపతిలో టీటీడీ అధికారులు భక్తులను ఆపితేనే, ఆకాశం ఊడి కిందకొచ్చేలా టీవీల్లో తెగ వాంతులు, విరేచనాలూ చేసుకున్న పువ్వుపార్టీ నాయకమ్మన్యులకు.. దుర్గగుడిలో చిరంజీవిగారబ్బాయి ఫ్యాన్స్ అరాచకం అపచారంలా కనిపించలేదా? అది అమ్మవారికి అలంకారంగా కనిపించిందా?

హుండీపైకి బూటు కాళ్లతో ఎక్కి, సెల్ఫీలు దిగిన వైనం.. పువ్వుపార్టీ నేతలకు బ్రహ్మాండమైన సంప్రదాయంలా కనిపించిందా? ఆ అపచారం ఖండించకుండా ఎందుకు నోరుమూసుకున్నట్లు? కోట్లాదిమంది
Ram-Charan-fans-hungama దుర్గామాత భక్తుల మనోభావాలు గాయపరిచినందుకు, చరణ్ బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? బహుశా.. పొత్తులో ఉన్న పార్టీ పెద్ద పవన్‌కు, చరణ్‌బాబు అన్నకొడుకు కాబట్టి.. అబ్బాయ్‌ని విమర్శిస్తే, బాబాయ్‌ను కూడా విమర్శించినట్టవుతుందేమోనన్న మొహమాటమేమో?! లేకపోతే ‘నీది తెనాలి నాది తెనాలి’ అన్న కుల సిద్ధాంతంతో ఈర్రాజన్నయ్య సైలెంటయ్యారా?

Leave a Reply