Home » తెలంగాణ కాంగ్రెస్ గద్దెపై సీతక్క?

తెలంగాణ కాంగ్రెస్ గద్దెపై సీతక్క?

– ఫలితాల తర్వాత ప్రకటన
– ఫలించిన రేవంత్ ఒత్తిడి
– ఇరులుంటే పార్టీ-పాలనలోఇబ్బంది
– సీతక్క ఉంటే సాఫీగా నిర్ణయాల అమలు
– పైగా గిరిజనురాలికి పట్టం కట్టామన్న కీర్తి
– మంత్రివర్గ విస్తరణ కూడా అప్పుడే
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా గిరిజన మహిళ, మంత్రి సీతక్కను నియమించేందుకు రంగం సిద్ధమయిందా? ఆమె ఉంటే పార్టీ-ప్రభుత్వంలో భవిష్యత్తులో తీసుకోబోయే, తన నిర్ణయాలు సాఫీగా అమలవుతాయని రేవంత్ భావిస్తున్నారా? అందుకే అధిష్ఠానంపై ఒత్తిడి చేసి మరీ సీతక్కను, పీసీసీ గద్దెపై కూర్చోబెట్టేందుకు ప్రయతిస్తున్నారా? పార్లమెంటు ఎన్నికల ఫలతాల తర్వాత, సీతక్కకు పీసీసీ పట్టం కట్టడం ద్వారా.. తొలిసారి గిరిజన మహిళకు పార్టీ పగ్గాలిచ్చిన ఘనతను రేవంత్ సొంతం చేసుకోబోతున్నారా?.. సీతక్కకు పీసీసీ పీఠం కట్టబెట్టడం ద్వారా, రేవంత్ పార్డీపై తన పట్టుకొనసాగించనున్నారా?.. ఇదీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్.

మంత్రి సీతక్కకు ప్రమోషన్ లభించబోతోంది. తొలి గిరిజన మహిళ సీతక్క, తెలంగాణ పీసీసీ చీఫ్‌గా గద్దెనెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం రే వంత్‌రెడ్డి అనుచరురాలు.. ఆయన అమితంగా అభిమానించి, గౌరవించే సీతక్కకు పీసీసీ పీఠం కోసం, రేవంత్ ఆమేరకు చేసిన ఒత్తిడి ఫలించినట్లు తెలుస్తోంది. ప్రతి రాఖీ పండుగకు రేవంత్‌కు, సీతక్క రక్షాబంధన్ కడుతుంటారు. పైగా ఇద్దరూ ఒకేసారి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారే. మంత్రివర్గంలో సీతక్కకు స్థానం దక్కడానికి సైతం, రేవంత్ కారణమన్నది బహిరంగ రహస్యం. అలాంటి విశ్వసనీయురాలైన సీతక్కకు, పీసీసీ పట్టం కట్టేందుకు రేవంత్ ఒత్తిడి ఫలించినట్లేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం రేవంత్‌రెడ్డి అటు పీసీసీ చీఫ్-ఇటు సీఎంగా, రెండు పాత్రలూ జమిలిగా పోషిస్తున్నారు. దానితో అటు రెండింటిపైనా సీరియస్‌గా దృష్టి సారించలేకపోతున్నారు. పైగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగారు. లోక్‌సభ అభ్యర్ధులకు భారీ స్థాయిలో ఆర్ధిక సాయం చేసి, పార్టీ ఉనికి కొనసాగించే లక్ష్యంలో ఉన్నారు. అటు బీజేపీ కూడా కాంగ్రెస్‌పై తన దాడిని పెంచుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోందన్న జోస్యాలతో గందరగోళం మొదలయింది. అటు ఎన్నికల హామీలు కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అది చేయాలంటే కేవలం ప్రభుత్వంపైనే, పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది.

అదే సమయంలో ఇటు పార్టీపైనా తన పట్టు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌లో తనకంటే సీనియర్లలో చాలామందికి, నేరుగా హైకమాండ్‌తో సత్సంబంధాలున్నాయి. కాంగ్రెస్‌లో ఎవరినీ తక్కువ అంచనావేయడానికి వీలు లేదు. ఎవరి దారులు వారికి ఉంటాయి. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్‌కు హైకమాండ్‌లో ఎలాంటి ఇబ్బందులూ లేవు. పార్టీ అవసరాలు తీరుస్తున్నందున, పార్టీ నాయకత్వం ఆయనపై సానుకూలంగానే ఉంది. అయినా సరే.. రాష్ట్రస్థాయిలో పీసీసీ చీఫ్‌గా, తన వర్గీయులు ఉండటమే రేవంత్‌కు సేఫ్ అన్నది సీనియర్ల విశ్లేషణ.

అంటే.. పీసీసీ చీఫ్‌గా బలమైన సీనియర్ నాయకుడిని నియమిస్తే, పాలనాపరంగా-పార్టీపరంగా రేవంత్‌కు సమస్యలు తప్పవు. నిజానికి కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. సీఎంకు సమానమైన ప్రాధాన్యం, పీసీసీ చీఫ్‌కు ఉంటుంది. అంటే పార్టీ పదవుల నుంచి.. నామినేటెడ్ పోస్టులు, వివిధ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక వరకూ పీసీసీ చీఫ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. చివరకు మంత్రివర్గ విస్తరణ కూర్పులో కూడా పీసీసీ చీఫ్‌తో సమన్వయం చేసుకోవలసిందే. ఏ నిర్ణయమైనా సీఎం సొంతగా తీసుకోవడానికి లేదు. ఏ జాబితాలైనా కలసి సమన్వయంతో ఢిల్లీకి పంపిచాల్సిందే.

ఆ ప్రకారంగా ఎవరైనా సీనియర్ నేత పీసీసీ అధ్యక్షుడయితే, రేవంత్‌కు సహజంగా పార్టీపై ఉన్న పట్టు తగ్గిపోతుంది. ఇప్పటివరకూ జిల్లా పార్టీ అధ్యక్షులు, పీసీసీ పదవుల ఎంపికలో.. పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. వేరే నేత ఆ స్థానంలోకి వస్తే, రేవంత్‌కు సహజంగా ఆ స్థాయి ప్రాధాన్యం ఉండదన్నది బహిరంగం. అప్పుడు కొత్త చీఫ్ తన ప్రాధాన్యాతల ప్రకారం నియామకాలు చేస్తారు. ఆ క్రమంలో ఆయన వర్గానికి ఎక్కువ పదవులు దక్కుతాయి. అప్పుడు.. ఇప్పటివరకూ రేవంత్ అనుచరవర్గంగా పేరున్న వారికి పదవులు ఆ స్థాయిలో దక్కవు. ఫలితంగా పార్టీపై రేవంత్ ముద్ర క్రమంగా తగ్గిపోతుంది.

ఈ కూడికలు-తీసివేతలూ, ఇతర అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతనే రేవంత్‌రెడ్డి.. తన వర్గీయురాలయిన సీతక్కను, పీసీసీ గద్దెపై కూర్చోబెట్టాలన్ననిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి సీనియర్ నేత, పార్టీ కష్టకాలంలో కూడా వేరే పార్టీకి వెళ్లకుండా పార్టీనే నమ్ముకున్న మహేష్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ పేర్లు తొలుత పీసీసీ చీఫ్ రేసులో వినిపించాయి. మహేష్‌కు రేవంత్ వర్గంగా పేరున్నప్పటికీ, కే సీఆర్ హయాంలో ఆ పార్టీని బాగా ఎదుర్కొన్నారు. ఆయనపై అందరికీ సానుభూతి ఉంది. ఇక మధుయాష్కీకి రాహుల్‌గాంధీతో సత్సంబంధాలే ఉన్నాయి. ఆయన కూడా పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన నాయకుడే. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఉంది.

అయినప్పటికీ.. రేవంత్‌రెడ్డి మంత్రి సీతక్కవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె పీసీసీ చీఫ్ అయితే తన వ్యూహాలు-నిర్ణయాల అమలుకు, ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నది రేవంత్ భావనగా కనిపిస్తోంది. పైగా ఆమెకు పార్టీలో సొంత వర్గమంటూ లేదు కాబట్టి, అది రేవంత్‌కు కలసివచ్చే అంశం. మహిళ పైగా గిరిజనురాలు కాబట్టి, సీనియర్లు కూడా స్వరం పెంచే అవకాశాలు ఉండవు. పంచాయితీలకు అవకాశాలు తక్కువ. దానితో రేవంత్ తన పదవీకాలం ముగిసే లోగా పార్టీపరంగా, తన కు ఇబ్బందులు-అవరోధాలు-వ్యతిరేకత లేకుండా చూసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ వ్యూహంతోనే ఆయన, సీతక్క పేరు పీసీసీ చీఫ్‌కు ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు చెబతున్నాయి.

కాగా రేవంత్ ప్రతిపాదనలకు నాయకత్వం నుంచి, పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, సీఎంకు సరిసమాన నేతకు పీసీసీ పగ్గాలిస్తుంటుంది. ఎందుకంటే సీఎం ఎదగకూడదన్న, విభజించి పాలించే వైఖరి. ఇద్దరూ తన వద్దకే రావాలన్న రాజకీయ తంత్రం. అందుకే కాంగ్రెస్ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో, సీఎంలకు-పీసీసీ చీఫ్‌లకూ పడదు. మరి తెలంగాణలో కూడా ఆ సూత్రం అమలుచేస్తుందా? లేదా అన్నదే అందరి సందేహం.

ఆ రకంగా కాంగ్రెస్ నాయకత్వం ఎవరికీ అధికారం ఇవ్వకుండా తంపులు పెట్టి తమాషా చూసే పాత సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను ‘అన్ని విధాలా ఆదుకుంటుందన్న’ది రేవంత్‌రెడ్డి మాత్రమే. రాహుల్‌గాంధీ కూడా ఆయనంటే ఫిదా అవుతున్నారు. తెలంగాణ ఇన్చార్జి కూడా రేవంత్‌పై సానుకూలంగానే ఉన్నారు. ఇంకెవరైనా ఢిల్లీ పార్టీ సీనియర్లు జోక్యం చేసుకుని, అడ్డుపుల్లలు వేయకపోతే.. రేవంత్ కోరుకున్నట్లు.. సీతక్క పీసీసీ చీఫ్ కావడానికి పెద్ద అవరోధాలు లేవన్నది కాంగ్రెస్ సీనియర్ల విశ్లేషణ.

కాగా పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు. అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా పూర్తి అవుతుంది. ఈ ఫలితాల తర్వాత, తమ జిల్లాల్లో ప్రతిభ కనబరచని మంత్రులను తొలగించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply