నాన్ లోకల్స్‌కు సీట్లెలా ఇస్తారు?

-నాలుగోవంతు కమ్మవారికి ఇస్తారా?
-ఎచ్చెర్లలో కమ్మవాళ్లున్నారా?
-అనకాపల్లిలో వెలమల సంఖ్య ఎంత?
-పనిచేసిన జీవీఎల్, మాధవ్‌కు ఇవ్వరా?
-కాపు,బీసీలకు ఇవ్వరా?
-పురందేశ్వరి తీరు వల్లే పార్టీ తిరోగమనం
-ఈ పరిస్థితిలో మేం పనిచేయలేం
-బీజేపీ అగ్రనేతలపై ఉత్తరాంధ్ర నేతల ఫైర్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఉత్తరాంధ్ర బీజేపీలో అసమ్మతి రాజుకుంది. ఏళ్ల తరబడి స్థానికంగా ఉంటూ పార్టీ విస్తృతి కోసం పనిచేసిన వారిని కాదని, అసలు ఉత్తరాంధ్రతో ఎలాంటి సంబంధం లేని స్థానికేతులు .. ఢిల్లీలో మేనేజ్ చేసుకుని టికెట్ తెచ్చుకుంటే మేం పనిచేయాలా? బీసీ నియోజకవర్గమైన ఎచ్చెర్లలో కమ్మ కులానికి సీటెలా ఇస్తారు? అక్కడున్న కమ్మ వారి సంఖ్య ఎంతో మీకు తెలుసా? అనకాపల్లిలో వెలమ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయో మీ దగ్గర సమాచారం ఉందా? ఉత్తరాంధ్రలో సామాజికవర్గ సంఖ్య లేని కమ్మ-వెలమ కులాలకు సీట్లు ఎలా ఇస్తారు? కాపులు-బీసీలకు ఇవ్వరా? క్షమించండి. మీ పద్ధతి బాగోలేదు. అందుకే మేం పనిచేయలేం.. అని నిర్మొహమాటంగా బీజేపీ ఢిల్లీ దూతలను దులిపేసిన కమలనాధుల తెగింపు ఇది.

ఎన్నికల్లో పార్టీ నేతలను సమన్వయపరిచి, కూటమిలో దక్కిన అభ్యర్ధులను గెలిపించుకునేందుకు వచ్చిన బీజేపీ దూతలకు, ఉత్తరాంధ్ర నేతలు ప్రశ్నలతో చుక్కలు చూపించారట. ఆ మేరకు విశాఖ పార్టీ ఆఫీసులో జరిగిన పార్టీ నేతల భేటీలో విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి పార్లమెంటులోని బీజేపీ నేతలు టికెట్ల పంపిణె పై అగ్గిరాముళ్లయ్యారట. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉత్తరాంధ్ర బీజేపీ నేతలతో ఏపీ ఇన్చార్జిగా వచ్చిన జాతీయ పార్టీ కార్యదర్శి అరుణ్‌సింగ్, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్జీ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా అనకాపల్లి ఎంపి, విశాఖ, ఎచ్చెర్ల అసెంబ్లీ అభ్యర్ధులను గెలిపించేందుకు కృషి చేయాలని అరుణ్ సింగ్ సూచించారు.

ఆ తర్వాత సమావేశంలో మాట్లాడిన పలువురు సీనియర్లు.. విశాఖలో ఎంపి జీవీఎల్ నరసింహారావు గత మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఆ సీటు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఉత్తరాది ఓటర్లు, కేంద్రప్రభుత్వ ఓటర్లు ఎక్కువగా ఉన్న విశాఖ సీటును ఏ కారణంతో తీసుకోలేదు? పార్టీ కోసం పనిచేస్తున్న మాధవ్‌కు ఎందుకు సీటివ్వలేదని నిలదీశారు.

ఎచ్చెర్లలో అత్యధిక శాతం బీసీలు ఉంటే, అక్కడ కమ్మ వర్గానికి సీటెలా ఇస్తారు? పది కుటుంబాలు కూడా ఉండవు. అసలు అక్కడ వారి ఓట్లు ఉన్ని ఉన్నాయో మీకు తెలుసా? మేడమ్ అడిగితే ఇచ్చేస్తారా? ఈశ్వర్‌కు ఉన్న స్థానబలం ఎంత? అనకాపల్లిలో వెలమల సంఖ్య ఎంతో మీదగ్గర సమాచారం ఉందా? కొప్పుల వెలమ అయిన వైసీపీ అభ్యర్ధి బూడి ముత్యాలనాయుడుకు ఓటు వేస్తారా? బయట నుంచి వచ్చిన వెలమ కులానికి చెందిన సీఎం రమేష్‌కు కొప్పుల వెలమలు ఓటు వేస్తారా?

అసలు ఇక్కడ కమ్మ-వెలమల సంఖ్య ఎంత? నాలుగోవంతు కమ్మ-వెలమలకే ఇస్తారా? కాపులు, బీసీలు పనికిరారా? అంటే మీరు ఐబీ రిపోర్టులు కూడా తెప్పించుకోరా? స్థానిక నేతల అభిప్రాయాలు అవసరం లేదా? మీ ఇష్టం వచ్చిన వారికి సీట్లు ఇచ్చి, ఇప్పుడు మమ్మల్ని గెలిపించాలని కోరడం భావ్యమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీరు వల్లే రాష్ట్రంలో పార్టీ తిరోగమనంలోకి వెళ్లిందని, స్థానికేతరులకు సీట్లు ఇచ్చి స్థానిక నేతలను అవమానిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో పార్టీకి పనిచేయడం కష్టమని, వారు నిర్మొహమాటంగా ఢిల్లీ దూతలకు చెప్పారు. ప్రస్తుతం ఇది ఉత్తరాంధ్ర బీజేపీ వర్గాలలో హాట్‌టాపిక్‌గా మారింది.

Leave a Reply