Suryaa.co.in

Editorial

ఒక స్కిల్.. వంద ప్రశ్నలు!

– స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సందేహాలకు దొరకని సందేహాలెన్నో
– తన వాంగ్మూలం ఆధారంగానే కేసు పెట్టామనడంపై పివి రమేష్ అభ్యంతరం
– సీఎంను అరెస్టు చేయడం అసంబద్ధమని వాదించిన రమేష్
– శాఖల నిర్ణయాలతో సీఎంలకు ఏం సంబంధమన్న ప్రశ్న
– ఇంతకూ కుంభకోణం సొమ్ము ఏ అకౌంట్లలోకి వెళ్లిందో తేల్చరేం?
– చంద్రబాబు అకౌంట్‌లోకి వెళితే ఆ వివరాలు వెల్లడించరేం?
– షెల్ కంపెనీల అకౌంట్లు సీఐడీ సీజ్ చేసిందా?
– మరి షెల్ కంపెనీ యజమానులను అరెస్టు చేయలేదేం?
– సీమెన్స్ ప్రతినిధిని కేసులో ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదు?
– కేసులో ఐఏఎస్ ప్రేంచంద్రారెడ్డి, అజయ్‌కల్లంరెడ్డి ప్రస్తావనేదీ?
– వారిని సీఐడీ, ఏసీబీ ఎందుకు అరెస్టు చేయలేదు?
– ప్రేంచంద్రారెడ్డి లేఖలను సిట్ పరిశీలించిందా?
– కనీసం సాక్షిగా కూడా ఆయనను చేర్చలేదెందుకు?
– క్యాబినెట్ ప్రతిపాదన పంపిన అజయ్‌కల్లం రెడ్డిని విస్మరించారేం?
– స్కిల్ కేసులో వారిద్దరి పాత్ర లేదని ఎలా నిర్థారించారు?
– సెలక్షన్ కమిటీలోని రావత్, ఉదయలక్ష్మిని విచారించారా?
– అప్పటి స్కిల్ శిక్షణపై ఎంపీ అర్జా శ్రీకాంత్ ప్రశంసపై విచారించరేం?
– తమకు పనిముట్లు రాలేదని ఏ శిక్షణా సంస్థలైనా ఫిర్యాదు చే శాయా?
– సీఎంపై కేసుపెడితే అప్పటి సీఎస్, సెక్రటరీలపైనా కేసు పెట్టరేం?
– జగన్‌పై ఏసీబీ కేసులో ఆయన న్యాయవాది అదే వాదించారు కదా?
– ఏఐఎస్‌లను బాధ్యులను చేయాలని జగన్ లాయర్ వాదించడం విస్మరించారా?
– జగన్ కేసులో మంత్రి సబితా ఆదేశాలతోనే సంతకం చేశానన్న శ్రీలక్ష్మి
– అయినా శ్రీలక్ష్మినే అరెస్టు చేసి జైలుకు పంపిన కోర్టు
– ఆ సూత్రం స్కిల్ కేసులో ఐఏఎస్ అధికారులకు వర్తించదా?
– ఇంతకూ డీఐజీ రఘురామిరెడ్డి ఏ హోదాలో కేసు పర్యవేక్షిస్తున్నారు?
– ఆయన ఏ విభాగంలో ఉన్నారని ప్రశ్నించిన ఎంపి రఘురామకృష్ణంరాజు, ధూళిపాళ్ల
– కేసు ఏసీబీదైతే.. సీఐడీకి సంబంధమేమిటి?
– సర్కారును ప్రశ్నాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విపక్షాలు
– స్కిల్ కేసులో దొరకని జవాబులపై చర్చ లాంటి రచ్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇటీవల లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన ఏపీ సీఎం జగనన్న.. వచ్చీరాగానే ఆగమేఘాలపై స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై సమీక్ష నిర్వహించారట. ఆ సందర్భంగా తన రాజకీయ శత్రువైన చంద్రబాబును జైలుకు పంపించిన, ఏఏజీ సుధాకర్‌రెడ్డి ఆర్య్గుమెంటు ‘స్కిల్’.. కేసును పకడ్బందీగా దట్టించిన నిఘా దళపతి ‘స్కిల్’ను తెగ మెచ్చేసుకుని, వారందరికీ వీరతాళ్లు వేశారన్నది మీడియాలో వచ్చిన వార్త. అంటే బాబును అరెస్టు చేసిన ‘స్కిల్’కేసులో.. అధికారులు ప్రదర్శించిన ‘స్కిల్’కు, సీఎం జగనన్న ఫిదా అయ్యారన్నమాట.

బాగానే ఉంది. స్కిల్ కేసులో అవినీతికి పాల్పడ్డారన్న అభియోగంతో విపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడును అరెస్టు చేసి, జైలు పంపించారు. దానితో రోజూ నేతలు, కార్యకర్తలతో బిజీగా ఉండే చంద్రబాబు.. ఒంటరిగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో, తన బ్యారెక్‌లో ఉంటున్నారు. ఆయన స్కిల్ కేసులో అపరాధి అని, తన ముందున్న సాక్ష్యాల మేరకు కోర్టు నమ్మితే, బాబును కచ్చితంగా శిక్షిస్తుంది. దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపించకపోతే.. బెయిల్ ఇవ్వడమో, లేదా బాబు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్‌ను సమర్ధించి, కేసును క్వాష్ చేయడమో చేస్తుంది. ఇవన్నీ కోర్టులో తేలాల్సిన అంశాలు.

అవినీతికి పాల్పడిన ఎవరినైనా శిక్షించాల్సిందే. దానిని ఎవరూ వ్యతిరేకించరు. కానీ.. విచారణ సంస్థలు ఆ మేరకు, చిత్తశుద్ధితోనే విచారణ నిర్వహించారా? లేక సూరిబావ టైపులో.. పైవారి కళ్లలో ఆనందం కోసం చంద్రబాబును జైల్లో వేశారా అన్నదే ముఖ్యం. ప్రభువులను పరమానందపరిచే తొందరలో తప్పులో కాలేస్తే, సహజంగా అది రచ్చ లాంటి చర్చ అవుతుంది.

ఇప్పుడు ‘స్కిల్’ కేసులో సరిగ్గా అదే జరుగుతోందన్నది, విపక్షాలు- ప్రజాస్వామ్యవాదుల విమర్శ. ఆ మేరకు చంద్రబాబు అరెస్టు తర్వాత సంధిస్తున్న సందేహాస్త్రాలు.. ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ చర్చలాంటి రచ్చేమిటో ఓసారి చూద్దాం.

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల కేసులో.. మాజీ సీఎం చంద్రబాబునాయుడును అరెస్టు చేసిన సీఐడీ దర్యాప్తు తీరుపై అటు విపక్షాలు, ఇటు సోషల్‌మీడియాలో నెటిజన్లు శరపరంపరగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. అది చాలదన్నట్లు.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేస్తున్న ప్రశ్నలు, ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు అయితే ఓ అడుగు ముందుకేసి.. అసలు ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై, హైకోర్టు అంతర్గత విచారణ జరిపించాలన్నారు. ఆమె బంధువుల ఫోన్ల డేటాను కూడా తీసుకోవాలంటూ చేసిన డిమాండ్ సంచలనం సృష్టించింది.

మాజీ సీఎం, విపక్ష నేతలను అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలన్న నిబంధనను, సీఐడీ ఉల్లంఘించిందంటూ.. టీడీపీ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే స్పీకర్‌కు సమాచారం ఇస్తే సరిపోతుందని, గవర్నర్ అనుమతి అవసరం లేదన్నది ప్రభుత్వ న్యాయవాదుల వాదన. వీటిని పక్కనపెడితే… అసలు ఈ కేసులో సీఐడీ విచారణ పద్ధతులు పాటించలేదన్నది మెజారిటీ వర్గాల వాదన.

నంద్యాల పర్యటనలో ఉన్న బాబు అరెస్టు వ్యవహారాన్ని… దగ్గరుండి పర్యవేక్షించిన డీఐజీ రఘురామిరెడ్డి పాత్ర, ఈ కేసులో ఏమిటన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఇంటెలిజన్స్‌లో ఉన్న ఆయన, నంద్యాలలో విపక్ష నేత వద్దకు ఏ హోదాలో వెళ్లారు? ఈ కేసు ఏసీబీకి సంబంధించినదయితే.. నిఘా విభాగంలో ఉన్న ఆయన నంద్యాలకు వెళ్లి, చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ఆయనతో ఏ హోదాలో మాట్లాడారంటూ.. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రతోపాటు, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంధించిన ప్రశ్నలకు, పోలీసు శాఖ నుంచి ఇప్పటిదాకా జవాబు లేకపోవడం ఆశ్చర్యం. అసలు రఘురామిరెడ్డి ఇప్పుడు ఇంటలిజన్స్‌లో ఉన్నారా? సీఐడీలో ఉన్నారా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని ఎంపీ రాజు డిమాండ్ చేశారు.

స్కిల్ కేసులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణతో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ. ఆ మేరకు ఆయన అకౌంట్ లోకి ఎంత బదిలీ అయింది? అది ఏ అకౌంట్ నుంచి వెళ్లింది? అని సీఐడీ ఎందుకు తేల్చలేదు? ఆ డబ్బంతా షెల్ కంపెనీల ద్వారా బాబుకు చేరిందని ఆరోపిస్తున్న వాళ్లు.. పోనీ ఆ షెల్ కంపెనీలు ఏమిటన్నది గుర్తించారా? లేదా? ఆవిధంగా గుర్తిస్తే, సదరు షెల్ కంపెనీ అధిపతులను ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

అక్రమాస్తుల కేసులో జగనన్నను అరెస్టు చేసిన సీబీఐ.. ఆ మేరకు ఏయే కంపెనీలు ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి? ఏయే అకౌంట్ల నుంచి జగన్ కంపెనీల్లోకి వచ్చాయి? అందుకు ప్రతిగా వైఎస్ ప్రభుత్వం, వారికి ఏవిధంగా మేళ్లు చేకూర్చిందన్న వివరాలను కోర్టుకు సమర్పించింది. అదేవిధంగా.. స్కిల్ కేసులో సీఐడీ అధికారులు కూడా, చంద్రబాబుకు ఏయే అకౌంట్ల నుంచి డబ్బులు అందాయన్నది నిరూపించకుండానే, అరెస్టు చేయటంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.

ప్రధానంగా నాడు స్కిల్ కేసులో ప్రధాన పాత్ర పోషించిన అప్పటి ఐఏఎస్ అధికారులయిన ప్రేంచంద్రారెడ్డి-అజయ్‌కల్లం రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు? కనీసం వారిని సాక్షులుగా ఎందుకు చేర్చలేదు? స్కిల్ శిక్షణను ప్రశంసించిన అప్పటి అధికారి అర్జా శ్రీకాంత్‌ను ఎందుకు విచారించలేదు? కుంభకోణం జరిగిన సమయంలో సీఎంగా ఉన్నందునే చంద్రబాబును అరెస్టు చేస్తే.. మరి వాటిని పర్యవేక్షించిన అప్పటి సీఎస్ కృష్ణారావు, సెక్రటరీలుగా ఉన్న ప్రేంచంద్రారెడ్డి, అజయ్ కల్లం రెడ్డితోపాటు.. అప్పటి సెలక్షన్ కమిటీలో సభ్యులైన రావత్, ఉదయలక్ష్మిని ఎందుకు విచారించి అరెస్టు చేయలేదన్నది మరో ప్రశ్న.

కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో, జగన్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే.. నిర్ణయాలు తీసుకున్న ఐఏఎస్‌లను ఎందుకు విడిచిపెడుతున్నారు? వాటికి అధికారులే బాధ్యులంటూ, జగన్ తన కేసులో వాదించారు. ఆ వాదన ప్రకారమే బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి వంటి అధికారులు జైలు పాలయ్యారు. ఇప్పుడు స్కిల్ కేసులో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అదే లాయర్ సుధాకర్‌రెడ్డి.. అదే సూత్రం ప్రకారం అజయ్‌కల్లంరెడ్డి, ప్రేం చంద్రారెడ్డిని కూడా అరెస్టు చేయాలని ఎందుకు వాదించడం లేదని, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సంధిస్తున్న మరో ప్రశ్న.

స్కిల్‌తో ఒప్పందం కోసం.. గుజరాత్‌కు అధ్యయనం కోసం వెళ్లిన అధికారులు చేసిన సిఫార్సులను, సీఐడీ ఎందుకు పరిశీలించలేదు? అసలు క్యాబినెట్ ప్రతిపాదనలు చేసిన అజయ్‌కల్లంరెడ్డి, నిధులు మంజూరు చేసిన ప్రేంచంద్రారెడ్డిని ఈ కేసులో కనీసం సాక్షులుగా ఎందుకు పెట్టలేకపోయారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వం-సీమెన్స్- టెక్ సంస్థ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగితే.. చంద్రబాబుతోపాటు, సీమెన్స్‌ను ఎందుకు ముద్దాయిగా చేర్చలేదన్న ప్రశ్న, సర్కారుకు ఇరకాటంగా మారింది.

నాటి ఐఏఎస్ పివి రమేష్ వాంగ్మూలం ఆధారంగానే చంద్రబాబుపై కేసు పెట్టిన సీఐడీ.. అసలు నోట్‌ఫైల్ లేకుండా, సీఎంను అరెస్టు చేయడం అసంబద్ధమని అదే రమేష్ ఇప్పుడు అడ్డం తిరిగారు. స్కిల్ కేసులో నిర్ణయాలు తీసుకున్న ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలన్న రమేష్ వ్యాఖ్యలతో సీఐడీ కుడితిలో పడినట్లయింది. తన వాంగ్మూలాన్ని సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందన్నది ఆయన అనుమానం.

ఇక స్కిల్ అక్రమాల కేసు ఏసీబీ పరిథిలోకి వస్తుంది. కానీ ఈ కేసును విచారించింది మాత్రం సీఐడీ. బాబు అరెస్టును స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించిందేమో ఇంటలిజన్స్ డీఐజీ రఘురామిరెడ్డి. ఆ ప్రకారంగా ఆయన ఏ విభాగానికి బాధ్యుడిగా ఉన్నారు? ఇంటలిజన్స్-సీఐడీ-ఏసీబీ-సిట్‌కి ఆయనే ఉమ్మడి అధికారిగా ఉన్నారా? ఆ మేరకు ఏమైనా అధికారిక ఉత్తర్వులిచ్చారా? ఒకవేళ ఇస్తే ఒక అధికారికి అన్నేసి పోస్టులివ్వవచ్చా అన్నది ఎంపీ రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వంటి నేతల ప్రశ్న. సందేహాలు సరే… సమాధానాలిచ్చేదెరన్నదే ప్రశ్న.

LEAVE A RESPONSE