విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి

– అసెంబ్లీ బరిలో సత్యకుమార్?
– ప్రముఖులను అసెంబ్లీ బరిలోకి దింపుతున్న బీజేపీ

మార్తి సుబ్రహ్మణ్యం

ఏపీలో బీజేపీ వ్యూహం మార్చింది. పొత్తులో తనకు కేటాయించిన అసెంబ్లీ సీట్లలో సమర్ధులు,బలమైన నేతలను ఎంపిక చేసుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమయింది. ఈ నేపథ్యంలో అక్కడ రాష్ట్ర-జాతీయ స్థాయి నాయకులను బరిలో నిలపాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

అందులో భాగంగా కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరిని విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్ధిగా రంగంలోకి దించుతోంది. నిజానికి అది అనూహ్య పరిణామమే. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు వినిపించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లో.. వైసీపీని అన్ని రంగాల్లో ఎదుర్కొనేస్థాయి అభ్యర్ధులను ఎంపిక చేయడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం విఫలమయింది.


తమ చుట్టూ తిరిగేవారిని, తమను సంతృప్తిపరిచేవారిని సిఫార్సు చేయడం, ఏమాత్రం బలం లేని నియోజకవర్గాలు ఎంపిక చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరికొందరు ఢిల్లీకి వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈకమంలోరాష్ట్ర నేతలు కొందరు వైసీపీతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపించాయి.

దీనితో రంగంలోకి దిగిన బీజేపీ నాయకత్వం.. ఏపీకి చెందిన రాష్ట్ర-జాతీయ స్థాయి నేతలను అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వారైతే సమర్ధవంతంగా వైసీపీని ఎదుర్కోగలరని, పైగా అలాంటి వారికి టీడీపీ-జనసేన నుంచి ఓటు కూడా బదిలీ అవుతుందన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

అందులో భాగంగా మాజీ కేంద్రమంత్రి సుజనాచౌదరిని, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. సుజనా అయితే అక్కడ వైసీపీని సమర్ధవంతంగా ఎదుర్కోగలరని భావిస్తోంది. సొంత జిల్లా కావడంతో, అందుకు ఆయన కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. సుజనా అసెంబ్లీ బరిలోదిగితే ఆ ప్రభావం విజయవాడ పార్లమెంటుపై పడి, ఎన్డీఏ అభ్యర్ధి విజయానికి దోహదపడుతుందని బీజేపీ శ్రేణులు విశ్లేషిస్తున్నారు.

ఇక బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకమార్‌కు సైతం అసెంబ్లీకి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా అసెంబ్లీకి పోటీ చేయించడం ద్వారా, రాష్ట్రంలో పార్టీ బలంగాఉందన్న సంకేతం పంపించాలని బీజేపీ నిర్ణయించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ సీట్లు ఆశిస్తున్న ప్రముఖులను అసెంబ్లీకి పంపాలని నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

Leave a Reply