Home » అవును.. అంతా మీ వల్లే!

అవును.. అంతా మీ వల్లే!

– చివరి మీడియా భేటీలో ఏడ్చినంత పనిచేసిన జగన్
– ఆ ఓట్లన్నీ ఏమయ్యాయో తెలియదన్న ఆవేదన
– ఏడుపు దిగమింగుకుని మరీ ప్రసంగం
– మీడియాకు ప్రశ్నలు వేయనివ్వకుండా జంప్
– ఆఖరి రోజునా అదే అహంకారం
( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్.. అహంకారానికి నిలువెత్తు నిదర్శనం. లెక్కలేని తనానికి పరాకాష్ఠ. ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకున్నా తగ్గని అహంభావం మరోసారి ఆవిష్కృతమయింది. ఫలితాల రోజున జగన్ మీడియాతో మాట్లాడతారని ఆహ్వానం పంపారు. దానితో మీడియా ప్రతినిధులు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరారు. జగన్‌తో మాట్లాడి, ఆయనను చూసి ఎన్నేళ్లయిందో.. కనీసం చివరిరోజునయినా ఆయనను ప్రశ్నించాలన్న అత్యాశతో వెళ్లిన మీడియాకు, చివరాఖరకు మళ్లీ నిరాశే ఎదురయింది. మళ్లీ అదే అహంకార ధోరణి. తాను చెప్పాల్సిందల్లా చెప్పి, మీడియా ప్రశ్నలు వేస్తుంటే వాటికి జవాబివ్వకుండా లేచి వెళ్లిపోయిన అహంకారం దర్శనమిచ్చింది.

ఇక ఈ భేటీలో జగన్.. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్ధ్ చెప్పిన ‘అంతా మీ వల్లే జరిగింది’ అన్న డైలాగు వినిపించారు. ‘ఇలాంటి ఫలితం ఊహించలేదు. పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. ప్రజలకు మంచిచేసినా ఓడిపోయాం. అరకోటి రైతన్నల ప్రేమ ఏమైందో అర్ధం కావడం లేదు. అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అర్ధం కావడం లేదు’ అని దాదాపు ఏడ్చినంత పనిచేశారు. అంటే.. ‘ఇంత చేసినా నాకు మీరు ఓట్లు వేయలేదు. అంతా మీరే చేశారు. మీరే నన్ను ఓడించారు అన్నంతగా రోదించారు’ జగనన్న.

మీడియా సమావేశంలో జగన్ గద్గద స్వరంతో మాట్లాడారు. చివరి పది నిమిషాల ముందు.. తాను ఇంత మంచి పనులు చేసినా ఓడిపోయానని చెబుతున్నప్పుడు ఆయన గొంతు వణికింది. మధ్యలో ఏడుపు దిగమింగుకుని మళ్లీ ప్రసంగం ప్రారంభించారు. ఒక దశలో జగన్ భోరున ఏడ్చేసే వాతావరణం అక్కడ స్పష్టంగా కనిపించింది. అయితే ఆయనను ఓదార్చేందుకు, సర్కారు మాజీ సలహాదారు సజ్జల అక్కడే ఉన్నారనుకోండి. అది వేరే విషయం.

అయితే చింత చచ్చినా పులుపుచావలేదన్నట్లు.. మీడియా పట్ల జగన్ అహంకారవైఖరి మాత్రం అలాగే కొనసాగింది. జగన్ సీఎం అయిన తర్వాత, ఇప్పటివరకూ ఒక్కసారి కూడా మీడియాతో భేటీ కాలేదు. మీడియా ప్రతినిధులు కూడా ఆయనను కలిసిన దాఖలాలు పెద్దగా లేవు. నిజానికి జగన్ ఎప్పుడైనా టీవీ9, ఎన్టీవీ, హెచ్‌ఎంటివితోపాటు.. మరికొన్ని స్థాన విద్వాంస మీడియా సంస్థలను మాత్రమే పిలిచేవారు.

కానీ ఫలితాల రోజు మాత్రం.. మిగిలిన కొందరు జర్నలిస్టుల పుణ్యం పుచ్చిపోయిందట. ఆస్థాన విద్వాంసులు కాకుండా, పాపం ఎప్పుడూ బయట మాత్రమే ఉండే నలుగురైదుగురు జర్నలిస్టులనూ లోపలికి పిలిచారట. దానితో వారి జన్మధన్యమయింది.

Leave a Reply